తాడేపల్లి: పథకాలకు కేటాయింపులు లేకుండా కూటమి ప్రభుత్వం ఏపీ బడ్జెట్‌ను రూ.41వేల కోట్లు పెంచిందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయించలేదని, బడ్జెట్‌లో కూటమి సర్కార్ రనౌట్ అయ్యిందన్నారు. బడ్జెట్‌లోనూ చంద్రబాబు రాజకీయాలు చేశారు. అబద్ధాలు. అవాస్తవాలు. వక్రీకరణలే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 5 నెలల తర్వాత ఎందుకు?: 2019లో మే 30న తమ ప్రభుత్వం ఏర్పడితే, కేవలం నెలన్నర రోజుల్లో జూలై 12న బడ్జెట్ ప్రవేశపెట్టామని, నిజానికి అప్పుడు తమకు ఇంత అనుభవం కూడా లేదని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత కోవిడ్ వంటి ఇబ్బందులున్నా వరసగా బడ్జెట్లు ప్రవేశపెడుతూ వచ్చామన్న ఆయన, ఈ ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ కోసం 5 నెలలు తీసుకుందని ఆక్షేపించారు. పైగా బడ్జెట్ స్పీచ్‌లో 21 సార్లు గత ప్రభుత్వాన్ని ప్రస్తావించారని విమర్శించారు. హామీల అమలు లేదు: ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదన్న మాజీ ఆర్థిక మంత్రి.. అప్పట్లో కూటమి అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి, ప్రతి వ్యక్తి వద్దకూ వెళ్లి.. నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు అంటూ ప్రచారం చేసి, ఆశ కల్పించారని గుర్తు చేశారు. వాలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, వారిని కూడా దారుణంగా మోసం చేశారని చెప్పారు. రూ.41వేల కోట్ల పెరుగుదల. ఎలా సాధ్యం?: ఈ బడ్జెట్ కేటాయింపుల్లో నేరుగా కనిపిస్తోంది ఒక్క దీపం పథకం మాత్రమే అని, అది కూడా సింగిల్ సిలిండర్ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 2024–25 వార్షిక బడ్జెట్ రూ.2,94,427 కోట్లు కాగా, గత ఏడాది సవరించిన మేరకు బడ్జెట్ రూ.2,53,500 కోట్లు అని గుర్తు చేసిన ఆయన, ఒకేసారి రూ.41వేల కోట్ల పెరుగుదల ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అందులోనూ ఒక్క దీపం పథకంలో సింగిల్ సిలిండర్ మినహా, సూపర్‌సిక్స్‌కే కేటాయింపు చూపలేదని చెప్పారు. అంటే సంక్షేమం లేకున్నా, రూ.41 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారని ఆక్షేపించారు. ఇక అమరావతి పనుల కోసం చూపిన రూ.15వేల కోట్లు.. గ్రాంటా? లేక అప్పా? అనేది ప్రశ్నార్థకమని అన్నారు. పన్ను ఆదాయం తగ్గింది: అలాగే పన్ను రాబడి రూ.24 వేల కోట్లు ఎక్కువ చూపిస్తున్నారన్న ఆయన, అది ఇప్పటికే మైనస్‌లో ఉండగా, ఆ పెరుగుదల ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కాగ్ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు చూస్తే.. పన్ను ఆదాయం తగ్గిందన్న బుగ్గన ఆ గణాంకాలు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పన్నుల ఆదాయంలో దాదాపు 11 శాతం పెరుగుదల నమోదు కాగా, మేలో –2.8 శాతం, జూన్ లో –8.9 శాతం, జూలైలో –5.3 శాతం, ఆగస్టులో –1.9 శాతం, సెప్టెంబర్ లో –4.5 శాతం.. అలా ఓవరాల్‌గా –2 శాతం ఆదాయం నమోదైందని చెప్పారు. ఈ నేపథ్యంలో పన్ను రాబడి ఏకంగా రూ.24వేల కోట్లు పెరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి: ఉద్యోగుల జీత భత్యాలు, ప్రభుత్వ ఇతర ఖర్చులతో పాటు, దీపం పథకంలో సిలిండర్ కోసం రూ.1.44 లక్షల కోట్లు అవసరం అవుతాయని, మరి ఆ ఆదాయం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అలాగే జీఎస్టీ ఆదాయంలో రూ.16 వేల కోట్ల నుంచి రూ.21,500 కోట్ల పెరుగుదల ఎలా సాధ్యమని అన్నారు. ఇంకా స్టాంప్స్–రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.4 వేల కోట్ల నుంచి రూ.9,500 కోట్లు, సేల్స్ ట్యాక్స్ పన్ను రూ.8,500 కోట్ల నుంచి రూ.16వేల కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.8వేల కోట్ల నుంచి రూ.17,500 కోట్లు, ఇతర పన్నులు రూ.2400 కోట్ల నుంచి రూ.5700 కోట్లు వస్తాయని ఎలా అంచనా వేస్తున్నారని ప్రశ్నించారు. ఇంకా తొలి ఆరు నెలల్లో రాబటి రూ.41,500 కోట్లు అయితే, మిగిలిన ఆరు నెలల్లో రూ.78వేల కోట్ల ఆదాయం ఎలా సాధ్యమని నిలదీశారు. నెట్ పబ్లిక్ అకౌంట్.. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం వద్ద ఉంటాయో.. దాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.1800 కోట్లకు తగ్గిస్తాం అంటున్నారన్న మాజీ మంత్రి, ఆ ప్రకారం వాళ్లకు ఉన్న పెండింగ్ ప్రావిడెంట్ ఫండ్ లాంటివి అన్నీ కట్టేయాలని, మరి ఈ 5 నెలల్లో ఆ పని చేశారా? అని ప్రశ్నించారు. యువగళం కింద యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అని చెప్పారని గుర్తు చేసిన బుగ్గన, మరి ఆ మేరకు బడ్జెట్‌లో కేటాయించారా అని నిలదీశారు. తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15 వేలు ఇస్తామని చెప్పినా, బడ్జెట్‌లో స్పష్టంగా కేటాయింపులు లేవంటూ.. బ్యాక్‌వర్డ్ క్లాసెస్‌లో రూ.2,400 కోట్లు తల్లికి వందనం అని, ఎకనమిక్ వీకర్ సెక్షన్‌లో రూ.1160 కోట్లు తల్లికి వందనం అని చెప్పారని, అవన్నీ చూసినా పూర్తి కేటాయింపు రూ.5300కోట్లు మాత్రమే అని చెప్పారు. వాస్తవానికి తల్లికి వందనంలో 83 లక్షల మంది పిల్లలకు ఇవ్వాలంటే రూ.12,450 కోట్లు కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు కేటాయించిన మొత్తం ఎంత మందికి సరిపోతుందని ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రస్తావించిన ఆయన, దాన్ని మెకనాస్ గోల్డ్ మాదిరిగా వెతకాల్సి వస్తోందని చెప్పారు. బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1000 కోట్లు కేటాయింపు కనిపిస్తోందన్న ఆయన, అందులో వ్యవసాయ మంత్రి మాట్లాడిన దాని ప్రకారం రూ.4500 కోట్లు, రూ.3500 కోట్లు పీఎం కిసాన్ వచ్చేది కలిపి.. అలా వెయ్యి కోట్లు బడ్జెట్ నుంచి ఇచ్చి.. మేం చేసేశాం అంటున్నారని ఆక్షేపించారు. నిజానికి అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన రైతులు 53.53 లక్షల మంది ఉన్నారని, వారికి పెట్టుబడి సాయం చేయాలంటే రూ.10,706 కోట్లు కావాలని, అలాంటప్పుడు రూ.1000 కోట్లతో పథకం అమలు ఎలా సా«ధ్యమని ప్రశ్నించారు. ఇక దీపం పథకం కోసం కేటాయించిన మొత్తం రూ.895 కోట్లు కాగా, రాష్ట్రంలో 1.5 కోట్ల కుటుంబాల్లో 1.42 కోట్ల రేషన్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. ఆ ప్రకారం చూస్తే, ఈ బడ్జెట్‌లో వారికి ఒక సిలిండర్ ఇవ్వాలంటే, 95 లక్షల కుటుంబాలకే ఇవ్వడం వీలవుతుందని తెలిపారు. మరి మిగిలిన వారి సంగతేమిటని ప్రశ్నించారు. ఈ పథకాల వాస్తవ గణాంకాలు ఇలా ఉంటే.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం వంటి అన్ని పథకాలు అమలు చేసినట్లు ఎలా చెబుతారని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నిలదీశారు. ఈ పథకాల ఊసే లేదు: ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500. అంటే ఏడాదికి రూ.18 వేలు అని, అయితే ఈసారి ఆ ఊసే లేదని చెప్పారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రూ.37,300 కోట్లు కావాలన్న ఆయన, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పథకానికి అర్హులు రాష్ట్రంలో 2,07,30,000 మంది ఉండగా, వారికి ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారని, కానీ ఈ బడ్జెట్‌లో దాన్ని ప్రస్తావించలేదని గుర్తు చేశారు. అసలు ఆ పథకాం అమలు చేస్తారా? లేదా? చేస్తే ఎప్పటి నుంచి అమలు చేస్తారు? అన్నది చెప్పలేదని తెలిపారు. ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వానికి వాళ్ల బాధ్యత చెప్పడం తమ బాధ్యత అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. పవర్ సెక్టర్. వాస్తవ గణాంకాలు: 2024–25లో మీరు పవర్ సెక్టర్‌కు మీరు కేటాయించింది రూ.8,100 కోట్లు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు 2018–19లో విద్యుత్ సబ్సిడీ కింద రూ.2,138 కోట్లు మాత్రమే ఇస్తే, మా ప్రభుత్వం వచ్చాక 2019–20లో రూ.11,600 కోట్లు, 2020–21లో కోవిడ్ ఇబ్బందుల్లో కూడా రూ.6,110 కోట్లు, 2021–22లో రూ.11,500 కోట్లు, 2022–23లో రూ.18,250 కోట్లు, 2023–24లో ఇంచుమించు రూ.15,000 కోట్లు ఇస్తే మీరు రూ.8,100 కోట్లు ఇస్తారా?. గవర్నమెంట్ డిమాండ్.. 2014–15 నుంచి 2018–19కి సంబంధించి రూ.31,800 కోట్లు ప్రభుత్వం డిస్కంలకు కట్టాల్సి ఉండగా, అప్పుడు మీరు కట్టింది రూ.20,165 కోట్లే. 2019–20 నుంచి 2023–24 డిసెంబర్ వరకు చూస్తే గవర్నమెంట్ డిమాండ్ రూ.68 వేల కోట్లు ఉంటే రూ.62 వేల కోట్లు కట్టడం జరిగింది. అంటే మీరు 5 ఏళ్లలో రూ.31,800 కోట్లు కడితే, ఆ 5 ఏళ్లకు ఇంకా 4 నెలలు తక్కువలోనే మేము రూ.62 వేల కోట్లు కట్టడం జరిగింది. ప్రభుత్వం బకాయిలు కడితేనే సంస్థలు ప్రాఫిట్‌లో నడుస్తాయి. మీరు కట్టనందుకు నష్టాల్లోకి పోతే, మేము కట్టినందుకు మీరు వచ్చి మాకు చిత్తశుద్ధి లేదంటారు. హామీల అమలు ఏనాడూ లేదు: ప్రతి ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇస్తున్న టీడీపీ, ఆ తర్వాత వాటిని పూర్తిగా వదిలేయడం ఆనవాయితీగా వస్తోందన్న మాజీ మంత్రి, ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లో అవే హామీలు ఇస్తోందంటూ.. వాటిని ప్రస్తావించారు. 2014 ఎన్నికలది ఓసారి చూద్దాం. వ్యవసాయ రుణాల మాఫీ అన్నారు. అందుకు రూ.87,612 కోట్లు అవసరం కాగా, మీరు రూ.15వేల కోట్లకు అటు ఇటు ఇచ్చారు. అలాగే రైతులకు సున్నా వడ్డీ రుణాలు అన్నారు. మీరు చెప్పినట్లు చేసి ఉంటే రూ.11,600 కోట్లు అవసరం అయితే, కానీ, మీ హయాంలో అందుకోసం చేసిన వ్యయం కేవలం రూ.630 కోట్లు మాత్రమే. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, చిట్ట చివర 2019 ఎన్నికల ముందు అందుకు కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణ మాఫీ, సున్నా వడ్డీ అన్నారు. మీరు ఇవ్వాల్సినది రూ.21,500 కోట్లు అయితే, సున్నా వడ్డీ రుణాల కోసం ఏమీ ఇవ్వకపోగా సున్నా వడ్డీ రుణాలు రూ.3,036 కోట్లు కూడా మీరు ఎగరగొట్టారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ అన్నారు. కాపులకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు అన్నారు. కానీ ఇచ్చింది కేవలం రూ.1340 కోట్లు. ఇక చేనేత రుణాలు, పవర్ లూమ్స్ విషయం తెలిసిందే. ఏ కేటాయింపులు, ఖర్చు లేనే లేదు. నిరుద్యోగ యువకులకు రూ.1000 నుంచి రూ.2000 వరకు భృతి ఇస్తామన్నారు. ఏమీ ఇవ్వకపోగా 2019 ఎన్నికల ముందర కొద్దిగా ఉండీ లేక ఎవరికిచ్చారో తెలిదన్నట్లు ఇచ్చారు. ఎప్పుడూ అవే హామీలు!: రాజకీయాల్లో కొత విధానాన్ని తెచ్చిన చంద్రబాబు.. 1999 నుంచి 2024 వరకు ప్రతి ఎన్నికల్లో అవే హామీలు ఇస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆనాడు అసెంబ్లీలో వైయస్సార్‌గారు మాట్లాడిన వీడియోను ఆయన ఆ సందర్భంగా ప్రదర్శించారు. అలా ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను నమ్మించి, మోసం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ ఏనాడూ మాట తప్పలేదు: అదే తమ పార్టీ ఏనాడు అలవి కాని హామీలు ఇవ్వలేదని, ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదని మాజీ మంత్రి బుగ్గన వెల్లడించారు. అంతే కాకుండా ఏ పథకాల అమలుపై క్యాలెండర్ ప్రకటించి, పక్కాగా అమలు చేశామని ఆయన తెలిపారు. 2023–24లో వైయస్ఆర్ పెన్షన్ కానుక ఎంత? రూ21,434 కోట్లు.. వైయస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు, జగనన్న విద్యాదీవెన రూ.2,841 కోట్లు, జగనన్న వసతి దీవెన రూ.2,200 కోట్లు, వైయస్ఆర్, పీఎం ఫసల్ బీమా యోజన రూ.1600 కోట్లు, వైయస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టూ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ రూ.700 కోట్లు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టూ అర్బన్ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ రూ.300 కోట్లు, వైయస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు, వైయస్ఆర్ జగనన్న తోడు రూ.350 కోట్లు, అక్క చెల్లెమ్మలకు వైయస్ఆర్ ఆసరా రూ.6,700 కోట్లు, వైయస్ఆర్ చేయూత రూ.5 వేల కోట్లు, అమ్మ ఒడి రూ.6,500 కోట్లు.. ఇలా ప్రతిదీ పక్కాగా, శాచురేషన్ పద్ధతిలో అమలు చేశామని చెప్పారు. ఇంకా గత 5 ఏళ్లలో ఒక్క జగనన్న అమ్మ ఒడికి రూ.26,067 కోట్లు, వైయస్ఆర్ రైతు భరోసా కింద రూ.34,378 కోట్లు.. లబ్ధిదారుల సంఖ్య చూస్తే.. అమ్మ ఒడికి 44,48,865 మంది లబ్ధిదారులు, రైతు భరోసాకు 53,58,366 రైతు సోదరులు. చేయూతకు 26,98,931 మంది లబ్ధిదారులకు రూ.19,189 కోట్లు ఖర్చు పెట్టాం. వైయస్ఆర్ ఆసరా 78,94,169 మంది లబ్ధిదారులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.25,570 కోట్లు అందించామని తెలిపారు. కోవిడ్ కష్టకాలంలో కూడా..: కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, కొంత సమయం తీసుకుని, పథకాలు అమలు చేద్దామని సీఎం వైయస్ జగన్‌కు విజ్ఞప్తి చేస్తే.. ఆయన ఒకే మాట అన్నారంటూ.. దాన్ని ప్రస్తావించారు. ‘ఇది అక్క చెల్లెమ్మలు, రైతులు, పేదలకు ఇచ్చిన మాట. ఏమాత్రం నేను చేయలేకపోతే.. తక్షణమే కుర్చీ వదిలేసి దిగిపోతా’.. అని జగన్‌గారు తేల్చి చెప్పడంతో, తాను, ఆఫీసర్లు అందరూ కూర్చుని.. రాత్రనకా.. పగలనకా..అంతా కష్టపడి వాటిని సకాలంలో అమలు చేశామని చెప్పారు. గత ఎన్నికల ముందు కూడా..: చివరకు, గత ఎన్నికల సమయంలో ఆసరా, చేయూత డబ్బులు విడుదల చేయకుండా, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ ఆ పథకాల అమలుకు అడ్డుపడితే, ఓటింగ్ ముగిసిన తర్వాత, ఫలితాలు వెలువడక ముందే అమలు చేసిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. అప్పులపై తీవ్ర దుష్ప్రచారం: 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా రాష్ట్ర అప్పులపై అదేపనిగా తీవ్ర దుష్ప్రచారం చేశాయని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. ‘శ్రీలంకలా ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో.. (ఈనాడు, చంద్రబాబు).. వైయస్ఆర్‌సీపీ హయాంలో అప్పుల పిడుగు (ఏబీన్, ఆంధ్రజ్యోతి), చేతగాకే అప్పులు..చంద్రబాబు, అప్పులు అడుక్కోవడానికేనా మీరు ఢిల్లీకి పోయేది.పవన్ కల్యాణ్.. ఇప్పుడు మీరు ఢిల్లీకి పోతోంది అప్పులు అడుక్కోవడానికేనా?’ ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షల కోట్లు.. 25–10–2023న పురంధేశ్వరిగారు.. 07–04–2024న రాష్ట్ర అప్పులు రూ.12,50,000 కోట్లు.. అంటే 5 నెలల్లోనే లక్షన్నర కోట్లు పెంచుతారా అమ్మా? చూసుకుంటున్నారా ? లేదా అమ్మ.. కొంచెం మీరు ఏం మాట్లాడుతున్నారో.. రాసిపెట్టుకుంటే మంచిదేమో.. డౌట్ ఉంటే రాసిపెట్టుకోవడం మంచిది.. ఏదో అనడం..మళ్లా మార్చడం’.. అంటూ తీవ్ర దుష్ప్రచారం చేశారని ఆయన తెలిపారు. వాస్తవాలు ఈరోజు చూపారు: కానీ వాస్తవం ఏమిటన్నది ఈరోజు అసెంబ్లీలో చూపించారు. రాష్ట్ర అప్పు రూ.6.46 లక్షల కోట్లుగా చూపారు. మార్చి 31, 2024 నాటికి. రూ.4.91 లక్షల కోట్లు, గ్యారంటీ కింద తెచ్చిన అప్పు రూ.1,54,797 కోట్లు. రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు.. మరి ఆనాడు ప్రచారం చేసినట్లు రూ.14 లక్షల కోట్ల అప్పు ఏది? అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారా?. కార్పొరేషన్ల అప్పులతో ప్రభుత్వానికి ఏం సంబంధం? అలాగే డిస్కంల అప్పులతో ప్రభుత్వానికి ఎలా సంబంధం?. పౌర సరఫరాలు, విద్యుత్ రంగం.. రూ.34 వేల కోట్లు. దాన్ని డబుల్ ఎంట్రీ చేశారు. ఔట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్స్ అండ్ స్కీమ్స్.. ఎవరికో కట్టవలసినవి రూ.1,13,000 కోట్లు. మరి ఇవన్నీ బడ్జెట్‌లో ఎందుకు చూపలేదు? అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఎంత వరకు సబబు?. చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: అప్పుడు మేము ప్రజెంట్ చేసిన డెట్‌కు ఇప్పటికీ తేడా ఎంత? 2023–24లో రూ.4,83,000 కోట్ల అప్పు చూపాము. ఇప్పడు మీ బడ్జెట్‌లో అదే డెట్‌ను రూ.4,91,00 కోట్లుగా చూపారు. మరి అలాంటప్పుడు ఏకందా రూ.14 లక్షల కోట్ల అప్పు అని ఎలా దుష్ప్రచారం చేస్తారు?. వారం కింద కూడా బడ్జెట్ ప్రిపేర్ అవుతుందని తెలిసి కూడా చంద్రబాబు ఏపీ అప్పుల గురించి దారుణంగా అబద్ధాలు చెప్పారు. దీనికి మీరు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీ హయాంలోనే అప్పులు పెరిగాయి: 2019–2024 వరకు మేము కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో లేకపోయినా కూడా కష్టపడి తిరిగి ఎన్నో సాధించాం. మీరు భాగస్వాములై ఏం సాధించారండి. అసలు అప్పులు పెంచింది మీరు. 2014లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు రూ.1,32,000 కోట్లు ఉంటే.. 2019లో మీరు దిగిపోయేటప్పటికి ఆ అప్పు రూ.3,31,000 కోట్లు అయింది. అంటే ఐదేళ్లలో ఏటా సగటున 20 శాతం పెరిగింది. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పు రూ.3,31,000 కోట్లు కాగా, మేము 2024లో దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.6,46,531 కోట్లు. అంటే ఏటా పెరిగిన అప్పు 14.9 శాతమే. అంటే మీ హయాంలో కంటే మా హయాంలో తక్కువ అప్పులు చేశాం. చివరగా.. బడ్జెట్ ఎలా ఉందో సింపుల్ గా చెప్పాలంటే.. ఒక నాయకుడిగా వైయస్ జగన్‌గారు ఏం చెప్పారు.. నేను చేప్పేది ఖచ్చితంగా చేయాలి.. నేను చేయలేనిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను అన్నారు.. అది ఒక నాయకుడి లక్షణం. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ అగమ్యగోచరంగా ఉంది. ఒక్క దీపం పథకంలో అది కూడా ఒకే సిలిండర్.. అతి తక్కువ మంది లబ్ధిదారులకు మాత్రమే.. తప్ప సూపర్‌సిక్స్‌లో ఏమీ లేదు. ఇదీ వాస్తవ పరిస్థితి. దీన్ని ప్రజలంతా గమనించాలని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.