తాడేపల్లి: చంద్రబాబు పాలనలో మహిళా ఎమ్మార్వో, ఎమ్మెల్యేపై దాడి చేస్తే కనీస చర్యలు లేవని, కానీ నేడు మహిళలకు ఏదో జరిగిపోతుందంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. దిశ చట్టం చేయడంతో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని చెప్పారు. దిశ చట్టాన్ని వక్రీకరించే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..మహిళలకు సత్వర న్యాయం అందించడానికే దిశ చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.80కోట్లు కేటాయించారని.. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాక స్పెషల్ ఆఫీసర్లను నియమించామని... సిబ్బంది నియమాకాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్న చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని హోం మంత్రి ఖండించారు. గతంతో పోల్చితే మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయి.. మహిళలపై నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించేందుకే దిశ చట్టం చేశామని సుచరిత పేర్కొన్నారు. దిశ చట్టం తెచ్చాక గతంతో పోల్చితే మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. దిశ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. నేరస్తులకు శిక్ష పడటం సహా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని సుచరిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 5.80 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని సుచరిత తెలిపారు. దిశ చట్టానికి 71,700 ఫిర్యాదులు వచ్చాయని.. 53 వేలకు పైగా మంది ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు. చంద్రబాబుది రాక్షస గుణం చంద్రబాబుది రాక్షస గుణం.. ఆయన కులాల మద్య చిచ్చు పెడుతున్నారని హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. బాబు అడ్డుకుంటున్నాడని ఆమె తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా దళితుడిని నియమిస్తే అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు.. ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు దళితులుగా ఏవరైనా పుడతారా అని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తుంటే.. దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని సుచరిత మండిపడ్డారు. తమ ప్రభుత్వం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి 82.5 శాతం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించామన్నారు. మొదటి బడ్జేట్‌లోనే ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు తెచ్చామని తెలిపారు. వైయస్ జగన్ ఓ దళిత మహిళను హోంమంత్రిని చేశారు భారత దేశంలోనే ఓ దళిత మహిళను హోంమంత్రి చేయాలని ఎవరు ఆలోచన చేయలేదు. కానీ సీఎం వైయస్ జగన్ ఓ దళిత మహిళను హోంమంత్రిని చేశారని సుచరిత తెలిపారు. గత ప్రభుత్వాలు మేనిఫెస్టోను అమలు చేయలేదు.. కానీ సీఎం జగన్ ముందుగా డేట్ ప్రకటించి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సుచరిత ప్రశంసించారు. ముఖ్యమంత్రి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించారని తెలిపారు. సీఎం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నయని హోం మత్రి సుచరిత పేర్కొన్నారు.