శ్రీ సత్యసాయి జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందకుండా అన్యాయం చేయాలని చూస్తే ఎంతటి పోరాటానికైనా సిద్ధమే అంటూ మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు. సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ఊటుకూరులో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో సమావేశమై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన రాజ్యాంగబద్ధ పదవీ స్వీకార ప్రమాణాన్ని ఇటీవల జీడీ నెల్లూరు పర్యటనలో చంద్రబాబు ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవజ్ఞుడినని పదేపదే చెప్పుకునే ఆయన రాజ్యాంగం అంటే తనకు లెక్కలేదన్న రీతిలో బరితెగించారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ వాళ్లకు ఎలాంటి పనులు చెయ్యొద్దని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆదేశించడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ చంద్రబాబు చేసిన పదవీ స్వీకార ప్రమాణం అర్థం తెలుసా అని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రయోజనం కలిగించడం ప్రభుత్వ ధర్మమని రాజ్యాంగం చెబుతుందన్నారు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, రాజకీయ, ప్రాంతీయ తారతమ్యాలు లేకుండా ప్రజలకు అన్ని హక్కులను రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. రాజకీయ కారణాలతో ఎవరికైనా సరే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందకుండా చేయడమంటే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటినే అందించారని ఉషాశ్రీ చరణ్ గుర్తు చేశారు.