విశాఖపట్నం: చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని చంద్రబాబు అరెస్టుతో ప్రజలందరికీ ఒక మంచి సందేశం వెళ్లిందని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సీఐడీకి దొరికిపోయిన చంద్రబాబును అరెస్టు చేస్తే రాజకీయ కుట్ర, కక్షసాధింపు అంటూ టీడీపీ నేతలు, దత్తపుత్రుడు, బాలకృష్ణ మాట్లాడుతున్నారని, తప్పు చేస్తే సామాన్యుడిని మాత్రమే అరెస్టు చేసే చట్టాలను టీడీపీ ఏమైనా తెచ్చిందా..? అనుభవం ఉంటే తప్పు చేస్తే అరెస్టు చేయకూడదా..? అని ప్రశ్నించారు. విశాఖపట్నంలో మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడారు. నిన్న రాష్ట్రంలో ఎలాంటి బంద్ జరగలేదని, ప్రజలంతా యధావిధిగా వారి జీవన విధానాన్ని కొనసాగించారని చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారని సీఐడీ ఆధారాలతో సహా అరెస్టు చేసిందన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ఎందుకు ఆయన తరఫు లాయర్లు వాదించడం లేదని ప్రశ్నించారు. ఎంతసేపూ గవర్నర్‌కు చెప్పలేదు, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేదనే చిన్న చిన్న కారణాలు ఎందుకు వెతుక్కుంటున్నారు.. తప్పు చేయలేదని ఎందుకు వాదించడం లేదని నిలదీశారు. తప్పు చేసి మళ్లీ అక్రమ అరెస్టు అంటూ ప్రభుత్వం మీద, సీఎం వైయస్ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబుకు పూర్తి భద్రత ఉందని, ఆయన కోరిన రీతిలో ఆహారం, సహాయకులను ఏర్పాటు చేశామని చెప్పారు. రాజకీయం కోసమే భద్రత లేదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, చంద్రబాబు ఆరోగ్యంగా, పూర్తి భద్రత మధ్య ఉన్నారని చెప్పారు.