తాడేపల్లి: మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క కులాన్ని నమ్ముకోలేదని ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సీఎం వైయస్ జగన్ వాటిని ధీటుగా ఎదుర్కొంటారని చెప్పారు. చంద్రబాబు చరిత్ర అంతా కొనుగోలు రాజకీయమే. ఉండవల్లి శ్రీదేవి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అవమానించారంటూ శ్రీదేవి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలు పునీతులా..? శాసనసభ కోటా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలో టీడీపీకి అమ్ముడుపోయి.. సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి సంబంధించిన చాలామంది గత రెండ్రోజులుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ‘మేమంతా పునీతులం. తప్పుడు పనులు చేతగాని వాళ్లం.. మరీ ప్రత్యేకించి, చంద్రబాబుకు రాజకీయాల్లో తప్పుడు పనులు చేయడమే చేతగాదు’ అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. కొనడం, అమ్మడమే ‘బాబు’ రాజకీయం..ః 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు లక్షణం, నైజం, రాజకీయమార్గం, ఆయన విజయరహస్యం ఏంటంటే.. ‘కొనడం.. అమ్మడం’. ఈ రెండు తప్పితే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇప్పటివరకు కనిపించిందేంటి..? నయవంచన, నమ్మకద్రోహం, నటించడం, వెన్నుపోటు పొడవడం.. ఇవే కదా చంద్రబాబు లక్షణాలు, గుణాలు. విలువలు, విశ్వసనీయత గల్గిన రాజకీయమే జగన్ గారి విధానం..ః చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి లక్షణాలేంటి..? ‘నమ్మకం, మనసులో ఉన్నది చెప్పడం, తాను చేసేది చెప్పడం, చేయలేనిది చేయలేనని చెప్పడం.. చేదునిజమైనా మొఖంమీదే చెప్పడం..’ ఇవే జగన్‌మోహన్‌రెడ్డి లక్షణాలు.. విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయాలు నడుపుతారు కనుకనే ప్రజలకు జగన్‌మోహన్‌రెడ్డి గారంటే అపార నమ్మకం. వెన్నుపోటుతో గద్దెనెక్కిన నీచ రాజకీయం ‘బాబు’ది.. 1983లో ఎన్టీరామారావు ముఖ్యమంత్రి కాగానే అప్పటివరకు ప్రగల్భాలు పలికిన చంద్రబాబునాయుడు ‘ఇందిరాగాంధీ ఆదేశిస్తే గుడివాడలో మా మామ ఎన్టీఆర్ మీద పోటీచేసి ఓడిస్తాను..’ అని చివరికి అప్పటి ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. అప్పటికే ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసి ఒక చిన్న కార్యకర్త చేతుల్లో ఓడిపోయిన చంద్రబాబు వెంటనే వారి భార్యను మామ దగ్గరకు పంపి ఎమోషనల్‌గా వత్తిడి తెచ్చి పార్టీలోకి చేరి ఎన్టీ రామారావు ముందు నక్క వినయాలు చూపి అవకాశాలు కోసం ఎదురుచూశాడు. 1995లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాదా.. రామారావు ప్రభుత్వాన్ని కూలదోసింది..? ఇది చంద్రబాబు నీచ రాజకీయ చరిత్ర కాదా..? సొంతపార్టీతో అధికారం చేపట్టిన చరిత్ర ‘జగన్’ గారిది.. మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డి గారి చరిత్ర చూస్తే.. కాంగ్రెస్‌పార్టీతో పడలేదు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత ఆందోళనకు గురైన ఆయన అభిమానులు కొందరు చనిపోతే.. వారిని ఓదార్చేందుకు యాత్ర పెట్టుకుంటే.. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అది కుదరదంటూ బంధనాలు విధిస్తే.. ఈ కాంగ్రెస్‌పార్టీతోనే తనకు పడదనుకున్నారు కనుకే షంషేర్‌గా జగన్‌మోహన్‌రెడ్డి గారు రాజీనామా చేశారు. తన తల్లితో కూడా రాజీనామా చేయించారు. ఇద్దరూ కలిసి సొంతపార్టీ పెట్టుకున్నారు. ఇవాళ భారతదేశంలోనే గొప్పగా పార్లమెంటులో నాల్గొవస్థానంలో ఉండటం, 50శాతానికి మించి ఓట్లశాతం పొంది ప్రజాదరణతో ఎన్టీ రామారావు కంటే మిన్నగా జనాదరణ కలిగిన నాయకుడుగా నిరూపించుకుని జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు రాజకీయాల్లో నిలబడ్డారు. సొంతంగా పార్టీ పెట్టలేని అసమర్ధుడు ‘బాబు’ చంద్రబాబుకు ఎన్టీ రామారావుతో పడకపోతే.. ఆయన కూడా సొంతపార్టీని పెట్టుకోవచ్చు కదా..? వైశ్రాయ్‌హోటల్‌లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని రాజకీయం చేయడమెందుకు..? అది చంద్రబాబు సహజ లక్షణం. వెన్నుపోటు, కుట్రలు, కుత్రంత్రాలు, కొనుగోలు, అమ్మకాలతోనే చంద్రబాబు నీచ రాజకీయ చరిత్ర నిండిపోయి ఉంది. ఈ వాస్తవాల్ని, చరిత్రను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబుతోనే ‘ఓటుకు నోటు’ బీజంః 2015లో తెలంగాణలో టీడీపీకి సరిపడా ఓట్లు లేకున్నా ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డిని పోటీకి పెట్టి టీఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ను, కోట్ల రూపాయలు డబ్బులిచ్చి కొనుగోలు చేస్తూ దొంగగా పట్టుబడి.. ఆ కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్ర అవసరాల్ని తెలంగాణకు తాకట్టుపెట్టి రాష్ట్రానికే అన్యాయం చేస్తూ అర్ధరాత్రి పారిపోయి ఇక్కడకొచ్చి ఏటిగట్టున దాక్కున్న వ్యక్తి చంద్రబాబు కాదా..? ఇది ఓటుకు నోటు చరిత్రనే కదా..? 2016లో విజయవాడ శాసనసభ్యుడ్ని మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఆశచూపి పార్టీ మార్చుకుంది వాస్తవం కాదా..? ఆ తర్వాత అవసరం తీరగానే మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేసింది చంద్రబాబు కాదా..? ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా కొనుగోలు చేసి అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చాడు కదా..? ఎందుకిచ్చాడు..? ఇది బాబు తప్పుడు చరిత్ర కదా..? బాబు రాజకీయ జీవితమంతా వెన్నుపోటు, కొనుగోళ్లతోనే..ః రాజకీయ అవలక్షణాలతో తప్పుడు నడతతో చంద్రబాబు ఉంటే.. ఆయన ఏనాడూ సొంతంగా పోటీచేసి విజయం సాధించలేదు. సొంతమామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావడం, 1999లో బీజేపీ నేత వాజ్‌పాయ్ గారికి ఉన్న ఇమేజ్ ను వాడుకునేందుకు ఆయనతో ఒప్పందాలు చేసుకుని గెలుపొందడం, 2014లో బీజేపీలో మోదీ గారి ఇమేజ్ ను వాడుకునేందుకు.. అలాగే, జనసేన పార్టీకి ఉన్నటువంటి కులమద్ధతును ఉపయోగించుకునేందుకు ఆ రెండు పార్టీల మద్ధతుతో ముఖ్యమంత్రి కావడం చంద్రబాబు రాజకీయ చరిత్రను ప్రజలెలా మరిచిపోగలరు. 2004, 2019 ఎన్నికల్లోనూ సొంతంగా పోటీచేస్తే టీడీపీకి, చంద్రబాబుకు ఏమైందో అందరికీ తెలుసుకదా..? ఆయన రాజకీయ చరిత్రంతా గోడదాటు, కప్పదాటు, కొనుగోళ్ల రాజకీయమేనని చెప్పాలి. మానుప్యులేషన్ రాజకీయాల ద్వారా గట్టేక్కే రాజకీయం నడపడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఏమార్చే రాజకీయం బాబుది.. నిఖార్సైన నేత జగన్ గారుః చంద్రబాబు సీట్ల రాజకీయం ఎలా ఉంటుందంటే.. సీటిచ్చినా గెలవని నాయకుడు తనను కలవాలని వస్తే ‘ఇదిగో పిలుస్తాడు.. అదిగో పిలుస్తాడు..’ అంటూ పడిగాపులు పడేలా చేస్తాడు. ఇంకోవైపున దొడ్డిదారిన మరో వ్యక్తిని పిలిపించి బీఫారం ఇస్తే.. అప్పటివరకు పడిగాపులు పడినోళ్లు తిట్టుకుంటూ పోవడమే.. ఇది చంద్రబాబు నైజం. కానీ, మా జగన్‌మోహన్‌రెడ్డి గారి నైజం ఏంటంటే.. టిక్కెట్టు ఇవ్వలేకపోతే.. ‘అన్నా.. నీకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వలేకపోతున్నాను. జనంలో నువ్వు బలహీనపడ్డావు. పార్టీని నువ్వు నమ్ముకుని ఉండు. మనమంతా బాగుంటే భవిష్యత్తులో నీకు న్యాయం చేస్తా..’ అని భరోసా ఇచ్చే నాయకుడు. ఇది జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ చరిత్ర. 2014,2019 ఎన్నికలకు ముందుగానీ.. ఇప్పుడు గానీ గమనిస్తే.. చేస్తానని ఏమార్చే గుణం మా జగన్‌మోహన్‌రెడ్డి గారిది కాదు. నిఖార్సైన రాజకీయ లక్షణాలు, గుణాలు కలిగిన నాయకుడు మా జగన్‌మోహన్‌రెడ్డి గారు. సీటు లేదంటే అమ్ముడుపోతారా..?ః సస్పెండైన గౌరవ ఎమ్మెల్యే శ్రీదేవి గారు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గారు ఈరోజు ఒక నిజాన్ని చెబుతున్నారు. ‘ఆయన దగ్గరకు వెళితే మాకు ఈసారి సీటు లేదని చెబుతున్నారంటూ..’ సస్పెండైన ఎమ్మెల్యేలే ఈరోజు బహిరంగంగా చెబుతున్నారు అంటే, ఒక రాజకీయ పార్టీ అధినాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి గారు ఎంత దమ్ముగా ఉన్నారనేది తెలుసుకోవాలి. అదే చంద్రబాబు పది జన్మలెత్తినా .. ఓటు అవసరమున్న శాసనసభ్యుడితో..‘రేపు నీకు సీటివ్వలేను..’ అని చెప్పే ధైర్యం, దమ్ము ఉండదు. అయినా.. సీటివ్వనని చెబితే మరో పార్టీకి అమ్ముడుపోవాల్నా..? శ్రీదేవి గారి నోటివెంట ‘బాబు’ చిలకపలుకులు ..ః ఎమ్మెల్యేగా ఉన్న ఆమెకు ఏడాదిన్నర ముందే.. వచ్చే ఎన్నికల్లో సీటు లేదని చెబితే శ్రీమతి శ్రీదేవి గారు అవమానంగా భావించారట. మరి, 2014 ఎన్నికల అభ్యర్థిగా ఉండి ఓడిపోయినా 2018 ఎన్నికల చివరి వరకు తాడికొండ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ బాధ్యతలు నిర్వర్తించింది కత్తెర క్రిస్టినా గారు కదా..? ఆమెను కాదని ఒక కొత్త అభ్యర్థిగా వైద్యురాలిగా శ్రీదేవి గారిని నిలబెడదామని జగన్‌మోహన్‌రెడ్డి గారు క్రిస్టినా గారిని పిలిచి మాట్లాడితే ఆమె పార్టీ అధినాయకుడిపై ఉన్న ప్రేమ, నమ్మకంతో వెనక్కుతగ్గారు. అన్నిరకాలుగా కష్టపడి ఎన్నికల్లో శ్రీదేవి గారిని గెలిపించారు కనుకనే క్రిస్టినా గారికి ఎక్కడా నష్టం జరగకుండా, గౌరవప్రదంగా గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి దక్కింది. పార్టీ జెండా కూడా మోయకుండా ఎన్నికల ముందు పార్టీలోకొచ్చి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ‘అయ్యో పాపం క్రిస్టినా గారిని ఎంత అవమానించాను..’ అని శ్రీదేవి గారు అనలేదే..? ఆరోజు సీటు నాకొద్దని.. క్రిస్టినా గారిని ఇవ్వమని ఎందుకు అనలేదు..? ఇంత స్వార్ధంతో పార్టీమీద మమకారం లేని శ్రీదేవి గారు ఈరోజు తనకేదో అవమానం జరిగినట్లు చెప్పడమేంటి..? ఏడాది ముందు నియోజకవర్గ ఇన్చార్జిని మారిస్తే ఎమ్మెల్యేగా వారిని అవమానించినట్లు కాదుగదా..? తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జిగా మార్పుచేసి ఇప్పటికి ఆర్నెల్లకాలమైంది. మరి, ఇన్నాళ్లూ మీరు పార్టీ మీటింగులకు వచ్చి మొదటి వరుసలోనే కూర్చొన్నారు కదా..? ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్నారు కదా..? మొన్న కూడా పార్టీ మీటింగ్‌నకు ఎమ్మెల్యేగానే వచ్చారు గదా..? పార్టీలో, కార్యకర్తల్లో మీరు కాస్త బలహీనపడ్డారని జగన్‌మోహన్‌రెడ్డి గారు నిజాయితీగా చెప్పడం మీకు తప్పనిపించిందా..? చివరిదాకా మీ పరిస్థితేంటో చెప్పకుండా దొడ్డిదారిన పిలిపించుకుని బీఫారాలు ఇచ్చిపంపే చంద్రబాబు మాత్రమే మీకు సమర్ధుడా..? ఈరోజు భయమేస్తుందనే పెద్దమాటలన్నీ చంద్రబాబు చెప్పిన చిలకపలుకులు కాదా..? అని అడుగుతున్నాను. మీ అంతరాత్మను అడగండి..? ఈరోజు సస్పెండైన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ‘మేం క్రాస్ ఓటింగ్ వేశామని ఎలా తెలుసు.. కెమెరాలు పెట్టారా..? మనుషుల్ని పెట్టారా..? దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం..’ అంటూ రకరకాల స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. మీరు నిజంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా..లేదా.. అనే విషయంపై ఎక్కడెక్కడ్నో ఒట్లేసుకోనక్కర్లేదు. మీ అంతరాత్మపై ప్రమాణం చేసుకుని మీకుమీరు సమాధానం చెప్పుకోండి. మీరు నిజాయితీ కలిగిన ఎమ్మెల్యేలే అయితే 2024 వరకు ఆగడమెందుకు.. ఇప్పుడే మీరంతా రాజీనామా లేఖల్ని స్పీకర్ గారికి ఇచ్చి మళ్లీ పోటీచేసి ప్రజల్లో మాకు ఇంకా ఆదరణ ఉందని నిరూపించుకుని మా నోళ్లు మూయించొచ్చు కదా..? ‘యూనిక్ సీక్వెన్స్ ఓటింగ్’తోనే దొంగలు దొరికారుః యూనిక్ సీక్వెన్స్ ఓటింగ్’తోనే క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన దొంగలు దొరికారు. మరి, టీడీపీ సభ్యులు పోలింగ్‌లో మూడో ప్రాధాన్యత ఓటు దగ్గర్నుంచి ఏడో ప్రాధాన్యత వరకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేశారు..? నేనే ప్రత్యక్షసాక్షిని. నా పక్కన పయ్యావుల కేశవ్, ఆయన పక్కన పంచుమర్తి అనురాధ గారు కూడా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు పంచుమర్తి అనురాధకు వేసుకుని.. మిగతా ప్రాధాన్యత ఓట్లు వైఎస్‌ఆర్‌సీపీకి ఏ ఆర్డర్ ప్రకారం వేయాలో టీడీపీ పెట్టుకున్న యూనిక్ ఓటింగ్ మాదిరిగానే మేం కూడా పెట్టుకున్నాం. దానిప్రకారం ఖచ్చితంగా ఎవరి ఓటు ఎక్కడ మిస్ అవుతుందో తెలుస్తుంది. ఈ విధానం ఈరోజు కొత్తేమీ కాదు. రాజకీయాల్లో ఇది అనాదిగా, అనవాయితీగా వస్తున్న విధానమే.. ఈ యూనిక్ సీక్వెన్స్ అనేది మేం కనిపెట్టిన సూత్రం కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీక్రెట్ ఓటింగ్ కాబట్టి, పార్టీ విప్ చెల్లదు కనుక ఇంటిదొంగల్ని గుర్తించేందుకు అనాదిగా కొనసాగిస్తున్న విధానం ఇది. ఈ విధానంలోనే మా పార్టీలో అసలు దొంగలు దొరికారు. ఆనం గారూ.. ఇన్ని అబద్ధాలా..? ఓటేయమని తననెవరూ అడగలేదని ఆనం రామనారాయణరెడ్డి గారు అనడం వెనుక నిజమేంటంటే, మొన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు స్వయంగా నన్నే ఆనం రామనారాయణరెడ్డి గారు పిలిచి మా చీఫ్ విప్ ప్రసాదరాజుతో మాట్లాడారు. తాను మాక్ ఓటింగ్‌నకు రాలేనని.. ఏదో పనుందని చెప్పారనడానికి నేనే ప్రత్యక్షసాక్షిని. మర్నాడు ఆయనే వచ్చి నేను ఎవరికి ఓటేయ్యాలో నాకు యూనిక్ ప్యాట్రన్ ఇవ్వండని అడిగారు. పార్టీ పరంగా మేం ప్యాట్రన్ ఇచ్చాం. దానిప్రకారం ఒకటి, రెండు ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేశారనేది సస్పెండైన ఎమ్మెల్యేలే తమ అంతరాత్మతో ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా చంద్రబాబు నీచరాజకీయాన్ని అర్ధం చేసుకుని ఆపార్టీలో కూడా ఈ సస్పెండైన ఎమ్మెల్యేలు వెన్నుపోటుకు గురికావొద్దు.. అని హెచ్చరిస్తున్నాను. కులాలను కాదు.. జనాన్ని నమ్ముకున్న నేత జగన్‌గారుః అమ్ముడుపోయే గుణం ఉన్నోళ్లు అన్ని కులాల్లోనూ ఉంటారు. గతంలో 23 మంది అమ్ముడు పోయిన ఎమ్మెల్యేల్లో కూడా అన్నీ కులాల వాళ్లూ ఉన్నారు. ఆనాడు జగన్‌మోహన్‌రెడ్డి గారిని మానసికంగా కుంగదీయాలని చంద్రబాబు రకరకాల వ్యూహాలు పన్నినప్పుడు..‘నువ్వు ఎంతమందినైనా కొనుక్కో.. నేను కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకుంటాను. నేను జనాల్ని నమ్ముకున్నాను. నీ మాదిరిగా అవినీతి సొమ్ముతో కొనుగోళ్ల రాజకీయం చేయను..’ అని ఆరోజే మా నాయకుడు దమ్ముగా చెప్పారు. విలువలు, విశ్వసనీయత కలిగిన రాజకీయం నడుపుతూ.. కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అలుపెరుగని పోరాటయోధుడిగా మా జగన్‌మోహన్‌రెడ్డి గారు నిఖార్సైన రాజకీయం నడుపుతారు.