బాబు ష్యూరిటీ..చీటింగ్ గ్యారెంటీ

సూప‌ర్ సిక్స్ పేరుతో ప్ర‌జ‌ల‌ను నిండా ముంచారు

లోకేష్‌..ఏ కాల‌ర్ ప‌ట్టుకోవాలి

హామీల అమ‌లు బాధ్య‌త నాదే అన్న ప‌వ‌న్ ఏమ‌య్యాడు?

మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్‌

చిత్తూరు: ఎన్నిక‌ల‌కు ముందు బాబు ష్యూరిటీ..భ‌విష్య‌త్ గ్యారెంటీ అంటూ ఊద‌ర‌గొట్టి అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌జ‌ల‌ను చీటింగ్ చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. సంప‌ద సృష్టించాక సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తామ‌ని చంద్రబాబు చావు క‌బురు చ‌ల్ల‌గా చెబుతున్నార‌ని ఫైర్ అయ్యారు. సూప‌ర్‌సిక్స్ అమ‌లు చేయ‌క‌పోతే కాల‌ర్ ప‌ట్టుకొని నిల‌దీయాల‌ని లోకేష్ చెప్పార‌ని, ఇప్పుడు ఏ కాల‌ర్ ప‌ట్టుకోవాల‌ని ఆమె నిల‌దీశారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌తో పాటు అన్ని ప‌థ‌కాలు ఆపేశారని విమ‌ర్శించారు. శుక్ర‌వారం న‌గ‌రిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలో రోజా మీడియాతో మాట్లాడారు.

ఆర్కే రోజా ఏమ‌న్నారంటే..
చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక పేద విద్యార్థుల‌ను చ‌దువుల‌కు దూరం చేస్తున్నారు. ఇలా చేయ‌డం చంద్ర‌బాబుకు కొత్తేమి కాదు. ఎందుకంటే పేద‌లంటే ఆయ‌న‌కు చిరాకు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తీసుకువ‌చ్చిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కానికి 2014- 2019లో చంద్రబాబు కోత పెట్ట‌డం మ‌నంద‌రం చూశాం. వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అయ్యాక అంద‌రికీ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చారు. మ‌ళ్లీ చంద్రబాబు సీఎం అయిన ఏడు నెల‌ల్లోనే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, అమ్మ ఒడి, నాడు-నేడు ప‌నులు, ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఆపేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఐఆర్ లేదు. క‌నీసం డీఏ కూడా ఇవ్వ‌డం లేదు. కూట‌మి నేత‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను తిట్ట‌డానికే స‌మ‌యం వెచ్చిస్తున్నారు కానీ, ఎన్నిక‌ల్లో చెప్పిన మాట‌ల‌ను గుర్తు పెట్టుకోవ‌డం లేదు. అధికారంలోకి వ‌స్తే మేం సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. లోకేష్ అయితే సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయ‌క‌పోతే కాల‌ర్ ప‌ట్టుకోమ‌ని చెప్పారు. ఇప్పుడు ఏ కాల‌ర్ ప‌ట్టుకోవాలి. చంద్ర‌బాబు మాత్రం చావు క‌బురు చ‌ల్ల‌గా చెబుతూ మేం సంప‌ద సృష్టించిన త‌రువాత సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తామంటున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా వెట‌కారంగా పెద్ద గొంతు వేసుకొని చంద్ర‌బాబు..త‌మ్ముళ్లూ.. వైయ‌స్ జ‌గ‌న్ ఆఫీస్‌లో కూర్చొని బ‌ట‌న్ నొక్కుతార‌ట‌..మూల‌నున్న ముస‌ల‌మ్మ కూడా బ‌ట‌న్ నొక్కుతుంద‌ని అవ‌హేళ‌న‌గా మాట్లాడారు. చంద్ర‌బాబు..నీకు కూడా 70 ఏళ్లు వ‌చ్చాయి క‌దా? ఎందుకు బ‌ట‌న్ నొక్క‌లేక‌పోతున్నారు. బాబు గారు సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయ‌క‌పోతే దాని బాధ్య‌త నాది అంటూ ఆ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గొంతు చించుకొని చెప్పాడు. ఇంత‌వ‌ర‌కు త‌ల్లికి వంద‌నం ఇవ్వ‌లేదు. ఆడ‌బిడ్డ‌ల నిధి ఏమైందో తెలియ‌దు. ఎందుకు చంద్ర‌బాబును ప‌వ‌న్‌ ప్ర‌శ్నించ‌డం లేదు. మీకు ఏమి అడ్డం వస్తోంది. ఎన్నిక‌ల ముందు, ఎన్నిక‌ల త‌రువాత వాళ్ల ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉందంటే..బాబు షూరిటీ..భ‌విష్య‌త్ గ్యారంటీ అన్నారు. ఇవాళ చీటింగ్ గ్యారెంటీ అంటున్నారు.  ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ల‌క్ష‌లు ల‌క్ష‌లు ఇస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూట‌మి నేత‌లు బాండ్లు కూడా రాసి ఇచ్చారు. మంత్రి రామానాయుడు అయితే ఇంటింటా సైకిల్‌పై తిరుగుతూ.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని ఊద‌ర‌గొట్టారు. ఇవాళ ఎందుకు ఇవ్వ‌డం లేదు. ఇవాళ మాత్రం చంద్రబాబు  సంప‌ద సృష్టించాకా..ఆదాయం పెరిగిన త‌రువాత ఇస్తామంటున్నారు.  జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల ఇంట్లో జ‌బులు, జ్వ‌రం వ‌చ్చిన అందుకు వైయ‌స్ జ‌గ‌న్ కార‌ణం అన్న‌ట్లుగా మాట్లాడుతున్నారు. మీ  మ్యానిఫెస్టోలో రూ.14 ల‌క్ష‌ల కోట్లు అప్పు ఉంద‌ని చెప్పారు. అయినా మేం సూప‌ర్ సిక్స్ అమ‌లు చేస్తామ‌ని ఆ రోజు హామీ ఇచ్చారు. ఇవాళ ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు. 2014-2019 వ‌ర‌కు రాష్ట్రాన్ని పాలించిన చంద్ర‌బాబు ఎంత అభివృద్ధి చేశారో శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని రోజా డిమాండు చేశారు.  

Back to Top