చంద్రబాబుది దిక్కుమాలిన విజన్‌

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని నాని

విజన్‌ 2047 అంటూ చంద్రబాబు కొత్తరాగం మొదలుపెట్టారు

ఆవగింజంత కూడా సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు

ప్రాజెక్టుల సందర్శన అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు.

విజన్‌ పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకు విజన్‌ ఉందా? 

విద్యా రంగాన్ని ఒక్కసారైనా బాబు పట్టించుకున్నాడా? 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల నుంచి డబ్బులు తీసుకున్న విజన్‌ చంద్రబాబుది

టీడీపీ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్‌ ఛార్జీలు వసూలు చేశారు

108, 104, ఆరోగ్య శ్రీ మహానేత వైయస్‌ఆర్‌ విజన్‌

మూడేళ్లలోనే వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం

తాడేపల్లి:  గతంలో విజన్‌ 2020 అన్నారు..ఇప్పుడు విజన్‌ 2047 అంటున్నాడు. చంద్రబాబుది దిక్కుమాలిన విజన్‌ అంటూ వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు 2020 విజన్‌ ఏమైందని ప్రశ్నించారు. అటకెక్కిందా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు విజనరీ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేకపోయాడని విమర్శించారు. కనీసం కుప్పానికైనా నీళ్లు ఇచ్చావా అని నిలదీశారు. ప్రభుత్వ స్కూళ్లకు తాళం వేయడమే చంద్రబాబు విజన్‌ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదల నుంచి డబ్బులు వసూలు చేయడం బాబు దిక్కుమాలిన విజన్‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన ఘనుడు చంద్రబాబు..విజన్‌ పబ్లిసిటీ తప్ప చంద్రబాబుకు విజన్‌ ఉందా అని ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. 

మాజీ మంత్రి పేర్ని నాని ఏం మాట్లాడారంటే..:

విజన్‌ పేరుతో కాలజ్ఞానం!:
– విజన్‌–2047 అనే కాగితాల కట్టలను ప్రజలపై చిమ్మి చంద్రబాబు కాలజ్ఞానం చెప్తున్నాడు. 
– ఆ విజన్‌ ద్వారా తెలుగు ప్రజలను ప్రపంచ పటంలో నిలపడమే ఆయన లక్ష్యం అట. 
– తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తానని చంద్రబాబు తన విజన్‌ ద్వారా చెబుతున్నాడు.   
– ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, విద్యుత్‌ చార్జీలు తగ్గించమని కోరితే హైదరాబాద్‌ నడిబొడ్డున ముగ్గురిని కాల్చి చంపారు. 
– అలాంటి వ్యక్తి తాను అధికారంలోకి వస్తే, విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తానని చెబుతున్నాడు. మనల్ని నమ్మమంటున్నాడు. 
– 2014లో రూ.20 వేల కోట్లు ఉన్న విద్యుత్‌ శాఖ అప్పులను రూ.80 వేల కోట్లకు తీసుకెళ్లిన ఈ పెద్దమనిషి విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తాడట. 
– రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తానని ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు చెప్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న విజనరీ చంద్రబాబు.  

‘విజన్‌–2020’ తో బాబు చేసిందేమిటి?:
– మాట్లాడితే తనది 40 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పే చంద్రబాబు, నాడు ఆర్భాటంగా ప్రకటించిన విజన్‌–2020తో పొడిచేసిందేమిటి? 
– 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవిని లాక్కున్నాక  మెకన్సీ అనే వారితో ఒక పుస్తకం రాయించాడు. విజన్‌–2020 విజనరీ డాక్యుమెంటు విడుదల చేశాడు. 
– వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలను వేరే రంగాల్లోకి మళ్లించాలని, వారి సంఖ్య తగ్గించాలని తన విజన్‌ 2020లో చెప్పాడు. 
– ఈ రాష్ట్రంలో ఈ రోజుకీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు 63 శాతం ఉంటే ఏం తగ్గించినట్లు..? 
– చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడంటే చినబాబుకు కోపం వస్తుంది...ఆధారం ఏమిటి అంటున్నాడు. 
– మీ తండ్రి ఇచ్చిన విజన్‌ 2020 డాక్యుమెంటే దానికి ఆధారం. వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వారిని తగ్గించాలంటే దాని అర్ధం వ్యవసాయం దండగనే.  
– నేటికీ భారతదేశంలో, ఏపీలో అత్యధిక జనాభా వ్యవసాయ ఆధారితం. 
– మన రాష్ట్రం భారతదేశం మొత్తానికి ధాన్యాగారం అంటారు. 

ఇన్నేళ్లలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టావా?:
– ఎన్టీఆర్‌ గొప్ప నాయకుడు అంటాడు. మరి ఎందుకు కుట్రలు చేసి ఆయన్ను కూల్చారు..? 
– తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో, 14 ఏళ్లు సీఎం పదవిలో ఉన్నా.. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశాడా?.
– నేను ఇది పూర్తి చేశాను అని ధైర్యంగా చెప్పగలడా..? ఇది చంద్రబాబుకు నా సవాల్‌.
– విజన్‌–2020 అయిపోయింది. ఇప్పుడు 2047 అట. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానన్నదట!. 
– చివరకు నీ సొంత నియోజకవర్గం కుప్పానికి అయినా నీళ్లిచ్చావా బాబూ..? గాలేరు నగరిని గాలికి వదిలేసింది నువ్వు కాదా..? 
– చిత్తూరుకే దిక్కు లేదు. ఇక రాష్ట్రానికి ఏం చేస్తాడనేది ప్రజలు ఆలోచించాలి. 
– ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రాజెక్టుల బాట పట్టావ్‌?. కనీసం బిడియం ఉండాలి కదా?.

నీది పబ్లిసిటీ విజన్‌ మాత్రమే:
– ప్రస్తుతం చంద్రబాబు వయసు 75 ఏళ్లు. ఇప్పుడు ఆయన విజన్‌–2047 అంటున్నాడు
– అప్పటికి ఆయన విజన్‌ ఉంటుందా?. జయంతి, వర్థంతులు ఉంటాయా అనేది భగవంతుడికే తెలియాలి. 
– ప్రజలు నవ్వుకుంటారని కూడా గుర్తించకుండా ఇలాంటివన్నీ చెప్తున్నాడు. 
– 14 ఏళ్లు సీఎంగా ఉన్న నీవు.. నీకంటూ చెప్పుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒక్క పథకాన్ని అయినా అమలు చేశావా?.
– చంద్రబాబుది పబ్లిసిటీ విజన్‌ తప్ప.. ఆయనకు ఏ విజన్‌ లేదు.

ప్రభుత్వ స్కూళ్ల మూత. బాబు విజన్‌:
– విద్యా వ్యవస్థలో మీ దార్శనికత ఎక్కుడుంది..? ఏనాడైనా కనీసం ఒక్క ప్రభుత్వ స్కూల్‌ను అయినా బాగు చేద్దామని ఆలోచించావా..? 
– చివరికి నారావారిపల్లెలోనైనా ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని అనుకున్నావా బాబూ..
– మీ ఏలుబడి ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు మూతవేశారు..? ఎన్ని ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లు మూతవేశారో గుర్తు తెచ్చుకోండి. 
– మూతే మన విజన్‌..తాళాలు వేయడమే మన విజన్‌. 
– నారాయణ, చైతన్య స్కూళ్ల ఎదుగుదల చూసి మురిసిపోయావు కానీ ఒక్క ప్రభుత్వ స్కూల్‌ వైపు చూశావా..? ఇదా విజనంటే..? 
– చివరికి ప్రభుత్వ స్కూళ్లలో ఎలా పాఠాలు చెప్పాలో కూడా పర్యవేక్షణ నారాయణ సంస్థలకు అప్పజెప్పావ్‌..ఇది దిక్కుమాలిన విజన్‌ కాదా..? 
– చదువుతో వ్యాపారం చేసే నారాయణకు ప్రభుత్వ బడులను అప్పజెప్పడం ఇంతకన్నా కిరాతకం ఇంకేముంటుంది..? 
– విజన్‌ 2020 పూర్తి అయ్యేసరికి అక్షరాస్యతలో రాష్ట్రంలో లాస్ట్‌.. స్కూల్‌ డ్రాపవుట్స్‌లో నంబర్‌ వన్‌. 

ప్రభుత్వాసుపత్రుల్లో యూజర్‌ ఛార్జీలు!:
– ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు వైద్యం చేరువ చేయాల్సింది పోయి చంద్రబాబు యూజర్‌ చార్జీల మోత మోగించాడు. 
– పేదలు మందులు కొనుగోలు చేయాలన్నా డబ్బు పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిందే. 
– వైద్య పరీక్షలకు కూడా యూజర్‌ ఛార్జీల పేరుతో డబ్బులు దండుకున్న చరిత్ర చంద్రబాబు 2020 విజన్‌. 
– దీన్ని దివాళాకోరు విజన్‌ కాదా..? 
– 108 మీది కాదు..104 మీది కాదు.. ఆరోగ్య శ్రీ మీది కాదు. అవన్నీ డాక్టర్‌ వైఎస్సార్‌ విజన్‌. 
– కాకిలాగా ఎన్నాళ్లు బతికితే ఏం ఉపయోగం..? 2047 వరకూ బతికాలా..? 
– 2014–19లో 108 లన్నీ షెడ్లలో పెట్టాడు..ఇది చంద్రబాబు మార్కు విజన్‌. 
– 1540 కొత్త అంబులెన్స్‌లను కొని ప్రజలకు అందించడం నాటి వైఎస్సార్‌ కుమారుడు జగన్‌ గారి విజన్‌...
– కాంగ్రెస్‌ ప్రభుత్వం దిగే సరికి ఆరోగ్యశ్రీ కింద వెయ్యి జబ్బులు ఉంటే చంద్రబాబు ఒక్క జబ్బు కూడా పెంచలేదు. 
– జగన్‌ గారు వచ్చాక 3600 జబ్బులకు వైద్యం చేయించేందుకు ఆరోగ్య శ్రీలో చేర్చారు. 
– 2019లో జనం చీ కొట్టి నిన్ను ఇంటికి పంపేనాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.900 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిపోయాడు. 
– ఇది ది గ్రేట్‌ చంద్రబాబునాయుడు విజన్‌. 
– 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేయలేదు. 
– ఒక యువకుడు మూడేళ్లలో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టి.. ఈ ఏడాది నుంచి 5 కాలేజీల్లో బోధన మొదలు పెడుతున్నాడు. 
– వైద్యం పేదవానికి ఉచితంగా అందాలని డాక్టర్ల సంఖ్యను, ఆస్పత్రుల బెడ్‌ల సంఖ్యను పెంచారు. 
– 53 వేల మంది సిబ్బందిని వైద్య ఆరోగ్యశాఖలో నియామకాలు చేశారు. 
– 2020 సంకనాకి పోయింది...2047 మొదలెట్టాడు. 

ఆడబిడ్డల బంగారం వేలం:
– 2047 విజన్‌ డాక్యుమెంటులో మహిళల సాధికారత కోసం చంద్రబాబు విజన్‌ ఏంటో చెప్పలేదు. 
– 2014లో అధికారం కోసం మహిళలకు సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ అన్నాడు. 
– బాబు వస్తే అప్పులు తీరిపోతాయి..బ్యాంకుల్లో బంగారం కూడా వదిలిస్తాడంటూ ప్రచారం చేసుకున్నాడు. 
– చివరికి దేశంలో 2014–18 మధ్యలో అతి ఎక్కువగా బ్యాంకులు బంగారాన్ని వేలం వేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 
– 2047లో నంబర్‌ వన్‌ కాదు...ఇప్పటికే చాలా విషయాల్లో నంబర్‌ వన్‌గా నిలిపాడు.  
– బ్యాంకుల్లో బంగారం వేలం వేయడంలో, డ్రాపవుట్స్‌లో నంబర్‌ వన్‌. 
– 2019 నాటికి సకాలంలో చెల్లింపుల ద్వారా కేవలం 19 శాతం డ్వాక్రా సంఘాలు మాత్రమే  ఏ, బీ గ్రేడుల్లో ఉన్నాయి. 
– చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల డ్వాక్రా మహిళలు అప్పులు కట్టకుండా వడ్డీలకు చక్రవడ్డీలై దారుణంగా మోసపోయారు. 
– నేడు జగన్‌ గారు వచ్చిన తర్వాత 91 శాతం డ్వాక్రా సంఘాల ఏ, బీ గ్రేడ్‌ లలో ఉన్నాయి.
– మోసం దగా ఇదే చంద్రబాబు విజన్‌. 

నీ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావ్‌?:
– పరిపాలనలోనూ విజన్‌ 2020లో ప్రభుత్వ ఉద్యోగులను గణనీయంగా తగ్గించాలి..కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్యను పెంచాలనేది ఆయన విజన్‌ 2020. 
– 1995 నుంచి 2019 వరకూ 14 ఏళ్ల పాటు నిరుద్యోగ యువతకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేశావో చెప్పు. 
– ఉద్యోగాలు ఊడబెరికి, కాంట్రాక్టు ఉద్యోగులను పెంచాలనే దుర్మార్గమైన విజన్‌ చంద్రబాబుది. 
– ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఓట్ల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నాడు. 
– అధికారంలో లేకపోతే మొసలి కన్నీరు..అధికారంలో ఉంటే మొడలపై ఎక్కి తొక్కడం ఆయనకు అలవాటు. 
– ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ అక్కర్లేదు అన్న విజన్‌ చంద్రబాబుదే. 
– ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కారుణ్య నియాకం వద్దన్న విజన్‌ కూడా ఆయనదే. 
– కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలనే విజన్‌ కూడా చంద్రబాబుకు లేదు. 
– 2014లో రాష్ట్రం విడిపోతే తెలంగాణను కాపీ కొట్టావు తప్ప చంద్రబాబు చేసిందేమిటి..? 
– కేసీఆర్‌ ముఖ్యమంత్రి.. నేను ముఖ్యమంత్రి అన్నావ్‌.. కేసీఆర్‌ కొడుక్కి మంత్రిపదవి ఇచ్చాడు..తానూ కొడుక్కి మంత్రి పదవి ఇచ్చుకున్నాడు. 
– తెలంగాణలో జిల్లాల విభజన జరిగితే  మన రాష్ట్రంలో వికేంద్రీకరణ ఎందుకు చేయలేదు..? 
– వయోవృద్ధులు, వికలాంగులు, వితంతువులు నడిబజార్లో పింఛన్ల కోసం పడిగాపులు పడ్డారు. దాన్ని పరిష్కరించే విజన్‌ ఏమైపోయింది..? 
– చిన్న చిన్న సర్టిఫికెట్ల కోసం కూడా మండల కేంద్రాలకు వెళ్లి పడిగాపులు పడాల్సిన దుస్థితిపై విజన్‌ ఎందుకు లేదు..? 
– ఒక కొత్త సచివాలయ వ్యవస్థ..ఊరు పొలిమేర దాటకుండా అన్ని వసతులు అందించే వ్యవస్థ ఏదీ..? 
– గడప దాటకుండా పింఛన్‌ తెచ్చుకునే వ్యవస్థ ఏదీ..? ఇదే నా చంద్రబాబు నీ విజన్‌. 
– ఈ పబ్లిసిటీ విజనరీ చివరికి కుప్పాన్ని రెవిన్యూ డివిజన్‌ చేయమని అడుక్కునే దిక్కుమాలిన విజన్‌ చంద్రబాబుది. 
– మన చుట్టూ ఉన్న ఆర్తులను చూడలేని, చూసినా ఉద్దరించలేని విజన్‌ ఉన్నా ఒకటే పోయినా ఒకటే. 
– అది విజన్‌ కాదు..అంధత్వం అవుతుంది..ఒక పాలకుడుకి అది గుడ్డితనమే. 

అధికారం ఉంటే ఇక్కడ.. లేదంటే ప్రవాసం:
– రాష్ట్రంలో అత్యధిక జనాభా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. 
– వారి చేతిలో పనిముట్లు.. వారి ఓట్లు మనకు అన్నదే చంద్రబాబు విజన్‌. 
– కేవలం కులవృత్తి పనిముట్లే విజన్‌గా తప్ప అణగారిన వర్గాలను చదివిద్దామన్న విజన్‌ లేదు. 
– వంద శాతం ఫీజ్‌ రీఎంబర్స్‌మెంట్‌ అనేది డాక్టర్‌ వైఎస్సార్‌ది. 
– ఉచిత విద్య భవిష్యత్తుపై పెట్టుబడి అనేది నేటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి విజన్‌. 
– 2014లో అధికారం కోసం బీసీలకు 143 హామీలు ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు. 
– కానీ ఫోటోల్లో మాత్రం పక్కన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండాలి. 
– ఐదేళ్లలో ఒక ఎస్టీ వర్గానికి మంత్రి లేడు..ఒక మైనార్టీలకు మంత్రి లేడు. 
– వారు మనుషులు కాదు.. ఈ రాష్ట్ర పౌరులు కాదా.. వారికి అధికారం ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదు. 
– ఎన్నికల్లో ఓడిపోయి అధికారం పోగానే పారిపోయే నీకు ఈ రాష్ట్రం పట్ల ఏం విజన్‌ ఉందో చెప్పాలి. 
– ఈ రాష్ట్రం పట్ల బంధం లేదు.ప్రేమ లేదు..
– అధికారం ఉంటే ఇక్కడ నివాసం..అధికారం పోతే ప్రవాసం..ఇదే చంద్రబాబు విజన్‌. 
– కొల్లేరు, పులికాట్‌లో సీజనల్‌గా వచ్చే విదేశీ పక్షులకు అవసరం ఉన్నపప్పుడు వచ్చే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు తేడా ఏమీ లేదు.

చిలక జోస్యాలు, కాలజ్ఞానాలు..:
– విజన్‌ 2047 అనేది 2024 ఎన్నికలకు కోసం తెచ్చిన ఎర. ప్రజల ఓట్ల కోసం ఇలాంటి డాక్యుమెంట్‌తో చంద్రబాబు బయలుదేరాడు.
– 75 ఏళ్ల చంద్రబాబు కూడా ప్రాజెక్టులు,విజన్‌ అంటూ ముసలి పోతనలా వచ్చాడు..చిన్నికిష్ణుడిలా ప్రజలు తమ పని తాము చేసుకుని పోతారు. 
– ముసలి పోతన వేషంలో చంద్రబాబు ప్రజల ముందుకు వచ్చినా, శకటాసురిడిలా జగన్‌ మీదకు వచ్చినా తగిన శాస్తి జరగడం ఖాయం. 
– ప్రజలు మనకు ఐదేళ్లు మాత్రమే అధికారం ఇస్తారు..ఆ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చామనేదే నాయకుడి విజన్‌గా ఉండాలి. 
– అంతేకానీ ఇలాంటి మాయా విజన్‌లు, కాలజ్ఞానాలు, చిలకజోస్యాలు పనికిరావనేది చంద్రబాబు గమనించాలి. 
– ఇలాంటి విజన్‌ డాక్యుమెంట్లతో నీకు 14 ఏళ్లు అధికారం ఇచ్చిన ప్రజలను నయవంచన చేయడం ధర్మం కాదు. 

బాబు మోసగాడు.. పవన్‌ గజ మోసగాడు:
– చంద్రబాబు మామూలు మోసగాడైతే.. పవన్‌ కల్యాణ్‌ గజమోసగాడు. 
– సినిమా డైలాగులతో కవులు రాసిస్తే దాన్ని మనకు అప్పజెప్తుంటాడు. 
– సుత్తి కబుర్లు ఆపి చిత్తశుద్ధితో 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రానికి పవన్‌ కళ్యాణ్‌ ఏం చేశాడో చెప్పాలి 
– 2019 నుంచి బీజేపీతో ఉంటున్నాడు కదా...ఈ రాష్ట్రానికి ఏం చేశాడు..? 
– ప్రజాకోర్టు అంటూ సినిమా టైటిళ్లు బాగానే ఉంటాయి..ముందు వీటికి సమాధానం చెప్పమనండి. 
– ఆనాడు చంద్రబాబుకు ఓటేయండి అన్నాడు.. ప్రజలకు క్షవరం అయ్యింది. 
– మళ్లీ రేపు అదే చెప్తాడు...కచ్చితంగా పవన్‌ కల్యాణ్‌ అనే రాజకీయ మోసగాడు ముసుగుతో వస్తున్నాడు. 
– తేల్చి తేల్చనట్లు.. ఖుషీ సినిమాలోలా వ్యవహరిస్తాడు. 
– కాసేపు మన ప్రభుత్వం.. నేను ముఖ్యమంత్రి అంటాడు..
– కాసేపు సంకీర్ణ ప్రభుత్వం అంటాడు.. మళ్లీ మనకు సీట్లు ఓట్లు ఎక్కడ..? మనం ముఖ్యమంత్రి ఏంటి అంటాడు. 
– యాత్రలకు వెళ్తున్నాడు కదా..వెళ్లిన చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తున్నాడా అంటే అదీ లేదు. 
– నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జ్‌లు కూడా లేరు.
– దమ్ముంటే.. నేను చంద్రబాబు కోసమే పనిచేస్తాను అని చెప్పు. 
– లేదా.. మేమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పుకునే ధైర్యం కూడా లేదు. 

రామోజీ.. ఇదేనా జర్నలిజమ్‌?:
– నీవు కులపోడి కోసమే చేస్తున్నావని ప్రజలందరికీ తెలుసు రామోజీ.
– రామోజీరావును ఒకటే అడుగుతున్నా.. మార్గదర్శి చిట్స్‌లో మీరు తప్పు చేశారా? లేదా? అనేది స్పష్టంగా చెప్పండి. 
– నిజాయితీగా దానిపై ఒక్క వార్త రాయలేనటువంటి మీది జర్నలిజమా?  
– జగన్‌ గారి గురించి తప్పుడు వార్తలు రాస్తూ మీకు నిబద్ధత, నిజాయితీ ఉందంటే ఎలా..? 
– జగన్‌గారు వచ్చి మీ వస్త్రాలన్నీ విప్పదీసి నడిరోడ్డుపై నిలబెట్టాడు. 
– కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీకి ఒక్క సీటు కూడా రాదు అనుకునే వారిని   పిచ్చాసుపత్రిలో చేర్చడమే. 
– పవన్‌ కల్యాణ్‌లా చంద్రబాబు కోసం పార్టీ పెట్టి, ముసుగేసుకుని ఓట్లు అడుక్కునే అవలక్షణాలు మాకు లేవు. 
– సినిమా తీస్తే ధైర్యంగా మేమే తీస్తున్నాం అని చెప్తాం.

Back to Top