ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వడం దారుణం

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

వైయ‌స్ఆర్ జిల్లా : కడప నగరంలో 2 ఎకరాల  ఆర్అండ్ బీ ప్రభుత్వ స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వడం దారుణమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మండిపడ్డారు.బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని పార్టీ కార్యాల‌యానికి ఎలా కేటాయిస్తారని ప్ర‌శ్నించారు. ప్రజలకు ఉపయోగ పడే స్థలాన్ని ఒక పార్టీకి దారాదత్తం చేయడం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. ప్రతి పార్టీకి కార్యాలయం ఉండాల్సిన అవసరం ఉంద‌ని, కడప నడిబొడ్డున 80 కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాన్ని టిడిపికి కేటాయించడాన్ని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుంద‌ని చెప్పారు. 99 ఏళ్ల వరకు లీజుకు కేటాయించడం పై అధికారులు ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌న్నారు. గతంలో 2014- 2019 మధ్యలో టీడీపీ కార్యాలయానికి కేటాయిస్తే వైయ‌స్ఆర్‌ సీపీ తరఫున కోర్టులో స్టే తెచ్చామ‌ని గుర్తు చేశారు. ప్రభుత్వ స్థలం దుర్వినియోగంపై మ‌రోసారి కోర్టును ఆశ్రయిస్తామ‌ని, న్యాయ‌పోరాటం ద్వారా ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం కాకుండా చూస్తామ‌ని అంజాద్‌బాషా పేర్కొన్నారు.

Back to Top