అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం

అమరావతి తీర్మానంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్‌

విజయవాడ: అమరావతి రాజధాని అంశంపై అసెంబ్లీలో తీర్మానం తీసుకురావాల్సిన అవసరం ఏమిటో కూటమి ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పలేదని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. 
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. అమరావతి కోసం 33 వేల ఎకరాలు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటివరకు ఏ మేలు జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రెండో విడత భూ సమీకరణపై గతంలో ఎక్కడా ప్రస్తావించలేదని, ఇప్పుడు అకస్మాత్తుగా దానిపై మాట్లాడటం సరైంది కాదన్నారు. రైతులు రెండో విడతకు భూములు ఇవ్వబోమని స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు. రైతులకు న్యాయం చేయలేకపోయిన కారణంగానే ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మడం లేదని అన్నారు.

తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో తీర్మానాలకు ఎంతవరకు విలువ ఉందో ప్రశ్నిస్తూ, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో చేసిన తీర్మానాల పరిస్థితి ఏమైందో గుర్తు చేశారు. అమరావతికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, తమ నాయకుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారని తెలిపారు. అమరావతిని పూర్తిగా తీసేయాలనే ఆలోచన తమకు లేదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు.

రైతులకు మాయ మాటలు చెప్పి వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది కూటమి ప్రభుత్వమేనని ఆరోపించారు. 20 నెలల్లోనే భారీగా అప్పులు చేసి ప్రభుత్వం నడుపుతున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో జగన్‌పై ఆరోపణలు చేసినవారు ఇప్పుడు ఏ ముఖంతో అప్పులు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం డిజైన్ల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, అమరావతిలో నిర్మాణాల ఖర్చులు అనవసరంగా పెంచుతున్నారని అన్నారు. అభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. శాసనమండలిలో తీర్మానం ఆమోదం పొందకుండా అమరావతి అంశంపై తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందా అని ప్రశ్నిస్తూ, అవినీతి బయటపడుతుందనే భయంతోనే శాసనమండలిలో తీర్మానం పెట్టలేదని మల్లాది విష్ణు ఆరోపించారు.
 

Back to Top