గుంటూరు: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను పరిమితి, కాలపరిమితి లేకుండా అర్హులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేస్తున్నారని, ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో సాంఘిక సంక్షేమశాఖలో అమలవుతున్న పథకాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కి అతి ఇష్టమైన శాఖల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఒకటని చెప్పారు. సంక్షేమ పథకాలు అంటే ముందుగా గుర్తొచ్చేది షెడ్యూల్డ్ కులాలేనన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్‌లలో మౌలిక వసతులు కల్పించడానికి రాజీపడే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 1700 వసతి గృహాల్లో 700 ఎత్తివేశారన్నారని గుర్తుచేశారు. ప్రజలకు విద్య, వైద్యం అందించేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని, ప్రభుత్వ పరంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత అధికారులదేనన్నారు. సోషల్ ఆడిట్ పెట్టి మరీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం వైయస్ఆర్ సీపీ ప్రభుత్వమని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ దళిత అభ్యున్నతికి పాటుపడుతున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీల అభిప్రాయాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని చెప్పారు.