రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి  మృతి రాష్ట్రానికి తీరని లోటు

  సంతాప సభలో రాష్ట్ర మంత్రులు  బొత్స, కన్నబాబు, వెల్లంపల్లి 

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో గౌత‌మ్‌రెడ్డికి ఘన నివాళి.  

 తాడేప‌ల్లి: రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి  మేకపాటి గౌతంరెడ్డి ఆకస్మిక మృతి రాష్ట్రానికి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటని రాష్ట్ర మంత్రులు బొత్స సత్యన్నారాయణ, కురసాల కన్నబాబు,  వెల్లంపల్లి శ్రీనివాస్ లు పేర్కొన్నారు. మేకపాటి గౌతంరెడ్డి హఠాత్తుగా మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు. 

తాడేపల్లిలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మేకపాటి గౌతంరెడ్డి సంతాప సభ నిర్వహించారు. మేకపాటి గౌతంరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రెండు నిముషాలు మౌనం పాటించారు. కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

 ఈ సందర్భంగా మంత్రి  బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ... ఈరోజు ఉదయం గౌతంరెడ్డి గుండెపోటుతో మృతి చెందారనే వార్త విని ఎంతో షాక్‌ కు, తీవ్ర దిగ్భ్రాంత్రికి లోనయ్యామన్నారు. వైయ‌స్ గారి కుటుంబంతో మాజీ ఎంపీ మేకంపాటి రాజమోహన్‌ రెడ్డిగారికి మంచి అనుబంధం ఉందని గుర్తు చేస్తూ,   వైయస్‌ జగన్‌ గారి కోసం పార్లమెంట్‌ సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా చేశారని గుర్తు చేశారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఎంతో నిబధ్దతతో పనిచేసేవారు, రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే తలంపుతోనే ఎప్పుడూ ఉండేవారన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుడ్ని కోరారు.

              మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. గౌతంరెడ్డి మరణించారన్న వార్తను ఇప్పటికి నమ్మలేకపోతున్నామని  అన్నారు. మంత్రులం, శాసససభ్యులందరం  ఈ వార్తతో షాక్‌ లో ఉన్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి, చురుకైన నాయకుడు గౌతంరెడ్డి అన్నారు. హఠాత్తుగా ఆయన మనందర్నీ వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యంగా లేదు. కేబినెట్‌ లోనే కాదు,  ఎంటైర్‌ అసెంబ్లీలోనే నెంబర్‌ వన్‌ గా కనిపించే గౌతంరెడ్డి లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. ఇటీవల దుబాయ్‌ ఎక్స్‌ పో కు వెళ్ళి, తన పర్యటనను విజయవంతం చేసుకుని రేపు ముఖ్యమంత్రిగారితో ఫాలోఅప్‌ మీటింగ్‌ పెట్టుకుని వాటిని వివరిస్తారని అనుకున్నాం. ఇంతలోనే ఆయన అందర్ని వదిలివెళ్లిపోయారు. చిన్నవయస్సులోనే ఆయన హఠాన్మరణం చెందడం భాధాకరం అని అన్నారు.

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  మేకపాటి గౌతంరెడ్డి మృతి దురదృష్టకరమన్నారు.  రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి, మేలు చేయాలని అనునిత్యం కష్టపడిన వ్యక్తి అని అన్నారు. నెల్లూరు జిల్లాలో పార్టీకి  వెన్నెముకలా నిలిచి, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ గారికి తోడుగా నిలిచారన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని అన్నారు. 

       శాసనమండలి సభ్యులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ...  గౌతంరెడ్డిగారి అకాలమరణం అందర్నీ కలచివేస్తోంది. యువకుడు, సహనశీలి, ఉత్సాహవంతుడు... అందర్నీ చిరునవ్వుతో పలకరించే యువ నాయకుడు మన మధ్య నుండి దూరమవడం చాలా బాధాకరమన్నారు. ఆయన మృతి పట్ల రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర మనోవేదనతో ఘన నివాళులర్పిస్తున్నారని తెలిపారు. 

శాసనసభసభ్యులు శ్రీ మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి  వైయస్‌ జగన్‌ గారి వెన్నంటి నడుస్తూ, మొదటి నుంచీ జగన్ గారికి కి అండగా నిలిచిన కుటుంబం మేకపాటి కుటుంబం అన్నారు. ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గౌతంరెడ్డి చిన్నవయస్సులోనే మృతి చెందటం చాలా బాధాకరం అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్‌ శ్రీ కావటి శివ నాగ మనోహర్‌ నాయుడు, ఎస్సీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ శ్రీ కనకారావు మాదిగ, ఆప్కో ఛైర్మన్‌ శ్రీ చిల్లపల్లి మోహన్‌ రావు, నవరత్నాల అమలు కమిటీ వైస్‌ ఛైర్మన్‌ శ్రీ అంకంరెడ్డి నారాయణమూర్తి, విజయవాడ సిటీ  పార్టీ అద్యక్షుడు శ్రీ బొప్పన భవకుమార్‌ ,తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్‌ ఛార్జ్‌ శ్రీ దేవినేని అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top