బాబుకు విజనూ లేదు.. విస్తరాకుల కట్టా లేదు

మాజీ మంత్రి కురసాల కన్నబాబు 

 పేదల గురించి బాబు కొత్త రాగాలు
 
 పేదల గురించి మాట్లాడటానికి బాబు అనర్హుడు

  మీడియాలోనే బాబు బాహుబలి.. ఒంటిరిగా పోటీ చేసే సత్తా లేదు

 మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ:   చంద్ర‌బాబుకు విజనూ లేదు.. విస్తరాకుల కట్టా లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమ‌ర్శించారు.  ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉన్నాయనగా.. రోజుకో వేషం.. పూటకో మాట మాట్లాడుకుంటూ మళ్ళీ ప్రజల్ని మభ్య పెట్టే కార్యక్రమం, ప్రాంతాలలో చిచ్చు పెట్టి,  తన మాయలో పడేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని మండిప‌డ్డారు.  తానేదో సత్యహరిశ్చంద్రుడిలా, నీతి మంతుడిలా, ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్న గురువులా బిల్డప్ లు ఇవ్వడం ప్రారంభించాడు. కొన్ని ఎల్లో పత్రికలు అయితే చంద్రబాబు ప్రవచనాలతో పేజీలకు పేజీలు నింపాయ‌ని ఎద్దేవా చేశారు. కాకినాడ‌లో క‌న్న‌బాబు మీడియాతో మాట్లాడారు.

- పేదరిక నిర్మూలనకు.. ఈ వృద్ధ నాయకుడికి కొత్త విజన్ అట.. అసలు పేదల గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం.

- విజన్ 2020 అని తానంటే అందరూ నవ్వారు. ఏదైతే నేను ఆశించానో నేడు అది జరిగింది అని చంద్రబాబు చెబుతున్నాడు తప్పితే.. నేను చేశాను అని చెప్పటం లేదు. ఆయన కలలు మాత్రమే కంటాడు. 

- 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయినవాడు.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినవాడు, 28 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నవాడు,  ఇప్పుడు కొత్తగా పేదరిక నిర్మూలన అని అంటున్నాడు. పేదలకు ఏం చేశావు అంటే.. తన మార్కు ఉన్న ఒక్క పథకం పేరు  చెప్పలేడు. పేదరిక నిర్మూలన గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడ ఉంది. 

- ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోడీ ప్రారంభింంచిన 2047 విజన్ కు తాను మద్దతు ఇచ్చానని చెబుతున్నాడు. 

- జగన్ మోహన్ రెడ్డిగారు పేదల సంక్షేమం కేవలం నాలుగేళ్ళలోనే.. రూ. 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తే.. పేదలకు పంచితే.. "నొక్కుడు-బొక్కుడు" అంటూ హేళన చేస్తున్న చంద్రబాబు పేదల గురించి మాట్లాడటమా..?

- అమరావతిలో పేదలకు ఇళ్ళ  పట్టాలు ఇస్తామంటే అడ్డుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే.. దానిపైన కోర్టుల కెళ్ళి అడ్డుకుంటాడు. పేదల కోసం ఆరోగ్యశ్రీని తెస్తే.. దాన్ని అటకెక్కించిన వ్యక్తి ఈరోజు  పేదల గురించి మాట్లాడతాడా..?

- ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా.. ఒకరు చనిపోతేనే మరొకరికి ఇచ్చే  పరిస్థితి చంద్రబాబు హయాంలో చూశాం. అటువంటి వ్యక్తి పేదల గురించి చంద్రబాబు  కొత్త రాగాలు తీస్తున్నాడు. 

- దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు- రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే.. కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నాడు.. అటువంటి బాధ్యత లేని వ్యక్తి, పేదల వ్యతిరేకి, రైతుల వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వ్యతిరేకి చంద్రబాబు ఇప్పుడు పేదల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. 

- పాత నాయకుడికి కొత్త విజన్ ఏంటి.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి, ఏ విజన్ ను అమలు చేశావ్, పేదలకు నీ మార్కు పథకం ఒక్కటంటే ఒక్కటైనా అమలు చేశావా.. అంటే ఒక్కటైనా చెప్పగలుగుతాడా చంద్రబాబూ.. చెప్పలేడు. 

మోడీ గారి కనికరం కోసం మోకరిల్లిన బాబుః
- నిన్న రిపబ్లిక్ టీవీకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే.. మోడీ గారి కోసం తాను రెడీగా ఉన్నానని, మోడీ గారి కరుణ కోసం ఎదురు చూస్తున్నాడన్నది.. రాజకీయాల్లో ఏ కొంచెం అవగాహన ఉన్నవారైనా ఇట్టే చెబుతారు..

- "మోడీని నేను ఎప్పుడు వ్యతిరేకించాను.. మోడీ గారితో ఏకీభవిస్తున్నాను. మోడీ గారిని ప్రేమిస్తున్నాను. మోడీ గారితో నాకు అనుబంధం కావాలి.  మోడీ గారితో భవిష్యత్తులో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను..." అని చంద్రబాబు చెప్పినట్టు ఉంది. 

- మోడీ గారి కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో.. మోడీ గారి కనికరం కోసం ఎలా మోకరిల్లుతున్నాడో ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు.

- గతంలో మీరు ఎన్డీఏ యేతర పార్టీలతో కూటమి కట్టారు కదా.. అని ఇంటర్వ్యూలో అడిగితే.. అప్పుడు కూడా మోడీని వ్యతిరేకించలేదు. ఆయన విజన్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన కోసం నేను, నా ప్రజలు కలిసి పనిచేస్తాం.. అని చెప్పే పరిస్థితికి బాబు వచ్చాడు. 

- మోడీ గారు..  ప్రపంచానికి భారతదేశం అంటే ఏమిటో తెలియజెప్పారు. మోడీ చేసిన పనికి నా కృతజ్ఞతలు అని చంద్రబాబు అంటున్నాడు.

- రాజకీయాలు చేయడం లేదంటూనే.. అడ్డగోలు రాజకీయాలు చేస్తున్నాడు. 

- ఇదే మోడీ గారిని, గతంలో ఈయన ఏం మాట్లాడాడో చూస్తే.. ఎన్డీఏకు వ్యతిరేక కూటమి కట్టి.. 1996లో తరహాలో థర్డ్ ఫ్రంట్ తెస్తానని చెప్పిన వ్యక్తి. రాహుల్ గాంధీతో చేతులు కలిపి.. ఆయనతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి, కాంగ్రెస్ కు ఉన్నది కూడా పోగొట్టిన వ్యక్తి చంద్రబాబు. 

నాడు ఇదే నోటితో మోడీని బాబు ఏమన్నాడంటే..
ఇదే చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు ఏమన్నాడో.. రీల్ వెనక్కి తిప్పితే..

- 2019 ఏప్రిల్ 3న-  "మోడీ అంత దుర్మార్గమైన రాజకీయ నాయకుడు ఎవరూ లేడు. ఇలాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు.  మోడీ కంటే ఎవరైనా బెటర్  ప్రధాని అవుతారు" అని చెప్పాడు. 

- అప్పుడు రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్ళి.. సీతారాం యేచూరిని కలిసి... మిషన్ యునైటెడ్ అపోజీషన్.. అని ప్రగల్భాలు పలికాడు.

- 2019 మే 6వ తేదీన.. మోడీ కంటే కాంగ్రెస్ బెటర్ అని మరో స్టేట్ మెంటు ఇచ్చాడు. 

- రాష్ట్రానికి కాంగ్రెస్ కన్నా పెద్ద ద్రోహి మోడి అని, మోడీ కన్నా పెద్ద ద్రోహి ఎవరూ ఉండరని.. ఇదే చంద్రబాబు  మాట్లాడాడు.

- చంద్రబాబు నాయుడు తన కొడుకును ఉదయించేలా చేసేందుకు.. రాష్ట్రాన్ని అస్తమించేలా చేస్తున్నాడని మోడీ గారు కూడా చెప్పారు. 

- ఈ మాటలన్నీ ఎందుకంటే.. చంద్రబాబు కొన్ని వ్యవస్థల్లోని వ్యక్తులకు సంకేతాలు ఇచ్చే కార్యక్రమం  కోసం, మోడీతో తాను దగ్గరిగా ఉన్నానని తెలియజెప్పేందుకు ఇలా మాట్లాడుతున్నాడు. అందుకే ఢిల్లీ వేదికగా జరిగిన రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. 

- ఇదంతా మోడీకి కన్ను కొట్టి, ఆయనకు భజన చేసే కార్యక్రమం తప్ప మరొకటి కాదు.  

- మోడీ గారు పెద్ద నోట్లు రద్దు చేస్తే.. నేనే సలహా ఇచ్చాను అంటాడు.
- హైదరాబాద్ బాగుందని ఎవరైనా అంటే.... అది నేనే అభివృద్ధి చేశాను అంటాడు
- సత్య నాదెళ్ళ, పీవీ సింధు.. ఇలా ఎవరి విజయాన్ని అయినా తన ఖాతాలో వేసుకునే విద్య తెలిసినవాడు చంద్రబాబు. 

- అభివృద్ధి వేరు.. రాజకీయం వేరు.. అని ఇప్పుడే తెలిసిందా చంద్రబాబుకు..?

కొడుక్కి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడమే బాబు విజన్ః
- అనుభవం ఉందని 2014లో అధికారం అప్పగిస్తే.. ఒక్క పర్మినెంటు బిల్డింగు కట్టలేని వాడు, శివ రామకృష్ణన్ కమిటీ వద్దన్న చోటే రాజధానిని ప్రకటించి.. ఏమీ చేయలేని వాడు చంద్రబాబు.

- చంద్రబాబుకు విజన్ లేదు.. విస్తరాకుల కట్టా లేదు..

- చంద్రబాబుకు భజన చేసే నారాయణ లాంటి వారు,  కొన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. 

- చంద్రబాబుకు ఉన్న విజన్ ఒక్కటే.. ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలి. తన చుట్టూ ఉన్న వందిమాగధులకు దోచి పెట్టాలి. తన కొడుక్కు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలి. ఇంతకంటే వేరే విజన్ బాబుకు ఉందా..?

పేదల గురించి మాట్లాడటానికి బాబు అనర్హుడుః
- పేదల గురించి కొత్త రాగం పాడుతున్న చంద్రబాబు.. పేదరిక నిర్మూల కోసం ఏం చేశాడు అని ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు అధికారంలో ఉండగా, యువత కోసంగానీ, మహిళల కోసంగానీ,  పేదల కోసంగానీ..  ఆయన మార్కు సంక్షేమ  పథకం ఒక్కటైనా ఉందా.. అని చంద్రబాబును అడుగుతున్నాం..

- మేము చెబుతాం.. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి.. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రైతు భరోసా, నేతన్న నేస్తం, ఇలా 32 కార్యక్రమాల పేర్లు మేము చెప్పగలం. 

- ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజల ఖాతాల్లో నేరుగా డీబీటీ ద్వారా డబ్బులు వేయడం దగ్గర నుంచి సచివాలయాల ద్వారా గడప వద్దకే పరిపాలన తీసుకెళ్ళాం. 

- పేదరిక నిర్మూలన కోసం ఏం కావాలో.. దాన్ని చేస్తున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. పేదరిక నిర్మూలన కోసం అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఇది. 

- ఆరోజు రాజశేఖర్ రెడ్డిగారు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంటు, ఆరోగ్య శ్రీలను అంతకంటే బెటర్ గా అమలు చేస్తున్నాం.

- 28 ఏళ్ళ కాలంలో ఏమీ చేయలేని వాడివి.. ఇంకా అధికారంలోకి వస్తే అది చేస్తాను.. ఇది చేస్తాను అని ఎలా చెప్పగలవు.. పేదల పేరెత్తే అర్హతే బాబుకు లేదు. 

- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నిజమైన చేయూతను అందిస్తేనే, వారికి ఆత్మ గౌరవాన్ని పెంచితేనే పేదరికం అంతం అవుతుందని నమ్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికారంలోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం వాటా ఇస్తూ ఏకంగా చట్టం చేశారు. 

మీడియాలోనే బాబు బాహుబలి.. ఒంటిరిగా పోటీ చేసే సత్తా లేదుః
-  మీడియాలోనే చంద్రబాబును బాహుబలిగా ప్రచారం చేస్తారు.  పొత్తులు లేకుండా చంద్రబాబు ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్ళాడా..?

- సింగిల్ గా పోటీ చేస్తానని చెప్పడు.  ఎందుకంటే అతనికి మీడియా బలం తప్ప మరో శక్తి లేదు. ధైర్యం లేదు. 

- మేము నాలుగేళ్ళ పరిపాలనలో ప్రజలకు మంచి చేశాం కాబట్టే..  నేరుగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాం. మేలు చేశాం కాబట్టి.. చేసింది చెప్పుకోగలుగుతున్నాం. 
- చంద్రబాబు తన సభలను, తన కొడుకు పాదయాత్రను అడ్డుకుంటున్నారని అంటున్నాడు. ఆ అవసరం మాకెందుకు ఉంటుంది. ప్రజల్లో బలమైన పునాదులు  మాకు ఉన్నాయి. 

- కందుకూరు, గుంటూరులో మీ షూటింగ్ ల సరదాల కోసం ప్రజలు చనిపోతే.. చర్యలు తీసుకోవద్దా.. ?

-  మేం అడ్డుకుంటే తండ్రీకొడుకులు తిరగగలరా.. ?

- వైఎస్ఆర్సీపీని విలన్ గా చూపించి రాజకీయంగా ఎదగాలనుకుంటున్న చంద్రబాబు... ఎప్పటికీ హీరో కాలేడు.

-  ఏ వర్గానికీ మేలు చేయని నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతే.. ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందర్నీ ఆదుకున్న నాయకుడిగా జగన్ గారు నిలిచిపోతారు.  కాబట్టే ఎక్కడకు వెళ్ళినా జగన్ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top