తాడేపల్లి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు.. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారని, సీఎం నిర్ణయానికి రాష్ట్ర ప్రజలంతా అంగీకరించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సాంకేతిక కారణాలు చూపి వికేంద్రీకరణ బిల్లుకు చిక్కులు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా `వికేంద్రీకరణ` యజ్ఞం ఆగదన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్లాయి. నిబంధనల ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. బిల్లులను అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఒక ప్రాంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. అసెంబ్లీలో రెండోసారి బిల్లుకు ఆమోదం లభించింది. మండలిలో టీడీపీ సభ్యులు దౌర్జన్యం చేసి బిల్లులను అడ్డుకున్నారు. సెలెక్ట్ కమిటీ పేరుతో టీడీపీ సభ్యులు కాలయాపన చేయాలని చూశారు. సెలెక్ట్ కమిటీ అనేది వాస్తవరూపం దాల్చలేదు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. వాస్తవాలను అంగీకరించే పరిస్థితుల్లో చంద్రబాబు లేరు. సాంకేతిక కారణాలు చూపి బిల్లుకు చిక్కులు సృష్టింంచేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ ముందడుగు వేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్ జగన్ వికేంద్రీకరణ బిల్లును తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా అంగీకరించారు. ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటారు` అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.