కేంద్ర సహకారం లేకే రాయలసీమ లిఫ్ట్‌పై ట్రిబ్యునల్‌ స్టే

విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం చెయ్యొద్దన్నా వినడం లేదు

 ‘హోదా’ ఎందుకివ్వలేదో చెప్పండి

బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలేదు

బీజేపీ రణభేరిపై చీఫ్‌విప్‌ గడికోట

వైయ‌స్ఆర్ జిల్లా : ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధి కారంలో ఉన్న బీజేపీ.. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదాను ఏపీకి ఎందుకివ్వలేదో చెప్పాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాయలసీమ సమస్యలపై బీజేపీ నిర్వహించిన రణభేరిపై శనివారం కడప కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చెయొద్దని ఎన్నిసార్లు మొత్తుకున్నా లాభం లేకపోయిందన్నారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలేదన్నారు. దివంగత వైఎస్సార్‌ హయాంలోనే రాయలసీమ అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. పో తిరెడ్డిపాడును విస్తరించడం ద్వారా ఆయన రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు తెచ్చారని, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ మరింత మేలుచేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర సహకారం లేనందునే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ముందుకు సాగకుండా ట్రిబ్యునల్‌ స్టే ఇచ్చిందన్నారు. ఇక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా వైఎస్సార్‌సీపీకి వచ్చే నష్టమేమీలేదన్నారు. ప్రభుత్వ విప్‌ కొరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని మీటింగులు పెట్టినా బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. బీజేపీ రణభేరికి జెండా, అజెండా లేదన్నారు. 

విభజన సమస్యలు తీర్చలేదుగానీ..
మరో కార్యక్రమంలో విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. విభజనవల్ల తీవ్రంగా నష్టపోయిన ఏపీలో ఇప్పుడున్న సమస్యలను పరి ష్కరించడం చేతగాని బీజేపీ, కొత్త సమస్యల కోసం పోరాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ సమస్యనూ ఇంతవరకూ పరిష్కరించలేదని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కూడా ఇవ్వలేదన్నారు.

రాయలసీమ అభివృద్ధి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న గాలేరు–నగరి, హంద్రీ–నీవా, గండికోట ప్రాజెక్టులను పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి సురేష్‌ అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top