అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘కొత్త కేబినెట్‌కు నా హృదయపూర్వక అభినందనలు. మనం వేసే ప్రతి అడుగూ మన ఏపీ ప్రజలు మేలు కోసమే అయి ఉండాలి. మనం చేసే పనితోనే మనమెంటో నిరూపిద్దాం. ఆల్ ది బెస్ట్ టు యూ’ అని వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
వైయస్ జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం కొలువుదీరింది. సామాజికంగా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ.. బడుగు, బలహీన వర్గాల సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ.. సీఎం వైయస్ జగన్ తన మంత్రిమండలిని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. మొత్తం 25 మంది మంత్రులు శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. వీరిలో పుష్పశ్రీవాణి (ఎస్టీ), ఆళ్ల నాని (కాపు), అంజాద్ భాషా (మైనారిటీ), నారాయణస్వామి (బీసీ, కురబ), పిల్లి సుభాష్ చంద్రబోస్ (బీసీ, శెట్టిబలిజ)లకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం ద్వారా సామాజికంగా ఆయా వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చారు.అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయిన మేకతోటి సుచరితకు కీలకమైన హోంశాఖను ఇవ్వడం ద్వారా మహిళలకు, బడుగువర్గాలకు తన మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్న విషయాన్ని ఆయన చాటారు.