అమరావతి: నవరత్నాలతో పాటు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బడ్జెట్‌పై ఆయన స్పందించారు. చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులకు మేం వడ్డీ కడుతున్నామని తెలిపారు. మా ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ఎక్కడా కేటాయింపులు తగ్గలేదన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని సైతం అడ్డుకునేందుకు యత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం టీడీపీ అని విమర్శించారు. ప్రజలకు మంచి బడ్జెట్ ఇచ్చిన ఆర్థిక మంత్రి బుగ్గనకు శ్రీకాంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఏమన్నారంటే..
గత తెలుగుదేశం ప్రభుత్వం ఆర్ధిక రంగాన్ని సర్వనాశనం చేసి, పూర్తిగా నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇప్పుడు మేము వడ్డీలు కడుతున్నాం.
ఇప్పటివరకూ మా ప్రభుత్వం ప్రారంభించి, అమలు చేస్తున్న ఏ ఒక్క పథకంలోనైనా కేటాయింపులు తగ్గించామా..? అంటే లేదు. అమ్మ ఒడి నుంచి రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఏ పథకం తీసుకున్నా గత మూడేళ్ళుగా, యేడాదికి యేడాది నిధుల కేటాయింపులు పెరుగుతున్నాయనేది అర్థమవుతుంది. ప్రతి పథకాన్ని శాచురేషన్ పద్ధతిలో అమలు చేస్తున్నాం.
చంద్రబాబు, యనమలలే పెద్ద ఆర్ధికవేత్తలుగా, నోటికొచ్చిన లెక్కలు మాట్లాడుతున్నారు. వారు ఎంతసేపటికీ అబద్ధాలను, అసత్యాలను పోగేసి, ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే వారి మాటల్లో నిజం లేదు.
ఇపుడు కొత్త బిచ్చగాడుగా లోకేష్ తయారయ్యాడు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తిడితే తనకు మైలేజ్ పెరుగుతుందనే భ్రమల్లో ఉన్నాడు. అందుకే కనీస మర్యాదలు పాటించకుండా బూతులు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీ నాన్న హయాంలో జరిగిన దుర్మార్గాలను తెలుసుకో. మీ హయాంలో జరిగిన అన్యాయాలను, దుర్మార్గాలను, తప్పిదాలను సరిదిద్దుకుంటూ మేం ముందుకు వెళుతున్నాం. అదే మీరు మీ వ్యక్తిగత ఎజెండాలతో రాష్ట్రాన్ని అన్నింటా దోచుకున్నారు.
మేం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉన్నాం. బడ్జెట్లో నవరత్నాలతో పాటు అన్ని రంగాలకి సమాన ప్రాధాన్యతమిచ్చాం. మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్కు అభినందనలు చెబుతున్నాం. ఇప్పటికి నాలుగు బడ్జెట్ లు ప్రవేశ పెట్టాం. మరో రెండేళ్లే కాదు.. ఇంకో పదేళ్ళు- ఇరవై ఏళ్ళు కూడా మేమే బడ్జెట్ లు ప్రవేశపెడతాం.
శాసనసభ గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశమే టీడీపీకి లేదు. ప్రతిరోజూ సభలో అల్లరి చేయడం, రన్నింగ్ కామెంట్లు చేయడం తప్ప వారికి మరో పని లేదు. కుప్పం ఎన్నిక ఓటమిని డైవర్షన్ చేయడానికే చంద్రబాబు గత సమావేశాల్లో ఆర్గనైజ్డ్ ఏడుపు ఏడ్చి సభ నుంచి బయటకు వెళ్ళాడు. బడ్జెట్ ప్రసంగాన్ని సైతం అడ్డుకోవడానికి ప్రయత్నించిన దుర్మార్గపు ప్రతిపక్షం ఈరోజు రాష్ట్రంలో ఉంది.