తిరుపతి: కలియుగ వైకుంఠం తిరుమలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస అపచారాలు చోటుచేసుకుంటున్నాయని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొండపై అవినీతి పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు. అత్యంత పవిత్రమైన 'నాదనీరాజనం' వేదికను కమిషన్ల దందాకు అడ్డాగా మార్చారని, కళాకారుల పారితోషికంలోనూ వాటాలు వసూలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. రూ.300 దర్శన టిక్కెట్లను వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ సామాన్య భక్తులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్వీబీసీ ఛానెల్‌ను నిర్వీర్యం చేస్తూ, వేద పండితులను అవమానిస్తున్న కూటమి పాలకులకు భగవంతుడి ఆగ్రహం తప్పదని భూమన హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - నాదనీరాజనం వేదికపై 'కమిషన్ల' దందా సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి దివంగత నేత వైయస్సార్ హయాంలో ప్రారంభించిన 'నాదనీరాజనం' వేదిక నేడు అవినీతికి నిలయంగా మారింది. ఈ వేదికపై ప్రదర్శన ఇచ్చే కళాకారుల పారితోషికంలో నుంచి కూడా బీఆర్ నాయుడు మనుషులు కమిషన్లు వసూలు చేస్తున్నారు. మరోవైపు నాదనీరాజనంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న కళాకారుల నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారని, కూటమికి అనుకూల పత్రికలే ఈ వార్తలను ప్రచురించడం దారుణమని మండిపడ్డారు. నాదనీరాజనంలో భాస్కర్ అనే అనర్హత కలిగిన అధికారిని నియమించి, కళాకారులను వేధిస్తున్నారని ఆరోపించారు. - టిక్కెట్ల బ్లాక్ మార్కెట్ – భక్తులపై దోపిడీ తిరుమల కొండపై అన్ని రకాల దర్శన టిక్కెట్లు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. రూ.300 టిక్కెట్లను రూ.3,000 నుంచి రూ.4,000 వరకు విక్రయిస్తున్నారు.మరోవైపు శ్రీవాణి టిక్కెట్లను ఏకంగా రూ.15,000కు అమ్ముకుంటున్నారు. మరోవైపు రాత్రి 8 గంటల తర్వాత చైర్మన్ కార్యాలయం నుంచి ప్రత్యేక దర్శనం టిక్కెక్లను అమ్ముకుంటున్నారు. ప్రకాష్, రవి, సాయి అనే ముగ్గురు వ్యక్తులు ఈ టిక్కెట్ల దందాను నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడతామని భయపెడుతున్నారు. - ఎస్వీబీసీ (SVBC) నిర్వీర్యం - ఆధ్యాత్మిక విలువల పతనం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ఛానెల్‌ను కూటమి ప్రభుత్వం 'తెల్ల ఏనుగు'గా మార్చేసింది. కోట్లాది మంది వీక్షించే కుప్పా విశ్వనాధశర్మ వంటి పండితులను అవమానించి పంపించివేశారు. వైయస్ జగన్ హయాంలో దాతల ద్వారా సేకరించిన రూ.50 కోట్ల నిధులను పక్కదారి పట్టించారు. నిరంతర వేదపారాయణ కార్యక్రమాలను నిలిపివేసి, ఛానెల్ పరువు తీస్తున్నారు. - వేద పాఠశాలలు - మత గురువులకు పరాభవం వేద పాఠశాలలో జరిగిన సదస్సులో ఉత్తరాది మఠం స్వామీజీని అవమానించడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం. వేద విద్యార్థులకు ఇచ్చే పతకాలను బంగారం ధర పెరిగిందని చెప్పి నిలిపివేయడం విడ్డూరమన్నారు. మరోవైపు వైయస్.జగన్ హాయంలో 700 వేద పారాయణం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అభ్యర్ధుల నుంచి ఇంటర్వ్యూలు చేసి డబ్బులు వసూలు చేసి.. పోస్టింగులు ఇవ్వలేదు . - కళలు, సంస్కృతిపై నిర్లక్ష్యం.. తిరుమల తిరుపత దేవస్దానం సంగీత నృత్య కళాశాలలో కూచిపూడి, హరికథ వంటి కళలకు అధ్యాపకులు లేకుండా చేసి, తెలుగు సంస్కృతిని చిదిమేస్తున్నారు. శిల్పకళాశాల పక్కన విగ్రహాన్ని అపహాస్యం చేసి, ఇప్పుడు ఏకంగా కళాశాలనే ఎత్తివేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు డ్రైవర్లకు టైమ్ స్కేల్, అధ్యాపకులకు జీతాల పెంపు వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కలిగిన పాలకులే అపచారాలకు ఒడిగట్టడం చారిత్రక తప్పిదమని భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. బాహ్య ప్రపంచానికి పాప ప్రక్షాళన అని చెబుతూ, అంతర్గతంగా తిరుమల కొండను అవినీతిమయం చేయడం భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయడమేనని మండిపడ్డారు. ఇప్పటికైనా టీటీడీ చైర్మన్ కార్యాలయంపై పెత్తనం చెలాయిస్తున్న దళారులను అరికట్టాలని, దర్శన టిక్కెట్ల దోపిడీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో అరాచకాలు సాగిస్తే కాలగమనంలో పాలకులకు తగిన శాస్తి తప్పదని, సామాన్య భక్తుడి పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాలపై పోరాటం కొనసాగిస్తుందని భూమన స్పష్టం చేశారు.