తాడేపల్లి: వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై కూటమి పార్టీలు చేసిన తప్పుడు ప్రచారం వ్యవస్థీకృత నేరమేనని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ పచ్చి అబద్దాలతో ఆడిన కూటమి పార్టీలు ఇప్పటి వరకు సాగించిన నాటకం బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై పదేపదే అబద్దాలతో ప్రజలను వంచించిన వైనం ఇప్పుడు వెలుగుచూసిందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఎన్నికలకు ముందు అబద్దాలతో ప్రజలను మోసం చేసిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అవే అబద్దాలను కొనసాగిస్తున్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరీలు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని, ఏపీ అప్పుల కుప్పగా మిగిలిపోతోంది, మరో శ్రీలంకగా మారిపోతోందంటూ పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. ఏపీని కూడా శ్రీలంకలా దివాలాతీసినట్లు ప్రకటిస్తారా అంటూ ఆనాటి సీఎం వైయస్ జగన్ ను ప్రశ్నించారు. అప్పుల విషయంలో లేనిదానిని ఉన్నట్లుగా ప్రజలకు భ్రమలు కల్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై దుర్మార్గంగా మాట్లాడారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ రూ.12 లక్షల కోట్లు వైయస్ జగన్ గారి ప్రభుత్వం అప్పులు చేసిందని అన్నారు. తరువాత రూ. 12.8 లక్షల కోట్లు అని మరోసారి అన్నారు. ఆ తరువాత కాదు.. కాదు.. రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ మరోసారి ఆరోపించారు. ఈ రాష్ట్రానికి అసలు అప్పులే పుట్టవు అంటూ శాపనార్థాలు పెట్టారు. ఈనాడు పత్రికలో మహేంద్రదేవ్ అనే వ్యక్తిని తీసుకువచ్చి, ఆర్థికనిపుణుడు అనే పేరుతో ఇప్పించిన విశ్లేషణలో కూడా రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ చెప్పించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో 17.5.2022లో మాట్లాడుతూ శ్రీలంక ఆర్థిక పరిస్థితికి కూతవేటు దూరంలోనే ఏపీ ఆర్థిక వ్యవస్త ఉందటూ పచ్చి అబద్దాలు చెప్పారు. అప్పులతో ఆంధ్రా పేరును మారు మ్రోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఏకంగా రూ.11 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ వైయస్ఆర్‌సీపీపై నిందలు మోపారు. ఈ అప్పులపై ఆనాటి కేంద్రమంత్రి దీనిపై అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే, వెంటనే ఆమె తమ మరిది చంద్రబాబు తరుఫున హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి సదరు కేంద్రమంత్రిని కలిసి మీ లెక్కలు తప్పు అంటూ అబద్దాలను వైయస్ఆర్సీపీ పైన రుద్దేందుకు ప్రయత్నించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అవే అబద్దాలు అబద్దాలతోనే మోసం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కూటమి పార్టీలు తమ అబద్దాలను కొనసాగిస్తున్నారు. చివరికి గవర్నర్ ప్రసంగంలో కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రం రూ. పదిలక్షల కోట్లకు పైగా అప్పులతో ఉందని చెప్పించారు. 'రాష్ట్రం మొత్తం అప్పులు రూ. 14 లక్షల కోట్లుగా ఆర్థికశాఖ అంచనా' అంటూ తమ అనుకూల మీడియాలో రాయించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఉన్న ఈనాటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శ్రీలంక కంటే నాలుగు రెట్లు ఎక్కువ అప్పులు ఉన్నాయంటూ దీనిపై వ్యాఖ్యానించారు. ఈ రోజు వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి, చంద్రశేఖర్, అమర్నాధ్ రెడ్డి, విశ్వేశ్వరరాజులు అప్పులపై అసెంబ్లీలో ప్రభుత్వంను ప్రశ్నించారు. దీనికి వచ్చిన సమాధానంలో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు అప్పుల పేరుతో కూటమి పార్టీలు చేసిన కుట్రపూరిత ప్రచారం బట్టబయలు అయ్యింది. అసెంబ్లీలో వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే మార్చి 2024 వరకు ప్రభుత్వ అప్పులు రూ.4,91,734 కోట్లు, అలాగే ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ. 1,54,797 కోట్లు. అంటే మొత్తం రూ.6,46,531 కోట్లు అప్పులు ఉన్నాయని అధికారికంగా లిఖిత సమాధానం ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు రూ.14 లక్షల కోట్లు అంటూ చేసినవన్నీ అబద్దాలేనని తేలిపోయింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో చేసిన అప్పుల్లో డీబీటీ కే రూ.2.73 లక్షల కోట్లు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి మొత్తం రాష్ట్ర అప్పులు రూ.6,46,531 కోట్లు. జగన్ గారు అప్పులు తీసుకువచ్చి వివిధ సంక్షేమ పథకాల కోసం డీబీటీ ద్వారా ప్రజలకు రూ.2,73,756 కోట్లు పంచారు. కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లోనే రూ.1.40 లక్షల కోట్లు అప్పులు తెచ్చింది. ఈ సొమ్ము ఎవరికి ఖర్చు చేశారు? ఎంతమంది లబ్దిదారులకు ఇచ్చారో సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా వైయస్ఆర్ సీపీ దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.9.74 లక్షల కోట్లు అని అబద్దాలు చెప్పారు. ఈ రోజు రూ.6,46,531 లక్షల కోట్లు అని చెబుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.3,06,951 కోట్లు. అంటే వైయస్ఆర్ సీపీ దిగిపోయేనాటికి ఉన్న అప్పుల నుంచి 2014-19 లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులను తీసేస్తే నిఖరంగా అయిదేళ్ళలో వైయస్ఆర్‌సీపీ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3,39,580 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం చేసిన అప్పులతో ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎటువంటి హామీలను అమలు చేయకుండా, ఒక్క రూపాయి కూడా ప్రజలకు పంచకుండా కేవలం తొమ్మిది నెలల్లోనే రూ.1.40 లక్షల కోట్లు అప్పులు చేసింది. ఇది కాదా ఆర్థిక విధ్వంసం అంటే? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తూ సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తోందంటూ సీఎం నాటకాలు ఆడుతున్నారు. హామీలు ఇచ్చే నాటికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో చంద్రబాబుకు తెలియదా? వైయస్ జగన్ గారు రూ.14 లక్షల కోట్లు అప్పులు చేయడం వల్లే సూపర్ సిక్స్ అమలుకు డబ్బులు లేకుండా పోయాయంటూ ఇప్పటి వరకు నిందలు వేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ అప్పుల లెక్కలు తప్పని తేలిపోయాయి. కనీసం ఇప్పుడైనా సూపర్ సిక్స్ ను అమలు చేయండి. ఏ రాష్ట్రం అప్పు తెచ్చుకోవాలన్నా ఎఫ్ఆర్బీఎం పరిమితిలోనే చేయాలి. దానికి మించి చేయాలంటే ప్రత్యేక అనుమతులు కావాలి. ఇంత సీనియారిటీ ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? సున్నా పరిమితి ఉన్న ఏపీకి ఏ లెక్కన కూటమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల్లో ఏకంగా ఒక లక్ష కోట్ల అప్పులు తెస్తామని చెబుతోంది? తమ అభివృద్ధి 12 శాతం ఉందని ఏ లెక్క ప్రకారం చెబుతున్నారు? మొత్తం దేశం జీడీపీనే సుమారు ఆరు శాతం వరకు ఉంటుంది. దాదాపు రూ.60 వేల కోట్లు విద్యుత్ రంగం కోసం అప్పులు తెచ్చారు. వాటిని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు చేస్తున్న అప్పులు పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా? రాజధాని కోసం అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులను ఈ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కట్టాల్సిందే. ఆనాడు కేంద్రం హామీ ఇచ్చినట్లు రూ.28వేల కోట్లను రాజధాని నిర్మాణంకు ఎందుకు తీసుకురాలేక పోతున్నారు? విద్యుత్ చార్జీలపై గతంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏడుసార్లు రేట్లు పెంచి రూ.16వేల కోట్లు వైయస్ జగన్ ప్రజల నుంచి లాక్కున్నారని ఆరోపించారు. కేవలం తొమ్మిది నెలల కూటమి పాలనలో ఏకంగా రూ.15 వేల కోట్లు ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేయడం వాస్తవం కాదా? స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నాం, ప్రజలే వాటిని కొనుగోలు చేయాలంటున్నారు. ఇది ప్రజలను దోచుకోవడం కాదా? సెకీ అగ్రిమెంట్ ద్వారా తక్కవ రేటుకే విద్యుత్ ను కొనుగోలు చేసేందుకు వైయస్ జగన్ గారు ఒప్పందాలు చేసుకుంటే, దానిపైనా విషం చిమ్మారు.