అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక 'శని'లా దాపురించారని, ఆయన పాలనలో ప్రాజెక్టుల్లో నీళ్లు పారడం కంటే టీడీపీ నేతల ఇళ్లలోకి నిధులు పారడమే ఎక్కువగా జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం అనంతపురంలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో టీడీపీ నేతలు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు. నాడు సాగు,తాగు నీటి అవసరాల కోసం 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీనీవా రూపొందిస్తే.. చంద్రబాబు మాత్రం దానిని 5 టీఎంసీలకు కుదించి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం హంద్రీనీవా ఫేజ్-2లో చేపట్టిన నాసిరకం కాంక్రీట్ లైనింగ్ పనుల వల్ల సుమారు 40 వేల మంది రైతుల బోర్లు ఎండిపోయాయని తోపుదుర్తి ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు పెరగకుండా అడ్డుపడుతూ, కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కోసమే వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి భవనాల నిర్మాణం పేరుతో చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు చూపిస్తూ సుమారు రూ.10 వేల కోట్ల భారీ దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. రైతులకు మేలు చేయలేని ఈ సిగ్గులేని ప్రభుత్వం వెంటనే నాసిరకం పనులపై విచారణ జరిపించాలని, లేనిపక్షంలో మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే... - ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు 'నిధుల'దోపిడీ నిధులు పారడమే బాబు నిర్వచనం. ప్రాజెక్టులు అంటే రైతులకు నీళ్లివ్వడం అని దివంగత నేత వైయస్సార్ భావిస్తే, కాంట్రాక్టర్లకు నిధులు దోచిపెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రాజెక్టుల్లో నీళ్లు పారడం కంటే టీడీపీ నేతల జేబుల్లోకి నిధులు పారడమే ఎక్కువగా కనిపిస్తోంది. హంద్రీనీవా ప్రాజెక్టును మొదలుపెట్టామని చెప్పుకునే టీడీపీ నేతలు, నాడు 40 టీఎంసీల ప్రాజెక్టును కేవలం 5 టీఎంసీలకు కుదించి రాయలసీమకు ద్రోహం చేసిన చరిత్ర చంద్రబాబుదే. - కాంక్రీట్ లైనింగ్‌తో రైతుల నడ్డి విరిచారు.. హంద్రీనీవా ఫేజ్-2 పనుల్లో భాగంగా అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కాలువలకు వేసిన కాంక్రీట్ లైనింగ్ వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లింది. భూగర్భ జలాలు పూర్తిగా పతనమయ్యాయి. గతంలో కాలువ ద్వారా నీరు ఇంకి భూగర్భ జలాలు పెరిగేవి. నేడు కాంక్రీట్ లైనింగ్ వల్ల 40 వేల మంది రైతుల బోర్లు ఎండిపోయాయి. కేవలం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడం కోసమే మార్గమధ్యలో ఉన్న రైతుల బోర్లను ఎండగడుతున్నారు. మరోవైపు నాసిరకం పనులతో దోచుకుంటున్నారు. యుద్ధ ప్రాతిపదికన అనుమతులిచ్చి చేపట్టిన ఈ లైనింగ్ పనులు అత్యంత నాసిరకంగా ఉన్నాయి, ఒక్కసారి నీళ్లు వదలగానే 100కు పైగా చోట్ల కాంక్రీట్ జారిపోయింది. రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. రాష్ట్రంలో ఎక్కడా చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు, కానీ చంద్ర బాబు ప్రభుత్వం రూ.14 వేలు ఖర్చు చూపిస్తూ సుమారు రూ.10 వేల కోట్ల ప్రజాధనాన్ని కాజేస్తోంది. - పేరూరు డ్యామ్ - రైతు ప్రయోజనాలు తుంగలో.. పెన్నా నది ద్వారా అతి తక్కువ ఖర్చుతో పేరూరు డ్యామ్‌కు నీళ్లిచ్చే అవకాశం ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. అదే వైయస్ జగన్ ప్రభుత్వం పెన్నా నదిలో 60 కిలోమీటర్ల మేర కాలువ నిర్మించి మూడేళ్లపాటు నీళ్లిచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా పేరూరుకు నీళ్లివ్వాలని స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు అడిగిన పాపాన పోలేదన్నారు. ఈ నేపథ్యంలో... హంద్రీనీవా ప్రాజెక్టును కేవలం తన బినామీ కాంట్రాక్టర్లకు మేతగా మార్చేయడం ద్వారా... రైతులకు అందాల్సిన నీళ్లను అడ్డుకుంటూ, నాసిరకం కాంక్రీట్ లైనింగ్‌తో భూగర్భ జలాలను పాతాళానికి తొక్కేస్తున్న ఈ 'శని' పాలనను రైతాంగం ఎన్నటికీ క్షమించదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. కాలువ పనుల్లో జరుగుతున్న అవినీతిపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతుల బోర్లలో నీళ్లు పారించలేని మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల్లో కొనసాగే అర్హత కోల్పోయారని.. ఇప్పటికైనా దోపిడీ మానుకుని రైతులకు సాగునీరు అందించే పిల్ల కాలువ పనులపై దృష్టి పెట్టాలని, నిధులు తేలేకపోతే పదవులుకు రాజీనామా చేయడంతో పాటు నాసిరకంగా మీ హయాంలో చేపట్టిన కాలువ పనుల మీద విచారణ చేయించి, బాధ్యులుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.