జగన్‌ తల్లిని గౌరవిస్తారట.. చెల్లిని అభిమానిస్తారట.. శ్రీ‌మ‌తిని జైల్లో పెడ‌తార‌ట‌

 అబ్బాకొడుకులది ఏమి రాజనీతి?

 మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌ రెడ్డి ధ్వ‌జం

వైయ‌స్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌ రెడ్డి.  
 
 విజయమ్మ పుట్టిన రోజు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల‌కు సంతోషాన్ని ఇచ్చే రోజు

 మంత్రి లోకేష్ విజ‌య‌మ్మ‌కు ఆకస్మిక శుభాకాంక్షలపై అనుమానం

 విజ‌య‌మ్మ‌పై మునుపెన్నడు లేని ప్రేమను లోకేష్‌ ఒలకబోస్తున్నాడు

 గ‌తంలో వైయస్‌ విజయ అని సంబోధించిన లోకేష్‌.. ఇవాళ విజ‌య‌మ్మ గారికి అంటూ ట్వీట్ చేశారు

  జగన్‌కు వారి తల్లి, చెల్లిని దూరం చేసేందుకు లోకేష్ క‌ప‌ట ప్రేమ‌

 రాజకీయ స్వార్థాలకు కుటుంబ కలహాల‌లో జోక్యం చేసుకుంటారా?  

 గ‌తంలో విజ‌య‌మ్మ వాహ‌నాన్ని ఆపి సోదాలు చేసిన ఘ‌ట‌న‌ను మేం మ‌ర‌చిపోలేదు

 లోకేష్ చెప్పిన జన్మదిన శుభాకాంక్షల‌తో ఆమెకు మానసిక అశాంతి కలుగుతుంది

 ప్ర‌ధాని మోదీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లుల‌కు లోకేష్ ఎప్పుడైనా శుభాకాంక్షలు చెప్పారా?

 రాష్ట్ర ప్రజలు అబ్బా కొడుకుల రాజకీయాలను గమనించాలి

 రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌ రెడ్డి విజ్ఞ‌ప్తి  

ప్రొద్దుటూరు: వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి మాతృమూర్తి శ్రీ‌మ‌తి వైయ‌స్ విజ‌య‌మ్మ గారికి మంత్రి నారా లోకేష్‌ ఆకస్మికంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఉందని మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ గౌరవం చూపని లోకేష్‌, ఇప్పుడు విజయమ్మపై ప్రేమ ఒలకబోస్తుండటం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. జగన్‌ తల్లిని గౌరవిస్తారట, చెల్లిని అభిమానిస్తారట… కానీ ఆయన శ్రీమతి భార‌త‌మ్మ‌ను జైలుకు పంపిస్తారట..ఇదేమి రాజనీతి? అంటూ మండిప‌డ్డారు. కుటుంబ కలహాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నమేన‌ని స్పష్టంగా కనిపిస్తోందని వైయ‌స్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని త‌న క్యాంపు కార్యాల‌యంలో వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఆక్షేపించారు. 
ప్రెస్‌మీట్‌లో రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఇంకా ఏమ‌న్నారంటే..

- లోకేష్‌ది క‌ప‌ట ప్రేమ‌

నిన్నటి దినం మా ఆత్మీయ నాయకుడు శ్రీ వైయస్ జగన్ గారి మాతృమూర్తి వైయ‌స్ విజ‌య‌మ్మ‌ గారి జన్మదినం. ఈ రాష్ట్రంలోని పేదలు, రైతులు, ముఖ్యంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులకు అది ఎంతో సంతోషకరమైన రోజు. మాకు ఆమె మాతృ సమానురాలు. ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే నాయకుడిని ఇచ్చిన తల్లిగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజయమ్మ పుట్టిన రోజు మాకు పండుగ రోజే. కానీ నారా లోకేష్‌కు ఎందుకింత ఆనందమో అర్థం కావడం లేదు. మునుపెన్నడూ లేని ప్రేమను లోకేష్ ఇప్పుడు విజయమ్మ పట్ల ఒలకబోస్తున్నాడు. నిన్న తన ఎక్స్‌ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు. కానీ గత 15 ఏళ్లలో ఎప్పుడైనా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడా? నిజాయితీగా చెప్పాలంటే, ఇంతవరకు విజయమ్మ గారిని గౌరవంగా సంబోధించిన సందర్భాలే లేవు. ఒక తల్లిని పిలిచినట్లు, ఒక పెద్దావిడను గౌరవించినట్లు ఎప్పుడూ వ్యవహరించలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ప్రేమ ఎందుకు? కారణం ఒక్కటే..జగన్‌పై వ్యతిరేక భావంతో, వారి కుటుంబంలో ఉన్న విభేదాలను రాజకీయ స్వార్థాలకు వాడుకోవడమే. అంతకంటే వేరే ఉద్దేశ్యం కనిపించడం లేదు.

- నాడు వైయ‌స్ విజ‌య‌..నేడు విజ‌య‌మ్మా? 

రాజనీతిశాస్త్రం ప్రకారం శత్రువు శత్రువుకు మిత్రుడు అంటారు. కానీ ఇక్కడ తల్లి, చెల్లి ఎప్పటికీ శత్రువులు కారు. అవి కేవలం తాత్కాలిక కుటుంబ కలహాలు మాత్రమే. వాటిని శాశ్వత విభేదాలుగా మార్చాలని ప్రయత్నించడం సరికాదు. వైయ‌స్ జ‌గ‌న్‌కు తల్లి, చెల్లిని దూరం చేయాలనే ఉద్దేశంతో వీరు దగ్గరైనట్లు నటించడం కనిపిస్తోంది. అవసరం కోసం చూపించే గౌరవం, కపట ప్రేమతో నాడు ‘వైయస్‌ విజయ’ అని పిలిచిన వారు, ఇవాళ ‘వైయస్‌ విజయమ్మ’ అంటూ శుభాకాంక్షలు చెప్పడం ఏంటి? ఇది నిజమైన గౌరవమా లేక రాజకీయ అవసరమా?
కేవలం రాజకీయ స్వార్థాల కోసం కుటుంబ కలహాల్లో జోక్యం చేసుకోవడం తప్పు. ముఖ్యంగా ప్రత్యర్థుల కుటుంబ మహిళల విషయంలో ఇంగితజ్ఞానం పాటించాలి. కానీ అలాంటి సంయమనం లేకుండా వ్యవహరించడం దురదృష్టకరం.

- మేం మరచిపోలేదు

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారిని ప్రేమించేవాళ్లం, జీవితాంతం వైయ‌స్ జ‌గ‌న్‌ వెంట నడిచే వాళ్లం. ఆ కుటుంబంపై ఉన్న ఆప్యాయత వల్లే వైయ‌స్ విజ‌య‌మ్మ గారి గురించి గ‌తంలో జరిగిన కొన్ని సంఘటనలు మేం ఎప్పటికీ మరచిపోలేం. 2014–2019లో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న సమయంలో విజయవాడకు వస్తున్న విజయమ్మ గారి వాహనాన్ని ఆపి, కారును సోదా చేసి, ఆమె వ్యక్తిగత సామగ్రిని కూడా అవమానకరంగా తనిఖీ చేసిన ఘటన హృదయవిదారకంగా మిగిలిపోయింది. అలాంటి పరిస్థితిలో ఆమెను అవమానించిన వారు ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఎలా అర్థం చేసుకోవాలి?. వాత పెట్టేది మీరే… వెన్నపూస పూసేది మీరే అన్నట్టుగా, ఒకవైపు ఇబ్బందులు కలిగించి, మరోవైపు ప్రేమ చూపుతున్నట్లు నటించడం ద్వంద్వ వైఖరి. ఈ విధానాలన్నీ వైయస్‌ఆర్ కుటుంబానికి మానసిక శాంతి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే జరుగుతున్నాయన్న భావన కలుగుతోంది.

- శుభాకాంక్షలు చెప్పడం తప్పు కాదు కానీ.. 

ఇవాళ మీరు చెప్పిన జన్మదిన శుభాకాంక్షలతో విజ‌య‌మ్మ గారికి నిజంగా సంతోషం కలుగుతుందా?  లోకేష్‌ శుభాకాంక్షలు తెలపడం ఆమెకు మానసిక అశాంతినే కలిగిస్తుంది. ఎందుకంటే, గతంలో అవమానించినవాళ్లే ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతుంటే.ఇది కుటుంబంలో దూరం పెంచాలనే ప్రయత్నంగా అనిపించదా? అలాంటి అనుమానం సహజంగానే కలుగుతుంది. మీ ఉద్దేశం ఒక్కటే..రాజకీయ స్వార్థాల కోసం ఏ కుటుంబాన్నైనా వాడుకోవడం. శుభాకాంక్షలు చెప్పడం తప్పు కాదు, కానీ నిజాయితీగా ప్ర‌తి ఏటా చెబితేనే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు అకస్మాత్తుగా చెప్పడం వెనుక ఉద్దేశ్యం ప్రశ్నార్థకమే. మీ కూట‌మికి నాయ‌కుడు, దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గారి త‌ల్లి గారికి, మీ పార్ట్‌న‌ర్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ల్లిగారికి, మీ సొంత చినాన్న భార్య‌కు ఎప్పుడైనా లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారా?   మీ మిత్రులు, మిత్రపక్షాల నాయకుల తల్లులకు, మీ సొంత బంధువులకు కూడా చెప్పని శుభాకాంక్షలు, ఇప్పుడు జగన్ గారి తల్లికి ఎందుకు? ఇదంతా అవసరం నిమిత్తం చూపించే గౌరవమా, కపట ప్రేమనా అన్న సందేహం సహజంగానే వస్తోంది.

- ఇదేమి రాజ‌నీతి?

జగన్‌ తల్లిని గౌరవిస్తారట, చెల్లిని అభిమానిస్తారట… కానీ ఆయన శ్రీమతి భార‌త‌మ్మ‌ను జైలుకు పంపిస్తారట..ఇదేమి రాజనీతి?. జ‌గ‌న్ కుటుంబాన్ని ఎంపికగా టార్గెట్‌ చేస్తూ, అవసరానికి అనుగుణంగా వ్యవహరించడం సరైంది కాదు. వైయ‌స్ భార‌త‌మ్మ‌పై చర్యలు తీసుకోవాలనే వైఖరి రాజకీయ కక్షసాధింపే. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌మ్మ అవసరానుసారం ఉపయోగించుకుని, జగన్ రాజకీయ భవిష్యత్తుకు గండికొట్టాలనే ప్రయత్నం జరుగుతోంది.

- 40 ఏళ్ల‌కే లోకేష్ ట‌క్కుట‌మారా విద్య‌లు

చంద్ర‌బాబు 76 ఏళ్ల వ‌య‌సులో అనుస‌రిస్తున్న ట‌క్కుట‌మారా విద్య‌లు ఆయ‌న కుమారుడు లోకేష్ 40 ఏళ్ల‌కే నేర్చుకున్నారు. దిగజారుడు రాజకీయాలు, కక్షసాధింపుల్లో అబ్బను మించిన కొడుకుగా లోకేష్ కనిపిస్తున్నాడు. కుటుంబ కలహాల్లోకి దూరి తల్లి–కొడుకు, అన్న–చెల్లెల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి చర్యను ప్రజలు గమనిస్తున్నారు. 

- అబ్బాకొడుకుల కుటిల రాజకీయాలను గమనించాలి
 
రాష్ట్ర ప్రజలు చంద్ర‌బాబు, లోకేష్‌ కుటిల రాజకీయాలను గమనించాలి. అబ్బాకొడుకులు కుటుంబాల్లో చిచ్చు పెట్టే విధానాన్ని అనుసరిస్తున్నారు. అన్నా–చెల్లెళ్ల మధ్య విభేదాలు తగ్గించాల్సింది పోయి మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు విజ‌య‌మ్మ‌కు శుభాకాంక్షలు చెప్పడం, ష‌ర్మిల‌మ్మ‌ను దగ్గర చేసుకోవడం, మరోవైపు వివేకా హ‌త్య కేసులో భార‌త‌మ్మ మీడియా స‌మాధానం చెప్పాల‌ని, ఆమెను జైలుకు పంపుతామ‌ని మాట్లాడుతున్నారు.   జ‌గ‌న్ కుటుంబంపై పదేపదే ఆరోపణలు చేస్తూ, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం జరుగుతోంది.  

విజయమ్మకు లోకేష్ చెప్పిన జన్మదిన శుభాకాంక్షలు నిజమైన గౌరవంతో కాకుండా, ఆ కుటుంబంలో మానసిక అశాంతి కలిగించే రాజకీయ ఉద్దేశంతోనే చేశారు. ఈ విషయాన్ని సంబంధిత కుటుంబ సభ్యులు గుర్తించాలని, అంతకంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు తండ్రీ కొడుకుల కుటిల రాజ‌కీయాలు గ‌మ‌నించాల‌ని మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

Back to Top