రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ఇష్టం ఉందా? లేదా?

  ప్రభుత్వ చీఫ్‌ విప్‌ జి.శ్రీకాంత్‌రెడ్డి  

2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారా?

బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌

అసలు ఆరోజు హోదాను తాకట్టు పెట్టింది ఎవరు?

ప్యాకేజీతో సరిపెట్టి రాష్ట్రానికి అన్యాయం చేసిందెవ్వరు?

ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు వీడాలి

వైయస్ఆర్‌ జిల్లా:  ప్ర‌త్యేక హోదాకు సంబంధించి రెండు రోజులుగా బీజేపీ, టీడీపీ నాయకులంతా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీ ఇష్టం ఉందా? లేదా? అని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి సూటిగా ప్ర‌శ్నించారు. 2014 మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌కు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారా? లేదా? పార్లమెంటులో చట్టం చేసినా మీరు హోదా ఇవ్వకపోగా, ఇప్పుడు సమాధానం కూడా చెప్పడం లేదన్నారు. అసలు హోదాను తాకట్టు పెట్టింది ఎవరు? 2014 నుంచి 2019 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీతో అధికారం పంచుకున్న టీడీపీ, ప్యాకేజీ చాలని చెప్పిన మాట వాస్తవమా? కాదా? ఆనాడు హోదాను తాకట్టు పెట్టిన చంద్ర‌బాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాల‌ని డిమాండు చేశారు. వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 
సిగ్గు పడాలి:
    చివరకు ప్రత్యేక ప్యాకేజీ వల్ల కూడా ఏం తీసుకురాలేదు. అక్కడా రాష్ట్రానికి అన్యాయం చేశారు. నష్టం చేశారు. అందుకు మీరు సిగ్గు పడాలి. అప్పుడు అన్నీ చేసిన మీరు ఇవాళ హోదా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది.

హోదా కోసం పోరాడుతున్నాం:
    నిజానికి ఆనాటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక హోదా గురించి పోరాడుతోంది వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనే. ఆరోజు మా పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామా కూడా చేశారు. అప్పుడు మీరు కలిసి రాలేదు. పైగా మా పార్టీ నుంచి గెల్చిన ముగ్గురు ఎంపీలను మీ పార్టీలోకి తీసుకున్నారు.

అదేమైనా దేశద్రోహమా?:
    త్రిసభ్య కమిటీ సమావేశం ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు తీసేశారో జీవీఎల్‌ నరసింహారావు సమాధానం చెప్పాలి. అది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి, హోం మంత్రిత్వ శాఖకు ఫోన్‌ చేసి దాన్ని తీసేయమని చెప్పానని ఆయన వెల్లడించారు. మరి అదేమైనా దేశద్రోహమా. ఆ పని చేసినందుకు మీరు సిగ్గు పడాలి.

వారు టీడీపీ ఎజెండా కోసమే:
    2019లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌ను మీ పార్టీలోకి పంపించారు. వారి ద్వారా తన ప్రయోజనాలను చంద్రబాబు కాపాడుకుంటున్నారు. వారికి ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదు.
బీజేపీలో ఉంటూ టీడీజీ ఎజెండా కోసం పని చేస్తున్న ఆ ఎంపీలను సూటిగా అడుగుతున్నాను. మీకు రాష్ట్రానికి హోదా రావడం ఇష్టం ఉందా? లేదా? మీ వ్యవహారశైలికి ఇప్పటికైనా సిగ్గు పడాలి.
    మా పార్టీ ఎంపీలు ప్రతి సమావేశంలో హోదా డిమాండ్‌ చేస్తున్నారు. కానీ అవేవీ మీకు కనిపించడం లేదు. మీకు ఎంతసేపూ టీడీపీ ఎజెండానే కనిపిస్తుంది.

విలువలకు కట్టుబడ్డాం:
    విలువలకు కట్టుబడి ఏర్పాటైన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే పని చేస్తోంది. ఎప్పుడూ ఆ విలువలకు కట్టుబడే ఉంటోంది. మా పార్టీలోకి ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశాం.
    కానీ మీకు ఎంతసేపూ కుట్రలు, కుతంత్రాలు. టీడీపీ, చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారు. నిరంతరం జగన్‌గారిపై నిందలు వేయడమే మీ పని. ఆరోజు కూడా ప్యాకేజీ ప్రకటించగానే కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. 

అస్థిరతే వారి లక్ష్యం:
    రాష్ట్రంలో ఎవరు ఆందోళన చేసినా వెంటనే వారికి మద్దతు ఇస్తారు. వారిని ఇంకా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. రాష్ట్రం ఎప్పుడూ అస్థిరంగా ఉండాలి. సుస్థిరంగా ఉండకూడదు. అదే వారి లక్ష్యం. అందుకోసమే నిరంతరం ప్రయత్నం.
    అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్‌ ఇస్తే, దానిపై కేసు నమోదైతే దాంతో ప్రభుత్వానికి ఏం సంబంధం? దానిపై ప్రతి జిల్లాలో టీడీపీ వారు మాట్లాడారు. ప్రభుత్వాన్ని నిందించారు. నిజానికి వారు కనీసం కౌన్సిలర్‌గా కూడా గెలవని వారు. లోకేష్‌ పీఏ లైంగికంగా వేధిస్తున్నాడని టీడీపీ ఆఫీసులో ఒక మహిళ ఆందోళన చేసింది. అయినా సిగ్గు లేకుండా నారీ భేరీ అంటూ ఇవాళ ఆ పార్టీ మహిళా నేతలు నిరసన దీక్షలు చేస్తున్నారు. ఎంతసేపూ కుట్రలు, కుతంత్రాలు. దానికి స్ట్రాటెజీ మీటింగ్‌ అని పేరు పెడతారు.

స్పష్టంగా చెప్పండి:
    ఇప్పటికైనా మీకు హోదా కావాలా? వద్దా అన్న విషయం స్పష్టంగా చెప్పండి. అందుకు బీజేపీ ప్రభుత్వంపై ఎలా పోరాడతారో చెప్పండి.
మాకైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. అందుకోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం. 

ఆ రెండూ ఇవ్వండి:
    బీజేపీని ఒకటే కోరుతున్నాం. మేము ప్రత్యేకంగా ఏదీ అడగడం లేదు. విభజన చట్టంలో పేర్కొన్న వాటిని, ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం. అందుకే ఇప్పటికైనా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించండి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి.
    మా దురదృష్టం. ఇక్కడ ఉన్నది దిక్కుమాలిన ప్రతిపక్షం. బాధ్యతా రాహిత్యమైన విపక్షం. ఎంతసేపూ రాష్ట్రంలో అస్థిరత ఉండాలని కోరుకునే పార్టీ. నిరంతరం మాపై బురద చల్లడమే వారి పని. అందుకే బీజేపీ వారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్సటికైనా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చండి.. అని ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కోరారు.

Back to Top