విశాఖపట్నం: ఏడాది కాలంలో ఏపీ పోలీసు శాఖకు 103 అవార్డులు రావడం సంతోషంగా ఉందని, దేశంలోనే ఏపీ పోలీసుల మెరుగైన సేవలకు అవార్డులే నిదర్శనమని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సీఎం వైయస్ జగన్ పోలీసులకు స్వేచ్ఛా, సహకారం ఇవ్వడంతోనే ఈ అవార్డులు వచ్చాయన్నారు. విశాఖలోని వేలంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, స్వేచ్ఛగా వారి పని వారు చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ సంస్కరణలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈ అవార్డులు మరింత బాధ్యతను పెంచాయని అన్నారు. గత ప్రభుత్వం పోలీసులను ఇష్టానుసారంగా వాడుకుందని, గత ప్రభుత్వ హయాంలో పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండేవన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగుతోందని హోంమంత్రి సుచరిత చెప్పారు. అన్ని అంశాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు సీఎం అమలు చేస్తున్నారని చెప్పారు. కేబినెట్‌లోనే కాకుండా.. నామినేటెడ్ పదవుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత కల్పించారన్నారు. మహిళల భదత్ర విషయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ‘దిశ’ యాక్ట్ తీసుకువచ్చారని, మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు.