మహాత్ముడి కల.. సీఎం వైయస్‌ జగన్‌తో సాకారం

సచివాలయ వ్యవస్థతో గుమ్మం ముందుకే పాలన

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రధాని మోడీ అభినందించారు

కరోనా సమయంలో వలంటీర్ల పనితీరు అద్భుతం

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం

స్టేలు ఎత్తివేస్తే చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడుతుంది

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: గ్రామ స్వరాజ్యం.. మహాత్మా గాంధీజీ కల.. అనే మాటలు 70 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. ఆ మాటలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పరిపాలన ప్రజల గుమ్మం ముందుకే వచ్చిందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి రేపటితో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వాటి పనితీరును గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశంసించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. గతంలో పింఛన్, రేషన్‌ కార్డ్‌ కావాలంటే ఎండీఓ ఆఫీస్‌ వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామంలోనే పరిష్కారం అవుతున్నాయి. పింఛన్, రేషన్‌ కార్డులు కూడా వెంటనే మంజూరు అవుతున్నాయి. గత ప్రభుత్వంలో రేషన్‌ కార్డు, పింఛన్‌ కావాలంటే జన్మభూమి కమిటీలు నిర్ణయించాలి. కానీ ఇప్పుడు ఎవరి సిఫార్సులు అక్కర్లేదు. ఇంత మంచి వ్యవస్థను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను అభినందిస్తున్నాను. 

గ్రామంలో అద్భుతమైన సచివాలయ బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో అవసరమైన ఫర్నిచర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో మండలానికి ఇలాంటి బిల్డింగ్‌ ఒక్కటి కూడా ఉండేది కాదు. గతంలో చంద్రబాబు వలంటీర్లను అవమాన పరిచే విధంగా మాట్లాడారు. కరోనా సమయంలో వలంటీర్ల పనితీరు అద్భుతం. వలంటీర్ల వ్యవస్థ ద్వారా కరోనా టైమ్‌లో ఆయుష్‌ మాత్రలు కేవలం రెండు గంటల్లోనే పంపిణీ చేశాం. 

గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రధానమంత్రి కూడా అభినందించారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్లవారకముందే అవ్వాతాతలకు వలంటీర్ల ద్వారా పింఛన్‌ అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో 47 లక్షల మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉంటే.. ఇప్పుడు 61,65,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. పింఛన్‌ పొందే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. మా ప్రభుత్వంలో రైతులంతా ఆనందంగా ఉన్నారు. గతంలో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడి పోలీసుల చేత దెబ్బలు తినే పరిస్థితి ఉండేది. కానీ మన ప్రభుత్వం పొలం దాకా విత్తనాలను సప్లయ్‌ చేస్తోంది. 

చెత్త ద్వారా సంపద సృష్టిస్తామని గతంలో లోకేష్‌ చెప్పాడు. సంపద ఎక్కడ ఎలా సృష్టించాడు. నీరు–చెట్టు పేరుతో దోచుకుతిన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన అప్పులు పెరుగుతాయి. ఆస్తులు తగ్గుతాయి. మా ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్రంలో మొత్తం 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. పాడేరు లాంటి ప్రాంతాల్లో కూడా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. 

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. చంద్రబాబు తనను తానే రక్షించుకోలేకపోయారు. గత ప్రభుత్వంలో నా పైన తప్పుడు కేసులు పెట్టారు. చంద్రబాబు తన పాలనలో జరిగిన అవినీతి పైన తాను విచారణకు సిద్ధం అంటారు. తీరా విచారిస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు పై ఉన్న కోర్టు స్టే లు ఎత్తేస్తే వాళ్ల అవినీతి బాగోతం బయట పడుతుంది’ అని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.  

 

Back to Top