ప్రకాశం: రెండో విడత ‘వైయస్సార్ ఆసరా’ను ప్రారంభించేందుకు ఒంగోలు నగరానికి చేరుకున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైయస్సార్ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకుని అక్కడ వివిధ స్టాల్స్‌ను పరిశీలించిన అనంతరం వేదిక వద్ద లబ్ధిదారులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తన ప్రసంగం అనంతరం వైయస్సార్ ఆసరా రెండో విడత కింద లబ్ధిదారులకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
‘వైయస్సార్ ఆసరా’ పథకం రెండవ విడత మొత్తాన్ని ప్రభుత్వం నేడు డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం వైఎస్ జగన్ గత ఏడాది శ్రీకారం చుట్టి.. తొలి విడత సొమ్ము జమ చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా గురువారం నుంచి రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి దాదాపు 20 వేల మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత ఏడాది తొలి విడతగా చెల్లించిన రూ.6,318.76 కోట్లు కూడా కలిపితే పొదుపు సంఘాల అప్పునకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అందజేసినట్టవుతుంది.