తాడేపల్లి: మార్గదర్శి చిట్స్ కేసుల్లో సీఐడీ అప్పీళ్ల ఉపసంహరణ కచ్చితంగా క్విడ్‌ప్రొకో అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. రామోజీ కుటుంబాన్ని, ఆయన సంస్థలను కాపాడడమే చంద్రబాబు లక్ష్యం అన్న రాంబాబు.. రామోజీరావు అనేక అక్రమాలకు పాల్పడిన వ్యక్తి అని, ఆర్ధిక నేరస్తుడని, వైట్ కాలర్ క్రిమినల్ అని అభివర్ణించారు. చంద్రబాబు కోసం రామోజీ సంస్ధలు.. రామోజీ సంస్ధల కోసం చంద్రబాబు పని చేస్తారన్న ఆయన, ఇది కచ్చితంగా క్విడ్‌ప్రొకో కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ క్విడ్‌ప్రొకోపై తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీ చేసిన అనేక అక్రమాలు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బయట పడ్డాయని, వాటన్నింటిపై వివిధ కోర్టులలో కేసులు నమోదు చేయడం జరిగిందని మాజీ మంత్రి చెప్పారు. ఆ కేసులపై హైకోర్టులో అప్పీల్ పిటీషన్‌పై విచారణ జరుగుతోండగా, ప్రభుత్వం ఆ కేసుల విత్‌డ్రా ప్రక్రియకు పాల్పడిందని, న్యాయవ్యవస్థలో ఇదొక విచిత్రమని అన్నారు. రామోజీరావుపై కేసును చంద్రబాబు ప్రభుత్వం విత్‌డ్రా చేసి, క్లీన్ చిట్ ఇవ్వడం అనేది క్విడ్‌ప్రొకో కాదా? అని నిలదీశారు. రామోజీ అక్రమాలను ఎవరు ప్రశ్నించినా, దాన్ని మీడియాపై దాడిగా ప్రచారం చేసేవారన్న అంబటి, గతంలో వైయస్సార్‌గారి హయాంలో కూడా అదే జరిగిందని తెలిపారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో అన్నీ డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా ప్రజలకు అందితే.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే అంతా డీపీటీ (దోచుకో పంచుకో తినుకో) అని చెప్పామని.. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. చిట్‌ల నిర్వహణలో మార్గదర్శి అన్ని నియమాలు ఉల్లంఘించిందని, వాటన్నింటిపై పక్కా ఆధారాలు దొరికాకే, సీఐడీ చర్యలకు దిగిందని మాజీ మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల్లోని మార్గదర్శి కార్యాలయాల్లో వసూలైన డబ్బును హైదరాబాద్ తరలించారని, వాటిని తమ గ్రూప్‌లోని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించారని చెప్పారు. రామోజీ గ్రూప్‌లోని పెట్టుబడులన్నీ చట్ట వ్యతిరేక డిపాజిట్లు, చిట్‌ఫండ్ గ్రూప్స్‌లోని కస్టమర్ల సొమ్ము అని వెల్లడించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ఆఫీసులు కేంద్రంగా ఫైనాన్స్ కంపెనీ నడిపిన రామోజీరావు చట్ట విరుద్ధంగా హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్) సర్టిఫికెట్స్ ఇస్తూ, చట్ట విరుద్ధంగా వేల కోట్ల డిపాజిట్లు సేకరించారని, దీన్ని ఆర్బీఐ కూడా తీవ్రంగా తప్పు పడుతూ, హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని గుర్తు చేశారు. మార్గదర్శిపై నాడు వైయస్ఆర్ హయాంలో నమోదైన కేసును, రాష్ట్ర విభజన జరిగి ఉమ్మడి హైకోర్టు విడిపోతున్న చివరి రోజు, 2018 డిసెంబర్ 31న కొట్టి వేశారని అంబటి గుర్తు చేశారు. అయినా ఆ విషయం బయటకు రాలేదని, వ్యవస్థల మేనేజ్‌మెంట్‌లో రామోజీ, చంద్రబాబు వ్యవహారాలకు ఇది నిదర్శనమని అన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శి చిట్‌ఫండ్‌పై కేసుల ఉపసంహరణపై సీఐడీ అప్పీల్ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. రామోజీ ఈరోజు లేకపోయినా, ఆయన తన ప్రయోజనాల కోసం యథేచ్ఛగా చట్టాలు ఉల్లంఘించారన్న మాజీ మంత్రి, ఆ కుటుంబానికి ఇప్పుడు సీఎం చంద్రబాబు సహాయపడుతున్నారని, అది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలు మర్చిన చంద్రబాబు, గత ఎన్నికల్లో తనకు సాయం చేసిన వారిని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అంబటి ఆక్షేపించారు. మీడియా ప్రశ్నలకు సమాధానంగా..: అదే బాబు రాజకీయ జీవితం: ఎంపీల ఫిరాయింపులు కొత్తేం కాదన్న అంబటి రాంబాబు.. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కొనడం, అమ్ముకోవడమే అన్నారు. ఎవరెన్ని పార్టీలు మారినా తమ పార్టీని ఏం చేయలేరని, తమ ఓటు బ్యాంక్ 40 శాతం చెక్కుచెదరలేదని గుర్తు చేశారు. జత్వానీ కేస్ బూమరాంగ్ ఖాయం: వైయస్ జగన్‌గారికి సన్నిహితుడన్న ఒకే ఒక కారణంతో సజ్జల రామకృష్ణారెడ్డిపై ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. జత్వానీ కేసులో ప్రభుత్వం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదాలనుకుంటోందని వ్యాఖ్యానించారు. ఆ కేసులో ఏదో చేయాలనుకుని గాలి మేడలు కడుతున్నారన్న అంబటి, అది కచ్చితంగా ప్రభుత్వానికి బూమరాంగ్ అవుతుందని స్పష్టం చేశారు. నిజాలు నిదానంగా బయటకు వస్తాయని, అయినా ఏదో చేయాలన్న దుర్మార్గమైన ఆలోచన ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు చేస్తున్నారని ఆక్షేపించారు. అధికారులపై కక్ష సాధింపు: చంద్రబాబును అరెస్టు చేసిన అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వంలో కనిపిస్తోందని, అందుకే వారి మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. అందుకోసం అధికారులకు పార్టీల ముద్ర వేయడం దారుణమన్న ఆయన, ఇలాంటి ఉడత ఊపులకు తమ పార్టీ భయపడదని తేల్చి చెప్పారు.