మత్స్యకారుల వెన్నంటే వైయ‌స్ఆర్‌సీపీ

జువ్వలదిన్నె హార్బర్ ప్రైవేటీకరణపై మాజీ మంత్రి కాకాణి ఆగ్రహం 

 నెల్లూరు జిల్లా: మత్స్యకారుల హక్కుల పరిరక్షణలో వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పటికీ ముందుంటుందని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి స్పష్టం చేశారు. కావలి వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాకాణికి మత్స్యకారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం మత్స్యకారుల పొట్ట కొట్టడమేనని కాకాణి మండిపడ్డారు. పారిశ్రామిక అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి కట్టబెట్టి మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీయడాన్ని సహించబోమన్నారు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రారంభించి దాదాపు పూర్తిచేసిన ఈ హార్బర్ పనులను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తోందని ఆరోపించారు.

మొదటి విడతలో 79 ఎకరాల్లో సుమారు రూ.289 కోట్లతో అభివృద్ధి చేసిన హార్బర్‌లోని 29.5 ఎకరాలను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం దుర్మార్గమని, దీనివల్ల మత్స్యకారుల హక్కులు హరించబడుతున్నాయని అన్నారు. ఈ నిర్ణయం వెనుక భారీ ముడుపులు ఉన్నాయని కూడా ఆరోపించారు. హార్బర్ అందుబాటులోకి రాకపోవడం వల్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

బోట్ల చోరీ ఘటనపై కూడా కాకాణి తీవ్రంగా స్పందించారు. ఇది మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని, ప్రభుత్వ అనుమతి లేకుండా రాత్రికి రాత్రే బోట్ల తరలింపు జరగదని అన్నారు. అసలు సూత్రధారులను వదిలేసి పోలీసులను మాత్రమే బలి పశువులుగా మారుస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ ఏమీ చేయకుండానే శంకుస్థాపనలు చేయడం హాస్యాస్పదం అన్నారు. చంద్ర‌బాబు మత్స్యకారుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో మాత్రమే వారిని గుర్తు చేసుకుంటారని విమర్శించారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, దొంగిలించిన బోట్లను సీజ్ చేసి తిరిగి హార్బర్‌లో ఉంచాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల హక్కుల కోసం వైయస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. మత్స్యకారులను తక్కువ అంచనా వేయొద్దు… వారికి వైయ‌స్ జ‌గ‌న్ నాయకత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుంది” అని కాకాణి పేర్కొన్నారు.
 

Back to Top