విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పేదలకు నాలుగో విడత రేషన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పీడీఎఫ్ బియ్యం, కేజీ శనగలు అందజేసున్నారు. రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలు బియ్యంకార్డులు కలిగి ఉన్నాయి. కొత్తగా 81,862 పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కార్డుదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ అందజేస్తున్నారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద డీలర్లు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. 27వ తేదీ వరకు పంపిణీ నాలుగో విడత రేషన్ పంపిణీ ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చేయనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబసభ్యుని ఐదు కేజీల ఉచిత బియ్యం, అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చెస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు పదికిలోల ఉచిత బియ్యం అందజేస్తున్నారు. ప్రతీ కార్డుకూ కిలో శనగపప్పు ఉచితంగా ఇస్తున్నారు. వేలిముద్ర తప్పనిసరి కావటంతో రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో రేషన్ కార్డు లేని పేదలకు కూడా సరుకులు పంపిణీ చేస్తున్నారు. సబ్సి డీ ధరపై అర కేజీ పంచదార అందజేస్తున్నారు.