అది రైతు యాత్ర కాదు.. రాజకీయ యాత్ర

బాబు అమరావతి కథ అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే

బాబు చేత, బాబు వల్ల, బాబు కోసం చేస్తున్న యాత్రే అది

గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకోని బాబు.. అమరావతి పేరుతో ఇంకా భ్రమల్లో.. 

టెంట్లల్లో ఉంది పట్టుమని పదిమందే.. లక్షలాది మంది ఉన్నట్టు ఎల్లో మీడియాలో కలరింగ్

విశాఖ, కర్నూలుకు రాజధానులు వద్దని చెప్పటానికి మీకు ఏ హక్కు ఉంది..?

అమరావతిలో నిజమైన రైతుల ఉసురు బాబుకు తగులుతుంది.

చంద్ర‌బాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ధ్వ‌జం

కాకినాడ‌: అమ‌రావ‌తి రైతుల ముసుగులో రాజ‌కీయ యాత్రకు చంద్ర‌బాబు తెర‌తీశార‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు కోసం జరుగుతున్న యాత్రే అని అభివ‌ర్ణించారు. విశాఖ‌, క‌ర్నూలుకు రాజ‌ధానులు వ‌ద్ద‌ని చెప్ప‌డానికి చంద్ర‌బాబు, ఆయ‌న తాబేదారుల‌కు ఏ హ‌క్కు ఉంద‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు స్వార్థం కోసం రాష్ట్రంలోని మిగ‌తా ప్రాంతాల ప్ర‌యోజ‌నాల‌ను బ‌లిచేయాల‌ని కుట్ర‌లు చేస్తూ  ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. కాకినాడ‌లో మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.  

మాజీ మంత్రి కన్నబాబు ఇంకా ఏమన్నారంటే.. 
చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉండటం మన దురదృష్టం. రాష్ట్ర విభజన జరిగిన తీరు ప్రతి తెలుగు వాడి గుండెల్లో కూడా బాధ, ఆవేదన నింపింది. విభజన నేపథ్యంలో అగమ్యగోచరంగా ఉన్న తరుణంలో చంద్రబాబు 2014లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అయితే, ఆయన స్టేట్ కోసం ఏరోజూ పనిచేయలేదు. కేవలం భూములను అడ్డు పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పనిచేశాడు. 

అమరావతి రైతుల పేరుతో చేస్తున్న యాత్రను చంద్రబాబు డైరెక్షన్ లో నడిపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు వల్ల, చంద్రబాబు నాయుడు కోసం జరుగుతున్న యాత్రే ఇది. ఎక్స్ పర్ట్ కమిటీలు వద్దని చెప్పినా వినకుండా, తాను అనుకున్న అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తానని చెప్పి, ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని కడతానని గ్రాఫిక్స్ చూపించి, అది కట్టలేక 2019 ఎన్నికల్లో ప్రజల చేతిలో భంగపడ్డాడు. దాని నుంచి గుణ పాఠాలు నేర్చుకోకపోగా, అమరావతి పేరుతో ఇంకా ప్రజల్ని భ్రమల్లో ఉంచుతున్నాడు. 

అమరావతి రైతుల పేరుతో, ఒక మహా ఉద్యమం జరుగుతున్నట్టుగా, వెయ్యి రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్నట్టుగా.. లక్షలాది మంది ఆ యాత్రలో పరుగులు తీస్తున్నట్టుగా.. చంద్రబాబు తనకున్న మీడియా బలంతో,  ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తున్న వార్తలు చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదు. ఆ టెంటుల్లో పది మంది లేకపోయినా, ఎల్లో మీడియా అద్భుతంగా జరుగుతున్నట్టు ప్రచారం చేస్తుంది, ఎవరి కోసం ఇదంతా జరుగుతుంది అంటే.. కేవలం చంద్రబాబు కోసమే అనేది రాష్ట్రంలోని ప్రజలందరికీ అర్థమవుతుంది. 

చంద్రబాబుకు ఆ లక్షణాలు లేవు..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నాకు సమానమే అన్న భావన ఏ రాజకీయ పార్టీకైనా ఉండాలి. వెనుకబడిన ప్రాంతాల పట్ల, పేద వర్గాల పట్ల మరింత బాధ్యతగా ఆ పార్టీలు ఉండాలి, కానీ చంద్రబాబుకు ఆ లక్షణాలేవీ లేవు. ఎంతసేపటికీ ఆయనకు రాజకీయమే కావాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారమే కావాలి. ఆ రోజు తాను, తన బినామీలు, బంధువులు, అమరావతి భూములపై పెట్టిన పెట్టుబడులు పదింతలు, వందింతలు కావాలన్నదే ఆయన ప్రయత్నమంతా. అది జరగకపోవడంతో, మిన్ను విరిగి మీద పడినట్టుగా గగ్గోలు పెడుతున్నారు.

అది రైతు యాత్ర కాదు.. రాజకీయ యాత్ర.
అమరావతి రైతుల పేరుతో చంద్రబాబే తమ మనుషుల చేత ఒక యాత్ర మొదలుపెడతాడు. ఆ యాత్రకు సీపీఐ రామకృష్ణ మద్దతిస్తారు. ఆ తర్వాత సీపీఎం శ్రీనివాసరావు మద్దతిస్తారు. బీజేపీ నుంచి పాతూరి నాగభూషణం మద్దతిస్తారు. వీరు చాలదన్నట్టుగా, పక్క రాష్ట్రంలో ఉన్న రేణుకా చౌదరి కూడా వచ్చి మద్దతిస్తూ, నోటికొచ్చినట్లు ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా  మాట్లాడతారు. 
- చంద్రబాబుకు ఉన్న బలం ఏమిటంటే.. ఎల్లో మీడియా, ఆయన చుట్టూ ఉన్న దుష్టచతుష్టయమే. 
- చంద్రబాబుకు కనీసం జనంలో పరపతి ఉందా.. అంటే లేదు. 
-  చేతనైతే, రోడ్డు మీదకు వచ్చి విశాఖ రాజధాని వద్దు, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఎలా పోయినా ఫర్వాలేదు అని చంద్రబాబును చెప్పమనండి. 

బాబు ప్యాకేజీ తీసుకున్నప్పుడు రేణుకా ఏమైపోయింది..?
రేణుకా చౌదరి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ఏరోజు అయినా రాష్ట్రానికి వచ్చిందా..?. ఇదేదో మరో స్వాతంత్ర్య సంగ్రామం అని, స్వాతంత్ర్య ఉద్యమం లాంటిదని పోలుస్తుందామె. ఆమె మాటలతో.. దేశం కోసం జరిగిన స్వాతంత్ర్య పోరాటాన్ని అవమానించడమే.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనప్పుడు వీళ్ళంతా ఏమైపోయారు..?.  ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ చాలు అని ఆరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా కేంద్రంతో లాలూచీపడినప్పుడు ఈ రేణుకా చౌదరి, సీపీఐ రామకృష్ణ, నారాయణ.. వీళ్ళంతా ఏమైపోయారు..?
- ఈరోజు రియల్ ఎస్టే ట్ వ్యాపారం కోసం, మీ భూముల ధరలు పెంచుకోవడం కోసం చేస్తున్న ఉద్యమాన్ని సిగ్గూ, ఎగ్గూ లేకుండా స్వాతంత్ర్య ఉద్యమంతో పోలుస్తారా..*
- మీ స్వార్థ రాజకీయాల కోసం, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రయోజనాలను బలి పెడతాం అంటే.. మేం చూస్తూ ఊరుకోం. ఓ వ్యక్తిగా, ఎన్టీఆర్ ఒక్కడికే ఆత్మ గౌరవం ఉంటుందా.. ప్రాంతాలకు ఉండదా..? ఉత్తరాంధ్రకు, రాయలసీమ ప్రజలకు ఆత్మ గౌరవం లేదా..? వాళ్ళకు హక్కులు లేవా.. మీ ఒక్కరికే అన్ని హక్కులూ ఉంటాయా.. ?
- మీరు ఏమి చెబితే.. అది రాసే పత్రికలు, మీడియా ఉంది కాబట్టి.. మీరు ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టుగా తయారైంది.
- మొన్నీమధ్య ఈనాడులో చూశాను. ఎవరో ఒకాయన పుస్తకం రాస్తే.. దానికి పేజీలకు పేజీలు పత్రికల్లో అచ్చేసి అదే నిజం అన్నట్టుగా, చంద్రబాబు ఆలోచనలే ప్రజల్లో ఉంచాలి, భవిష్యత్తు తరాలు కూడా అవే నమ్మాలి అనేట్టుగా, ఒక దుర్బుద్ధితో ఈనాడు, మిగతా ఎల్లో మీడియాలో కథనాలు వండి వార్చారు. 
- 2014లో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలో ఉన్నప్పుడే శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. ఆ రిపోర్టును కూడా ఇదే చంద్రబాబు లెక్క చేయలేదు. మరి రేణుకా చౌదరి ఎప్పుడైనా ప్రశ్నించిందా.. ? ఈమె జెండా వేరు, అజెండా వేరు, ఆలోచనలు వేరు. 
- శివరామకృష్ణన్ నివేదికలో రాజధాని ఎక్కడ ఉండాలి, ఎక్కడ భూములు తీసుకోవాలి.. ఎటువంటి భూములు తీసుకోవాలి.. అనే అంశాలను చాలా స్పష్టంగా రాశారు. కమిటీలో బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్న జ్ఞానం..  చంద్రబాబు అండ్ కో.. కు లేదు.

బాబు డిక్షనరీలో అర్థాలే వేరులే..
చంద్రబాబు డిక్షనరీలో అర్థాలే వేరుగా ఉంటాయి. ఆయన డిక్షనరీలో.. దేశం అంటే తెలుగుదేశం అని, జాతిపిత అంటే చంద్రబాబు అని, రాష్ట్ర భవిష్యత్తు అంటే.. లోకేష్ అని సంక్షేమం అంటే చంద్రబాబు సొంత మనుషులు, వ్యక్తుల సంక్షేమం అని, రైతులంటే.. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు అని.. మీ డిక్షనరీలో, మీరు రాసుకున్న అర్థాలను బట్టి.. మీకు అనుకూలంగా మేము పని చేయాలంటే అది కుదరదు. అందుకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ సిద్ధంగా ఉండరు. 
-  ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆత్మ గౌరవంతో బతికాలనేదే మా నాయకుడు వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం, కాబట్టే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, సంక్షేమ పథకాలతో పాటు, పదవుల్లో న్యాయపరమైన వాటా ఇచ్చిన నాయకుడు. 
- భవిష్యత్తు తరాలను ఆలోచించి, ప్రభుత్వ స్కూళ్ళు, ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమం, ఇంగ్లీషు మీడియం విద్య అమలు చేస్తున్నారు.  మీ లాంటి స్వార్థపరుల చేతిలో రాష్ట్రం చిక్కకూడదని వైయ‌స్‌ జగన్ ముందుకు అడుగులు వేస్తున్నారు. మీ పప్పులు మా ప్రభుత్వంలో ఉడకవు అని స్పష్టం చేస్తున్నాం. 
- అందుకే, తెల్లారి లేచిన దగ్గర నుంచి.. పిల్లి శాపాలు పెడుతూ.. వైయ‌స్ జగన్‌ని,  ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. మీ పిల్లి శాపాల వల్ల వైయ‌స్‌ జగన్‌కి ఏమీ కాదు. మీకు నిద్రలో కూడా వైయ‌స్‌ జగన్ జపమే. వైయ‌స్‌ జగన్ నామస్మరణతో నిద్ర లేని రాత్రులు మీరు గడుపుతున్నారు. మీ దుష్ట రాజకీయానికి నామరూపాల్లేని రోజులు రాబోతున్నాయి. 

మరి పోలవరం రైతులు త్యాగం చేయలేదా..?
మీ దృష్టిలో అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన వారే త్యాగమూర్తులు అయితే, మరి పోలవరం ప్రాజెక్టుకు, రాయలసీమలో ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారు త్యాగమూర్తులు కాదా..?
- పోలవరం ప్రాజెక్టు కోసం, అక్కడి ముంపు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో ఊర్లకు ఊర్లు వదిలి వెళ్ళారు. ప్రాజెక్టు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములను తృణప్రాయంగా వదిలి వెళ్ళారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ఒక్కటే త్యాగం కాదు. 
- మీ బినామీ పేర్లతో అమరావతి రైతుల దగ్గర నుంచి భూముల కొన్నది చంద్రబాబు, ఆయన తొత్తులే. ఆ భూములను కాపాడుకోవడం కోసం, ధరలు పెంచుకోవడం కోసమే యాత్రల పేరుతో మీ ఆరాటం. 
- కాకినాడలో ఉండే మాకో, రాజమండ్రిలో ఉండేవాళ్ళకో, అనంతపురం, కర్నూలులో ఉండే వాళ్ళకో.. అమరావతి వల్ల ఏమిటి ఉపయోగం..?. మూడు రాజధానులు ఉంటేనే మాకు మంచిది. ఈ దేశంలో ఎన్నో చోట్ల రెండు రాజధానులు ఉన్నాయి. 
- చంద్రబాబుకు తన వాళ్ళ బాగు కోసం చేసిన దురాలోచనే.. తప్ప ఆయనకు ముందు చూపు లేదు. 
- మీరు రాసిందే చరిత్ర, మీరు చూపించిందే చరిత్ర అన్నట్టుగా.. మీరు బతుకుతూ ప్రజలను భ్రమల్లో పెట్టాలని పగటి కలలు కంటున్నారు. మిమ్మల్ని, మీ అబద్ధాలను ప్రజలు నమ్మరు కాబట్టే, మీరు అక్కడ, మేము ఇక్కడా ఉన్నాం. 

మరి, 1995లో బాబు రాజధాని ఎందుకు మార్చలేదు..?
1953 ప్రాంతంలోనే రాజధానిని విజయవాడకు మార్చాలని సీపీఐ  కోరుకుందని మొన్న పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నాడు. మరి 1995లో చంద్రబాబే ముఖ్యమంత్రి అయ్యాడు. 1995లో రాజధానిని విజయవాడకు ఎందుకు చంద్రబాబు మార్చలేకపోయాడు..? మీ సోదర పార్టీగా ఉన్నప్పుడు కూడా ఎందుకు నెరవేర్చలేకపోయాడు?
- పది మందిని కూడబెట్టుకుని, ఎవరితోనైనా ఎప్పుడైనా పొత్తులు పెట్టుకుని, ఎవరినైనా, సీపీఐ అయినా, బీజేపీని అయినా వాడుకుని వదిలేస్తూ.. వాళ్ళ నోళ్ళలో నుంచి ఈయన మాటలు మాట్లాడించగల ఘనుడు చంద్రబాబు.
- నిన్న ఏం చెబుతాడో.. ఈరోజు అది చెప్పడు. సిగ్గూ, ఎగ్గూ వదిలేసి పూటకో మాట.. రోజుకో రాజకీయం చేయడం బాబుకు అలవాటు.  

అమరావతికి బాబు ఏం మేలు చేశాడు.. వైయ‌స్ జగన్ ఏం అన్యాయం చేశారు?
అమరావతికి ఈ ప్రభుత్వం ఏం అన్యాయం చేసింది..? చంద్రబాబు చేసిన మేలు ఏంటి. వైయ‌స్ జగన్ చేసిన నష్టం ఏమిటి..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాష్ట్రం అంటే మూడు ప్రాంతాలు అని, అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాలని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని అని వైయ‌స్‌ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రైతులకు మీరు చేసిన ఒప్పందం ప్రకారమే, భూములు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. మీరు చేసిన చట్టాల ప్రకారమే కౌలు రైతులకు కౌలు చెల్లిస్తున్నాం. 
- అమరావతిలో రాజధానే లేదంటే అన్యాయం చేసినట్టు. శాసన రాజధాని అమరావతిలోనే పెడుతున్నారు. అయినా మీకు ఏం అన్యాయం జరిగింది..?.
-  విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూలులోన్యాయ రాజధాని వద్దు అని చెప్పటానికి మీరు ఎవరు..?
- మీకు ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా..?
- విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అన్నివిధాలా అనుకూలమైన ప్రాంతం అని ఎన్నో నిపుణుల కమిటీలు చెప్పాయి. విశాఖకంటే పెద్ద నగరం, రెడీమెడ్ నగరం మనకు ఉందా..?
- మీరు చెబుతున్నట్టు, ఎన్ని రాష్ట్రాల రాజధానులు నడిబొడ్డులో ఉన్నాయ్.. దేశ రాజధాని ఢిల్లీ దేశానికి నడిబొడ్డులో ఉందా..?. కొలతలు గీచి, మధ్యలో ఎవరూ రాజధానులు పెట్టరు. 

అమరావతిలో నిజమైన రైతుల ఉసురు బాబుకు తగులుతుంది.
కేవలం అమరావతిలో మీ భూములు కాపాడుకోవడం కోసం.. రాజధాని విషయంలో ముందు నూజివీడు అని, తర్వాత అక్కడా, ఇక్కడా అని ప్రజలను తప్పుదారి పట్టించి, ఆ తర్వాత మీకు నచ్చిన చోట పెట్టుకుని, అమరావతిలో నిజమైన రైతుల ఉసురు చంద్రబాబు పోసుకుంటున్నాడు. అమరావతిలో బాబు బినామీ రైతులు వేరు, నిజమైన రైతులు వేరు. 
- చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ళలో మహా రాజధానిని నిర్మిస్తామంటే మేము అడ్డుపడ్డమా..?
- ఎవరు అడ్డుపడినా, ఎవరు అవునన్నా, కాదన్నా.. ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయి. అది మా  ప్రభుత్వ విధానం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, హైదరాబాద్ లోనే కుప్ప పోసినట్టుగా పోయకుండా,  నిపుణుల కమిటీలతో అధ్యయనం చేయించి తర్వాతే తీసుకున్న నిర్ణయం పాలనా వికేంద్రీకరణ-మూడు రాజధానులు. లీగల్ హర్డిల్స్ వల్ల ఆలస్యమవుతుందేమో కానీ.. మూడు రాజధానులపై తగ్గేదేలే..
- ఇదే అమరావతి రైతులు ఇటీవల చంద్రబాబు డైరెక్షన్ లో న్యాయస్థానం టు దేవస్థానం అని యాత్ర చేశారు. మళ్ళీ ఈరోజు ఉత్తరాంధ్రపై దండయాత్రలు చేస్తున్నారు. హైకోర్టు కూడా, 600 మంది మాత్రమే పాల్గొనాలని, ఐడీ కార్డులు ప్రభుత్వానికి సబ్ మిట్ చేయమని చెప్పింది, వారి ఐడీ కార్డులు చూస్తే.. వారిలో నిజమైన రైతులు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. 
- ఈ రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి. మీ స్వలాభం కోసం, మీ స్వార్థ రాజకీయాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి వ్యక్తి వైయ‌స్‌ జగన్ కాదు. 26 జిల్లాల ప్రయోజనాలను కాపాడే బాధ్యత, 26 జిల్లాల ప్రజల మనోభావాలను, వారి ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి.. అని కన్నబాబు చెప్పారు.  

Back to Top