అప‌రిష్కృత స‌మ‌స్య‌ల‌కు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంలో ప‌రిష్కారం

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి

నెల్లూరు:  స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గ్రామాలలో పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తున్నామ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం,"గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా పొట్టెంపాడు సచివాలయ పరిధిలో పోలంరాజుగుంట గ్రామంలో మంత్రి ప‌ర్య‌టించారు.  ప్ర‌తి ఇంటికి వెళ్లిన మంత్రి మూడున్న‌రేళ్ల వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌లో చేసిన సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు.  ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ధ్యేయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.  ముత్తుకూరు మండలాన్ని యూనిట్ గా తీసుకొని నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ రూ.25,000/-లను అందించామ‌న్నారు.  మద్దతు ధర దొరక్క, రైతులు రోడ్డెక్కుతారని తెలుగుదేశం నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రైతులను ఉసగొల్పి ప్రభుత్వంపై విమర్శలు చేయాలని తెలుగుదేశం నాయకులు స్క్రిప్ట్ రాసుకున్నారని మండిప‌డ్డారు. తెలుగుదేశం నాయకులు రాసుకున్న స్క్రిప్ట్ ను భగవంతుడు కొట్టేశాడ‌ని తెలిపారు. రికార్డు స్థాయిలో రైతుల ధాన్యానికి మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలకడంతో రైతులందరూ సంతోషంగా ఉన్నార‌ని చెప్పారు. వైయ‌స్ జ‌గ‌న్ రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు.  రైతులు పండించే రెండో పంటకు కూడా సమృద్ధిగా సాగునీరు అందిస్తామ‌న్నారు.  మహానేత వైయ‌స్‌ రాజశేఖర్ రెడ్డి గారు, వైయ‌స్ జ‌గ‌న్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కరువు దరిచేరద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.  చంద్రబాబు, కరువు కవల పిల్లలు లాంటివార‌ని ఎద్దేవా చేశారు. ఎప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, వందల సంఖ్యలో కరువు మండలాలు ప్రకటించే నేపధ్యం చూశామ‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలుస్తుంద‌న్నారు.  ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు.

Back to Top