బాబూ.. రాష్ట్రంపై నీకెందుకంత క‌క్ష‌

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై చంద్రబాబు స్టాండ్ ఏంటి..?

టీడీపీ ఏం భావిస్తుందో స్పష్టంగా చెప్పిన త‌రువాతే మాట్లాడాలి

కృష్ణా జ‌లాల‌పై చంద్ర‌బాబు ఎందుకు మాట్లాడ‌టం లేదు..?

తెలంగాణ అధికార పార్టీతో టీడీపీ తెర‌వెనక ఒప్పందం ఏమైనా ఉందా..?

జ‌న్మ‌భూమి క‌మిటీలు పెట్టి స‌ర్పంచ్‌ల అధికారాల‌ను హ‌రించింది చంద్ర‌బాబే..

సీఎం వైయస్‌ జగన్‌ పంచాయతీలకు జీవం పోస్తున్నారు

ఈనాడు ప‌త్రిక ర‌క‌రకాల క‌థ‌లు అల్లుతూ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేస్తోంది

చంద్ర‌బాబు వ‌ల్లే ఈడ‌బ్ల్యూఎస్ ఆల‌స్య‌మైంది..

వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి

తాడేపల్లి: జిల్లాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌గా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఏపీని వ‌దిలేసి తెలంగాణ వాద‌నను స‌మ‌ర్థిస్తూ బాబు మాట్లాడుతున్నారు.  ఇదంతా చూస్తుంటే.. తెలంగాణలోని అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీకి మధ్య తెరవెనుక ఒప్పందం ఏమైనా ఉందా అనే సందేహం కలుగుతుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై చంద్రబాబు స్టాండ్‌ ఏంటని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ ఏం భావిస్తుందో స్పష్టంగా చెప్పాల‌ని డిమాండ్ చేశారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని దుయ్యబట్టారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే.. 

టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శకు వెళ్లిన చంద్ర‌బాబు.. సంగం డెయిరీ దగ్గర మొదలుపెట్టి.. దేనిమీద మాట్లాడుతున్నారో.. ఏం చెప్పాలనుకుంటున్నారో వదిలేసి.. దుమ్మెత్తిపోయడం, మతిచలించి వ్యవహరించే తీరులో మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా విశేష అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడు పంచాయతీలకు సంబంధించి నిన్న హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్‌ మీద  మాట్లాడిన తీరు చూస్తే ఇలాంటి వ్య‌క్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడా.. అలాంటి అర్హత చంద్ర‌బాబుకు ఉందా అనే అనుమానం వస్తోంది. 

గ్రామ సచివాలయాలు పెట్టి సర్పంచ్‌ల పరిమితులు హ‌రించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో సెక్రటేరియట్‌ పెడితే ఒప్పుకుంటారా..? అని అడుగుతున్నాడు. అసలు ఈ రెండింటి మధ్య సంబంధం ఏమిటీ.. చంద్ర‌బాబూ? రాజ్యాంగపరమైన పూర్తి స్వేచ్ఛతో పాటు గ్రామ పంచాయతీలకు పరిమితులు ఉంటాయి. చెట్టుకింద కూర్చొని నోటికి ఏదొస్తే అది వితండవాదం చేసే వ్య‌క్తికి ఇలాంటి మాట‌లు మాట్లాడితే వేరు. కానీ, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, మళ్లీ సంధు దొరికితే ముఖ్యమంత్రి కావాలని చూసే వ్యక్తి, విశేష అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తి నోటి నుంచి ఇలాంటి మాట రావడం వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అనే అనుమానం కలుగుతుంది. 

గ్రామ పంచాయతీల అధికారాలకు ఎక్కడ ఇబ్బందికలిగింది. గ్రామ సచివాలయం వద్దంటున్నారా..? ప్రజల జీవితంలో భాగమైన సచివాలయం, అధికార వికేంద్రీకరణలో భాగంగా ఒక గ్రామంలో ఒక కార్యాలయం పెట్టి.. కీలక డిపార్టుమెంట్లు అని కిందివరకు వెళ్లి.. పౌరసేవలు అన్ని అందిస్తున్నాయి. పంచాయతీలు, సర్పంచ్‌లు, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన అధికారాలు ఉపయోగించుకోవడానికి ఎక్కడా జోక్యం లేని పరిస్థితి ఉంది. 

మైకు ఉంది కదా.. మీడియా ఉంది కదా అని చెబుతూపోతే సరైన పద్ధతి కాదు. ఎలా అంటే అలా మాట్లాడి ప్రజలను గందరగోళంలోకి నెట్టడం కరెక్ట్‌ కాదని విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు హయాంలో  అన్యాయమైన జన్మభూమి కమిటీలు పెట్టి.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర నుంచి లంచాలు వ‌సూలు చేశారు. సంక్షేమాన్ని దూరం చేశారు. అవి జన్మభూమి కమిటీలు కాదు.. దారి దోపిడీ చేసేవాళ్లలా ఉన్నారని టీడీపీ నేతలే నెత్తిననోరుపెట్టుకొని మొత్తుకున్న పరిస్థితి చూశాం. అది సర్పంచ్‌ల అధికారాలు తీయడం. సర్పంచ్‌లకున్న కనీస అధికారాన్ని కూడా తీశారు. జన్మభూమి కమిటీల సర్టిఫికెట్‌ కావాలని చెప్పి.. అన్యాయమైన, అసంబద్ధమైన కమిటీని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది. పంచాయతీల ఊపిరి తీయడం చంద్రబాబు హయాంలోనే జరిగింది. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పంచాయతీలకు జీవం పోస్తున్నారు. పొలిటికల్‌ స్ట్రక్చర్‌తో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ స్ట్రక్చర్‌ను గ్రామస్థాయికి తీసుకెళ్లారు. రెండింటి మధ్య సమన్వయం సాధిస్తే అద్భుతమైన గ్రామ స్వరాజ్యం వస్తుంది. గ్రామం దాటకుండానే పౌరులకు కావాల్సిన సౌకర్యాలు, సేవలు అందుతాయనేది ప్రణాళిక. అలాంటి వ్యవస్థ మీద చంద్రబాబు కామెంట్‌ చేయడం మరింత దారుణం. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే చంద్రబాబు గ్రామస్వరాజ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. 

ధూళిపాళ్ల న‌రేంద్ర‌.. రైతులకు చెందాల్సిన లాభాలు వందల కోట్ల రూపాయలు ట్రస్టు రూపంలో కాజేశాడని అంటున్నాం. అందులో చంద్రబాబుకు కూడా సింహభాగం చేరిందని ఆధారాలు కూడా ఉన్నాయి. హెరిటేజ్‌ పాలు ప్రాసెస్‌ చేసి ఇచ్చారనే పేరుతో.. హెరిటేజ్‌ నుంచి ఖాళీ ట్యాంకర్లు తెచ్చి.. సంగం డెయిరీ నుంచి పాలన్నీ సప్లయ్‌ చేశారు. దీంట్లో ఎంత చదువించుకున్నారో.. ఇవన్నీ రాజకీయ పార్టీగా మాట్లాడతాం. 

నిజానిజాలు ఎలాగో తేల్తాయి. ఏసీబీ విచారణలో కోర్టుకు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధారాలన్నీ ఉండి మోసం తేలితే.. ధూళిపాళ్ల శిక్షకు గురికాక తప్పదు. విచారణ జరుగుతున్నప్పుడు ఓపిక పట్టొచ్చు కదా..? కేసు పెట్టి నిందితుడు అనగానే.. ఆధారాలు చూపించమని చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. అవన్నీ మీకెందుకు చూపుతారు..? 

చంద్రబాబు విజయవాడ వచ్చాక.. కృష్ణా జలాలు నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్న స్థితి కనిపించి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని లాగేస్తుంటే.. ఆ నీటిని వాడుకోవడానికి అవకాశం లేక సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఉంటే.. దాని మీద ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నా.. దేవినేని ఉమ వచ్చి నీటిని వదలొద్దు అంటున్నాడు కదా.. పైనుంచి ఎందుకు వదులుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం విలువైన నీటిని ఎందుకు వదులుతారని ప్రభుత్వంతో గొంతుకలిపి నిరసన వినిపించాల్సిందిపోయి.. చంద్రబాబు పుట్టి పెరిగి, రాజకీయ జీవితం ప్రసాదించిన చిత్తూరు జిల్లాలో తాగునీటి అవసరాల కోసం సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు లాంటివి ప్రభుత్వం చేపడితే.. తెలంగాణ చేస్తున్న వాదనతో కలిపి ఎన్‌జీటీకి పంపించారు. ఇంతకంటే దిగజారుడుతనం, ఇంతకంటే అన్యాయం, రాష్ట్రం కళ్లుపొడవాలని చేయడం కదా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. 

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించి పోతిరెడ్డిపాడు వద్ద తెలంగాణ ప్రభుత్వం ఏ వాదన వినిపిస్తుందో.. ఆ వాదనను సమర్థించే విధంగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో ఎన్జీటీలో చంద్రబాబు కేసు వేయించాడు. మరోపక్క ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలతో మా జిల్లాకు అన్యాయం జరిగిపోతుందని చెప్పిస్తున్నాడు. 

తెలంగాణలోని అధికార పార్టీ, తెలుగుదేశం పార్టీకి మధ్య తెరవెనుక ఒప్పందం ఏమైనా ఉందా అనే సందేహం కలుగుతుంది. పోలవరం నుంచి వచ్చిన నీటిని కృష్ణా నుంచి కలిపేసి సాగర్‌ కుడి కాల్వలో వేయడం. రూ.1200 కోట్లు ఖర్చు అయ్యాయి. భూసేకరణకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు.. ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. రాయలసీమకు సంబంధించిన వరకు వరద జలాలను వృథాగా పోకుండా తక్కువ సమయం ఉన్నప్పుడు తీసుకోవడానికి ఎలాగైతే ఏర్పాటు చేస్తున్నాం. మరోపక్క స్టెబిలైజేషన్‌ పులిచింతల ఉండటంతో పాటు కృష్ణా నీటిని కుడికాల్వలో వేస్తున్నాం. చింతలపూడి నుంచి నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వకు వెళ్లేలా తయారుచేస్తున్నాం. ఏ ప్రాంత ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా.. వృథాగా వెళ్లే నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన, ఇదే పనిని వైయస్‌ఆర్‌ ఆరోజున చేశారు. 

మూడు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా వైయస్‌ఆర్‌ పాలన సాగింది. రాయలసీమకు పోతిరెడ్డిపాడును 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు వెడల్పు చేయడం ద్వారా వరద జలాలను ఒడిసిపట్టుకోవాలనుకోవడం, కృష్ణా డెల్టాకు ఇబ్బందికలగకుండా.. పులిచింతల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, పోలవరం కుడికాల్వ నుంచి కెనాల్‌ను కలపడం, తెలంగాణకు సంబంధించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టారు. అన్ని ప్రాంతాలను సమానం చూసే నాయకుడి లక్షణం. ఇలాంటి పనులు చంద్రబాబుకు అర్థంకావు. పుట్టిన గ్రామం మీద, తెలుగు గడ్డ మీద మమకారం లేని వ్యక్తి చంద్రబాబు. ఆయనకెప్పుడూ రాష్ట్రాన్ని కుంగదీసి.. తద్వారా అధికారం చెలాయించాలనేది తప్ప.. ప్రశాంతమైన వాతావరణంతో నాయకత్వం తెచ్చుకోవాలనే ఆలోచనలు చంద్రబాబుకు రావు. 

అసలు ప్రకాశం జిల్లాకు చంద్రబాబు ఏం చేశాడు. వెలుగొండ ప్రాజెక్టును సీఎం వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తున్నారు. 18 కిలోమీటర్ల మొదటి టన్నెల్‌లో వైయస్‌ఆర్‌ 11.5 కిలోమీటర్లు పూర్తిచేశారు. చంద్రబాబు చేసింది 4.3 కిలోమీటర్లే. సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలన పూర్తికాక ముందే 2.8 కిలోమీటర్లు పూర్తిచేశారు. చంద్రబాబుకు మనసు ఉండి ఉంటే.. టీడీపీ హయాంలోనే వెలుగొండ పూర్తయ్యేది. రెండో టన్నెల్‌ వైయస్‌ఆర్‌ హయాంలో 8.7 కిలోమీటర్లు పూర్తిచేశారు. చంద్రబాబు హయాంలో 2 కిలోమీటర్లు పూర్తిచేస్తే.. సీఎం వైయస్‌ జగన్‌ వచ్చాక ప‌నులు ఇంకాస్త వేగం పెంచుకున్నాయి. కచ్చితంగా ఈ రెండేళ్లలో పూర్తిచేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. 

ప్రాంతాల మధ్య నుంచి జిల్లాల మధ్యకు దించి.. మండలాలు, డివిజన్ల మధ్య అయినా సరే విద్వేషాలు సృష్టించి ఏరకంగా పబ్బం గడుపుకోవాలని, దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలనేది చంద్రబాబు, ఆయన పార్టీకి పూర్తిగా విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వేరే విద్య తెలిసినట్టు లేదు. 

పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై చంద్రబాబు స్టాండ్‌ ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నాం. టీడీపీ ఏం భావిస్తుందో స్పష్టంగా చెప్పాలి. చెప్పిన తరువాత ఏదైనా మాట్లాడండి. ఇంతటి దౌర్భాగ్యపు రాజకీయం చేసే పార్టీ ఎక్కడైనా ఉండి.. కొనసాగుతుందంటే ఎన్ని తంత్ర విద్యల మీద, ఎలాంటి అబద్ధాలు, అసత్యాల మీద రాజకీయం చేస్తుందో అందరూ ఆలోచించాలి. 

ప్రతి రోజూ వివరణ ఇస్తున్నాం. ఈనాడు పత్రిక చేస్తున్న ప్రచారం.. రకరకాల కథలు అల్లుతున్నారు. ఎన్నికలు మూడేళ్లు ఉండగానే ఇప్పటి నుంచే కుట్రపూరితంగా అన్ని వైపుల నుంచి ప్రజలకు, రాష్ట్రానికి, రాష్ట్ర సమస్యలకు పరిష్కారం చూపే దిశగా కాకుండా.. కేవలం కుయుక్తులతో రాజకీయం చేసి తమది పైచెయ్యి అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజులు మతం గురించి, ఇప్పుడు ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య, ఏ అంశం దొరికితే దానిపై పబ్బం గడుపుకొని ప్రజల్లో సందిగ్ధతను తీసుకురావాలని ప్రయత్నంలో ఈనాడు ప్రధాన భూమిక పోషిస్తున్నారనేది ప్రజల దృష్టికి రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. 

ఈ రోజు ఈనాడు పత్రికలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడం పట్ల నిరుద్యోగుల ఆందోళన. ఈడబ్ల్యూఎస్‌ ఇవ్వలేదని రాశారు. ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి కేంద్రం అదనంగా ప్రకటించిన 10 శాతం మీద చంద్రబాబు ప్రభుత్వం ఆఖరిలో చేసిన తొందరపాటు వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం రిజర్వేషన్‌ పెట్టేశారు. ఆ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం తాజాగా ఇంప్లిమెంటేషన్‌లోకి తెస్తుంది. ఈరోజు జీఓ కూడా విడుదలవుతుంది. జీఓ రాగానే ఈనాడు పత్రిక మా ఎఫెక్ట్‌ వల్లే అని రాసుకుంటారు. ఈడబ్ల్యూఎస్‌ డిలే ఎందుకు అయ్యిందంటే.. చంద్రబాబు చేసిన పని వల్లే అయ్యింది. 

వారం క్రితం కొలువుల ఆశలపై నీళ్లు అని,  ఉద్యోగాలు ఇవ్వలేదని ఈనాడు రాసింది. ఈరోజు మొత్తం ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల నంబర్లతో సహా రాశారు. అంతకు ముందు లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ దోపిడీ అని రాశారు. నిన్న మాత్రం విశాఖలో లేటరైట్‌ తవ్వకాలు అని మళ్లీ రాశారు. ఈనాడు పత్రిక అబద్ధాలు ఆడినా.. ఎక్కడో ఒక చోట దొరికిపోతున్నారు. గతంలో రాజకీయంగా ఉండేది.. కానీ, రెండుమూడు నెలలుగా ప్రతి అంశాన్ని వక్రీకరిస్తూ రాస్తున్నారు. ఈనాడు పత్రిక చాలా తెలివిగా చేస్తున్నామనుకుంటున్నారు.. కానీ అడ్డంగా దొరికిపోతున్నారు. 

వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపాలి.. సలహాలు ఇవ్వాలి. కానీ ఏమీ లేని అంశంపై దుష్ప్రచారం చేయొద్దు. కడప జిల్లాలో లేటరైట్‌ అంటున్నారు.. కడప జిల్లాలోనే కాదు.. తాండూరు సిమెంట్‌ ఫ్యాక్టరీ కూడా లేటరైటే వాడుతుంది. కానీ కడప జిల్లా అంటే చదివేవాళ్లకు స్ట్రయిక్‌ కావాలని రాస్తుంటారు. బాక్సైట్‌ అనేది సిమెంట్‌కు పనికిరాదు. లేటరైట్‌ మాత్రమే వాడతారు. ఈరోజు కొత్తగా లేట‌రైట్‌ పుట్టినట్టు రాస్తుంటారు. చంద్రబాబు హయాంలో లేటరైట్‌లో జరిగినంత దోపిడీ ఇప్పుడు జరగడం లేదే.. కొత్తగా ఏమైనా అనుమతులు ఇచ్చామా..? ఇలాంటి అంశాలు ఎందుకు తీసుకెళ్ల‌రు..? ప్రజలను గందరగోళం సృష్టించాలని చూస్తున్నారు. రెండు నెలల్లోనే కోవిడ్‌ వల్ల రాష్ట్రంలో భారీ సంఖ్య‌లో మ‌ర‌ణాలు చోటు చేసుకున్నాయి.. ఇవన్నీ కోవిడ్‌ అనే అనుమానం అని రాశారు. కోవిడ్‌ మరణాలు దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది. దేశంలోనే కోవిడ్‌ కట్టడిలో ఏపీ బాగాపనిచేసిందని అందరూ అంగీకరించారు. ప్రభుత్వంపై బురదజల్లాలనే ప్రయత్నం తప్ప.. మరొకటి కాదు. చంద్రబాబు వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు కాకుండా.. రాష్ట్రానికి నష్టం కలిగించే దిశగా ఉంటాయని అందరూ గమనించాలి’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top