తాడేపల్లి: పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ పర్ఫామెన్స్ ఎంత అద్బుతంగా ఉందో.. రెండేళ్ల తరువాత సీఎం వైయస్ జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పాలనతో ప్రజల్లో మరింత ఆదరాభిమానాలు పెరిగాయన్నారు. వైయస్‌ఆర్ సీపీ బలపర్చిన అభ్యర్థుల విజయం నిశ్చమని ధీమా వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమం కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిమళ్లించేందుకు చంద్రబాబు అనేక కుట్రలు చేశారని, బాబు కుయుక్తులకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో ఏదో ఘోరం జరిగిపోతుందనే అలజడి సృష్టించే చంద్రబాబు, నిమ్మగడ్డ ప్రయత్నాలను ప్రజలంతా చూశారన్నారు. చంద్రబాబుకు కుట్రలు చేయడం పుట్టుకతో వచ్చిందేనని, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పచ్చచొక్కా వేసుకున్న కార్యకర్తలా ప్రవర్తించారన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అధికార దుర్వినియోగంపై కొత్త చర్చకు తెరలేపాలని వైయస్‌ఆర్ సీపీ భావిస్తుందన్నారు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన పరిధి దాటి ప్రవర్తిస్తూ.. నైతికతను గాలికివదిలేశాడన్నారు. ఎన్నికల కమిషన్ వ్యవస్థ తన పని చిత్తశుద్ధిగా చేసే విధంగా, పరిధి దాటకుండా కట్టడి చేయడానికి మార్గాలు ఏంటని, దీనిపై సంస్కరణలు రావాలని, ఆ దిశగా జాతీయ స్థాయిలో చర్చలు జరగాలని భావిస్తున్నామన్నారు.