తెలంగాణ ఇరిగేషన్‌ సలహాదారుగా చంద్రబాబు 

తెలంగాణ రాసే లేఖలన్నీ ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచే వెళ్తున్నాయ్‌

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు నైజం

చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో 12 ఏళ్లు కరువే..

వైయస్‌ఆర్‌ను విమర్శిస్తే ఎవరికైనా పుట్టగతులు ఉండవు

మా వాటా నీటినే వాడుకుంటాం.. సీమ లిఫ్ట్‌తో ఎలాంటి ఇబ్బందులుండవు

కరువు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది సీఎం వైయస్‌ జగన్‌ తాపత్రయం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: తీవ్ర కరువు ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాపత్రయపడుతుంటే.. చంద్రబాబు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి ఇరిగేషన్‌ సలహాదారుగా మారి ఏపీకి వెన్నుపోటు పొడుస్తున్నాడని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పీటం దక్కలేదనే దుష్ట ఆలోచనతో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడని, తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు సమర్థించే పరిస్థితి రావడం వల్లే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్‌ బోర్డుకు లేఖలు రాస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ రాసే లెటర్లు అన్నీ పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు వెళ్తున్నట్టున్నాయని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏం మాట్లాడారంటే.. ‘దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌  రైతు బాంధవులుగా పేరుగాంచారు. వైయస్‌ఆర్‌ పరిపాలించిన ఐదేళ్లు, సీఎం వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన తరువాత వరుసగా మూడో ఏడాది కూడా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తడం, నాగార్జున సాగర్‌ నిండి గేట్లు ఎత్తడం చూస్తున్నాం. చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనలో 12 ఏళ్లు తీవ్రమైన కరువు కాటకాలు చూశాం. ప్రాజెక్టులు నిర్మించడం దండగ, వ్యవసాయం దండగ అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. 

వైయస్‌ఆర్‌ జలయజ్ఞం పేరుతో ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఈరోజు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారు. ప్రాజెక్టులు నిండి రైతులంతా ఆనందంగా ఉంటే చంద్రబాబు కళ్లు మండుతున్నాయి. రైతులు సంతోషంగా ఉండకూడదనే దుర్బుద్ధి చంద్రబాబుది. ఏపీలో ప్రతిపక్ష పాత్ర మర్చిపోయి తెలంగాణకు ఇరిగేషన్‌ సలహాదారుగా బాబు తయారయ్యాడు. టీఆర్‌ఎస్‌ ఆఫీస్, తెలంగాణ ఇరిగేషన్‌ శాఖ నుంచి వచ్చే ప్రతి లెటర్‌ పక్కనే ఉన్న ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి వెళ్తున్నట్టు ఉన్నాయి. సంతకాలు వాళ్లు పెడుతున్నారేమో గానీ లెటర్లన్నీ తెలుగుదేశం ఆఫీస్‌ నుంచే టీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు వెళ్తున్నాయి. 

నాడు వైయస్‌ఆర్‌ పోతిరెడ్డిపాడును చేపడితే ఇదే చంద్రబాబు దేవినేని ఉమాతో ప్రకాశం బ్యారేజీపై నిరాహార దీక్ష చేయించాడు. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు. పోతిరెడ్డిపాడు ఎక్స్‌టెన్షన్‌ ప్రాజెక్టుగా రాయలసీమ లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తుంటే దుర్బుద్ధితో చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లెటర్లు రాయిస్తున్నాడు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు నైజం. రాయలసీమ లిఫ్ట్‌పై చంద్రబాబు స్టాండ్‌ ఏంటో ఈ రోజుకూ చెప్పలేదు. 

కృష్ణా రివర్‌ బోర్డుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా తెలంగాణ తాజాగా రాసిన లేఖ కూడా చంద్రబాబు రాయించిందే. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు ఏవీ కొత్తవి కావు. కేడబ్ల్యూడీటీ–1 పంపకాల ప్రకారం మా వాటా నీటిని మాత్రమే వాడుకుంటున్నామని పదే పదే చెప్పాం. వాటి వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ఇదివరకు ఉన్న ప్రాజెక్టులను నింపడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అదనంగా ఆయకట్టు, కొత్త కాల్వలు, కొత్త జలాశయాలు నిర్మించి ఆ నీటిని వాడుకోవడం లేదని అనేకసార్లు తెలియజేశాం. 

కృష్ణా నదీపై తెలంగాణ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంలో రిట్‌పిటీషన్లు దాఖలయ్యాయి. ఆ ప్రాజెక్టుల వల్ల కొత్త ఆయకట్టు, కాల్వ వ్యవస్థ వస్తుందని తెలియజేశాం. రాయలసీమ లిఫ్ట్‌తో మాకు కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటాం. కొత్తగా ఏదీ తయారు చేయడం లేదని చెబుతున్నా పదే పదే నిందలు వేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 4 ప్రాజెక్టులు నిర్మిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నుంచే రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రాజెక్టులు నిర్మాణాలు చేస్తోంది. దీనికి తోడు ప్రాజెక్టు ఎడమ వైపున 796 అడుగుల నుంచే రోజుకు 42 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే సదుపాయం తెలంగాణకు కదిలింది.

సీఎం వైయస్‌ జగన్‌ జలాల అంశంపై అనేకసార్లు ప్రధానికి లేఖలు రాశారు. తీవ్ర కరువు ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలను విస్మరిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలను తరచూ ఉల్లంఘిస్తూ విద్యుత్‌ కోసం నీటిని వినియోగించారు. ఏపీ నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ప్రత్యేకమైన ప్రాజెక్టు కాదు కేసీ కెనాల్, ఎస్‌ఆర్‌బీసీ, శ్రీశైలం బ్రాంచ్‌ కెనాల్, తెలుగుగంగ, గాలేరు నగరి జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, చెన్నైకి తాగునీరు తరలించే సదుపాయం మాత్రమే. శ్రీశైలంలో 854 అడుగుల పైస్థాయిలో జలాలు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తీసుకునే అవకాశం ఉంటుంది. పూర్తిస్థాయిలో నీరు తీసుకోవాలంటే 881 అడుగులకు చేరాలి. అంతకు ముందే నీటిని వాడుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. 

ఇటీవల జరిగిన రాయదుర్గం సభలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలే కాకుండా తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పారు. నీళ్ల కోసం రాజకీయాలు చేస్తూ రాయలసీమ ప్రాజెక్టులే ఉండకూదని ఆలోచించిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ప్రాజెక్టులపై ఆలోచన చేసి ఉంటే అఫీషియల్‌గా జలాల కేటాయింపు జరిగి ఉండేది. అలాంటి చంద్రబాబుకు నీళ్ల గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత ఉందా..? గండికోట ప్రాజెక్టును 27 టీఎంసీలకు పెంచి పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కులకు పెంచిన వైయస్‌ఆర్‌ను విమర్శిస్తే ఎవరికైనా పుట్టగతులు ఉండవు’’ అని గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top