కొత్త గవర్నర్‌కు ఘన స్వాగతం

గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన సీఎం వైయ‌స్‌ జగన్ 

నేటి ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్‌ హరిచందన్‌కు మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం మధ్యాహ్నం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన సతీమణి సుప్రభ హరిచందన్‌తో కలసి తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. రన్‌వే వద్ద హరిచందన్‌ను ముఖ్యమంత్రి  వైయ‌స్ జగన్‌ శాలువాతో సత్కరించి.. పుష్పగుచ్ఛం అందజేసి సాదరంగా ఆహ్వానం పలికారు. తదుపరి ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ ఆవరణలో నూతన గవర్నర్‌ ఏబంపీ పోలీస్‌ ప్రత్యేకదళం నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు తానేటి వనిత, కొడాలి వెంకటేశ్వరరావు, మోపిదేవి వెంకటరమణ, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్‌ను, ఉన్నతాధికారులను కొత్త గవర్నర్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈ సందర్భంగా పరిచయం చేశారు. స్వాగత కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, జీఎడీ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా, ఐఏఎస్‌ అధికారులు సతీష్‌చంద్ర, జేఎస్‌వీ ప్రసాద్, విజయవాడ సీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, ఇంకా పలువురు అధికారులు పాల్గొన్నారు.  

నేడు ప్రమాణ స్వీకారం..
రాష్ట్ర గవర్నర్‌గా విశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ పదవీ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుక కోసం రాజ్‌భవన్‌ ముస్తాబైంది. గవర్నర్‌ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రవ్యాప్తంగా 461 మంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. వీరిలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు అధికారులు, సీఎంవో కార్యాలయ అధికారులు, గవర్నర్‌ కార్యాలయ అధికారులు ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాజ్‌భవన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 

Back to Top