అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: కరకట్ట మీదున్నవన్నీ అక్రమ కట్టడాలని గతంలో చెప్పిన చంద్రబాబు, లోకేష్‌.. అదే కరకట్ట మీదున్న లింగమనేని రమేష్‌ అక్రమ కట్టడంలో ఎలా ఉంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పైసా అద్దె చెల్లించకుండా ఆ కట్టడంలో ఎలా ఉంటున్నారని నిలదీశారు. కరకట్ట మీదున్న చంద్రబాబు అక్రమ నివాసంపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్ద స్కామ్‌ అని చెప్పారు. అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసమన్నారు. 

చంద్రబాబు నివసిస్తున్న అక్రమ కట్టడం ప్రభుత్వానికి ఇస్తే అధికారం కోల్పోయిన తరువాత చంద్రబాబు ఆ నివాసాన్ని ఖాళీ చేసి ఉండాలి. లేదంటే ప్రతిపక్ష నేత నివాసంగానైనా చంద్రబాబు మార్చుకోవాలన్నారు. అదేదీ లేకుండా అక్రమ నివాసంలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. లింగమనేని రమేష్‌కి, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయన్నారు. చంద్రబాబు బరితెంపునకు నిదర్శనమే కరకట్ట మీదున్న అక్రమ నివాసమన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన చంద్రబాబు.. డబ్బున్న వాళ్ల కోసం పేదలకు ఇవ్వకుండా చేశారని దుయ్యబట్టారు. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నాడని,  పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 
 

Back to Top