ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. 

చేసేదంతా చేస్తూ అసెంబ్లీలో నీతులా? 

అధికారం చేపట్టి 20 రోజులు పూర్తి కాకముందే రాష్ట్రంలో  ఈ తరహా పరిస్థితులు

రూల్స్ ప్ర‌కార‌మే విశాఖపట్నం, అనకాపల్లి కార్యాలయల నిర్మాణాలు

విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలనలో అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టారని.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయాలను ఏపీ ప్రభుత్వం టార్గెట్‌ చేయడంపై శనివారం ఉదయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

 రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే  తాడేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని పూర్తిగా నేలమట్టం చేసారని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. విశాఖలోని ఎండాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  అంబేద్కర్  రచించిన రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ  రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.  అధికారం రాకమునుపు చెప్పినట్లుగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అసెంబ్లీలో నీతులు మాట్లాడుతున్నారు. ఆరు నెలల పాటు వారికి హనీమూన్ పీరియడ్ నడుస్తుందని, ఆరు నెలల పాటు కూటమి ప్రభుత్వ పాలన చూసి అంశాలవారీ స్పందిద్దామని ఇటీవల సమావేశంలో వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయినా సరే ఆ గడువు కూడా లేకుండా విధ్వంసాలకు దిగుతున్నారని మండిపడ్డారు.
 మేం అధికారంలో ఉన్నప్పుడు  వాగు, పొరంబోకు స్థలంలో చట్టవిరుద్దంగా  ఉన్న మంగళగిరి పార్టీ కార్యాయంపై కోర్టులకు వెళ్లి ఉపశమనం పొందారని గుర్తు చేసారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ప్రభుత్వ స్థలాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయాల కోసం కడప, శ్రీకాకుళం, గుంటూరు, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, చిత్తూరులో స్థలాలు కేటాయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.  
2016లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు స్థలాల కేటాయింపులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓ ఆధారంగానే వైసీపీ ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయం మేరకు విశాఖలోని ఎండాడలో పార్టీ కార్యాలయం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయింపు జరిగిందన్నారు.   2023లో వీఎంఆర్డీఏకి  పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, స్థలం కోసం రూ. 16 లక్షల వరకు ప్రభుత్వానికి చెల్లించామని, అలాగే అనకాపల్లిలో కార్యాలయ భవనం కోసం కూడా రూ. 30లక్షలకు ప్రభుత్వానికి చెల్లించామని,  నిబంధనల మేరకు నిర్మాణ స్థలంలో కొంత భాగాన్ని మార్ట్ గేజ్  కూడా చేసామని  అమర్ గుర్తు చేసారు. ఎండాడ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి వీఎంఆర్డీఏకి దరఖాస్తు చేసారు, స్థలం గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి తమ అనుమతి కూడా తీసుకోవాలని సిబ్బంది నోటీసు ఇచ్చారన్నారు. జీవీఎంసీ నియమ, నిబంధనల ప్రకారం గజాల్లో స్థలం  ఉంటే కార్పొరేషన్ అనుమతి కోరాలని, ఎకరాల్లో ఉన్న స్థలమైతే వీఎంఆర్డీఏ నుంచి తీసుకుంటామని వివరించారు. 

అధికారం తమ చేతుల్లో ఉందని ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదని, 13 ఏళ్ల చరిత్ర కలిగిన వైసీపీ పట్ల ఈ తరహా తీరు సరికాదని హెచ్చరించారు. ప్రతీ దానికి ప్రజలు సమాధానం చెబుతారని, ప్రజాస్వామ్యంలో ఏదీ శాశ్వతం  కాదని, అవకాశాలు అందరికీ వస్తాయని, మీకు వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగిస్తున్నారో ప్రజలు చూస్తున్నారని హెచ్చరించారు.  పార్టీ కార్యాలయాలంటే తమకు దేవాలయాలతో సమానంగా  తాము భావిస్తామని, రానున్న కాలంలో చట్ట ప్రకారం పోరాటం చేస్తామని వివరించారు. తెలుగుదేశం పార్టీ విశాఖ దసపల్లా హిల్స్ కార్యాలయానికి అసలు అనుమతులు లేవని, ట్యాక్స్ కూడా కట్టలేదని, లీజు మొత్తాన్ని కూడా చెల్లించలేదని, ప్రతిపక్షంగా పోరాడితే అప్పుడు చెల్లించారని గుర్తు చేసారు. చట్టపరంగా పోరాడి, మా దేవాలయాన్ని సంరక్షించుకుంటామని అమర్ పేర్కొన్నారు.

 అధికారం చేపట్టిన నాటి నుంచి టీడీపీ ప్రభుత్వం విధ్వంసకాండని సాగిస్తుందని,  ఇది బుల్డోజర్ల ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. నిబంధనల ప్రకారం అన్ని పన్నులు చెల్లించినా, అన్ని అనుమతులు తీసుకున్నా సరే  సమయం కూడా ఇవ్వకుండా   నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు.  పార్టీ కార్యకర్తలు, నాయకులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారని,  వారందరికీ కూడా పార్టీ అండగా నిలుస్తుందని అమర్ నాథ్ భరోసా ఇచ్చారు.

Back to Top