చిత్తూరు జిల్లా : అధికారులు ఈ రోజు కూటమి ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే భవిష్యత్‌లో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. చిత్తూరు సబ్ జైల్ లో ఉన్న నగరి మండలం దేసురుఅగరం టిడిపి నాయకుల అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్ లో ఉన్న వైయస్ఆర్‌సీపీ నాయకులు రంగనాథం, మరో ఐదుగురు, కావేటిపురం శమోహన్‌ను రోజా మంగళవారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. `ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెయిల్ వచ్చే లోపు మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు పక్కన పెట్టారు. పీటీ వారెంట్ కేసులు అన్ని ఒకే చోట విచారించాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. వచ్చేది వైయస్ఆర్‌సీపీనే.. రానున్న రోజుల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా గా మారిపోయింది. ఉత్తరాంధ్ర లో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్ధిని ఓడించారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువై పోయాయి. సిఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే అధికారులు నిద్ర పోతున్నారా? హోం మంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారిపోయింది. పుత్తూరు గంజాయి , డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయింది` అంటూ ఆర్కే రోజా మండిపడ్డారు.