రాష్ట్రప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం

హోం మంత్రి తానేటి వనిత 

న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతోందని హోం మంత్రి తానేటి వనిత  పేర్కొన్నారు. ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాలోని 313 గ్రామాల్లో 7,552 ఎకరాల విస్తీర్ణంలోని రూ.9,251 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేశారన్నారు.  రాష్ట్రంలో రెండు లక్షల కేజీల గంజాయి ధ్వంసం చేశామని హోం మంత్రి  తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన సూరజ్‌ఖండ్‌లో రెండు రోజుల పాటు జరిగే చింతన్‌ శిబిర్‌కు ఆమె హాజరయ్యారు.  ఈ సంద‌ర్భంగా ఆమె ఏపి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంత గిరిజనులు దళారుల ప్రలోభాలకు గురై గంజాయి అక్రమ సాగు చేపట్టారని మంత్రి తానేటి వ‌నిత‌ చెప్పారు. ఈ కార్యక్రమం ప్రభావంతో చైతన్యవంతమైన గిరిజనులు 395 ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేశారని చెప్పారు. గంజాయి సాగు నిరోధం, ధ్వంసంలో దేశంలోనే ఏపి ప్రథమ స్థానంలో నిలిచిందని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో నివేదిక పేర్కొందని గుర్తు చేశారు. దేశంలో ధ్వంసం చేయబడిన గంజాయి సాగు 27,510 ఎకరాలు కాగా, అందులో 11,550 ఎకరాల (40 శాతం) గంజాయి సాగు ధ్వంసం ఒక్క ఏపిలోనే జరిగిందని తెలిపారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో రెండు లక్షల కేజీల గంజాయిని ధ్వంసం చేయగలిందని పేర్కొన్నారు. దిశ యాప్‌ను 1.30 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, ఈ యాప్‌ వల్ల 900 మందికిపైగా మహిళలు రక్షింపబడ్డారని తెలిపారు.  

Back to Top