ఆధారాలు ఉంటే నిరూపించండి

మదనపల్లె ఘటనపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌

మదనపల్లె ఘటనతో నాకెలాంటి సంబంధం లేదు

ఆ కేసు ఎవరు దర్యాప్తు చేసినా నాకే ఇబ్బంది లేదు

ఎందుకుంటే నేనెలాంటి తప్పు, నేరం చేయలేదు

రాజకీయాల్లో మచ్చ లేకుండా ఉన్నాను. 7సార్లు గెల్చాను

ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో చెప్పాము

తొలి నుంచి చంద్రబాబు మాకు వ్యతిరేకిగానే ఉన్నారు

జిల్లాలో ఆయనను ఎదుర్కొని రాజకీయాల్లో ఉన్నాము

అందుకు కక్ష గట్టి, మదనపల్లె ఘటనను ఆపాదిస్తున్నారు

మాపై నిందలు వేస్తూ, అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు

నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. బురద చల్లుతున్నారు

కొందరు అధికారులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు

ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించండి. నిందలు మానండి

ఎల్లో మీడియాలో అసత్య కథనాలు. డిబేట్లలో కామెంట్స్‌

అన్నింటిపైనా పరువు నష్టం కేసులు వేయబోతున్నాను

చంద్రబాబు చేస్తున్న కుట్రలన్నింటినీ ఎదుర్కొంటాను

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్‌: మదనపల్లె అగ్ని ప్రమాద ఘటనలో తన ప్రమేయంపై ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేశారు. ఆ ఘటనతో తనకే మాత్రం సంబంధం లేదని, అందుకే ఎవరితో, ఏ దర్యాప్తు జరిపినా తనకేం ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేకండా గడిపానని, ఆస్తుల వివరాలన్నీ కూడా ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించామని ఆయన వెల్లడించారు.
    చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని, జిల్లాలో ఆయనను ఎదుర్కొని రాజకీయాలు చేస్తున్నందువల్లనే, ఇలా టార్గెట్‌ చేసి, కుట్రలతో తానెలాంటి తప్పు చేయకపోయినా, దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్షేపించారు.
    అదే పనిగా తన వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్‌ అస్సాసినేషన్‌) చేస్తున్నారని, వాస్తవాలతో సంబంధం లేకుండా, తమ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేసి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. దానికి వత్తాసుగా సీఎం మొదలు, మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తన దోషిత్వంపై ఏ ఆధారాలు లేకపోయినా, అదే పనిగా బురద చల్లుతున్నారని చెప్పారు.
    మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగి, రికార్డులు తగలబడ్డాయని చెబుతున్నారన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నిజానికి అవన్నీ ఎమ్మార్వో ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్‌ ఆఫీస్‌తో పాటు, చివరకు సచివాలయంలో కూడా ఉంటాయని గుర్తు చేశారు. మరోవైపు మదనపల్లెలో డేటా రిట్రీవ్‌ చేశామని అధికారులు చెబుతున్నారన్న ఆయన, అలాంటప్పుడు ఆ ఘటనలో కుట్ర కోణం ఏముందని.. అది కూడా మేమే చేశామని ఎలా అంటున్నారని నిలదీశారు.
    ‘మీ పార్టీ కార్యకర్తలు, నాయకులను అడ్డం పెట్టుకుని, వారితో మాపై తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారు. అలా మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారు. మరి వాస్తవాలు మీ దగ్గర ఉంటే, ఆధారాలు ఉంటే, వాటని నిరూపించండి. అంతే కానీ, తప్పుడు ఆరోపణలు చేసి చంద్రబాబు ఉచ్చులో దిగకండి’.. అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
    మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నారన్న ఆయన, తామే తప్పు చేయనందువల్ల, ఎవరు దర్యాప్తు చేసినా తమకెలాంటి భయం లేదన్నారు. వైయస్సార్‌సీపీ నాయకులను వేధిస్తూ, వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారితో తన పేరు చెప్పించే కుట్ర చేస్తున్నారని, దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు.
    తప్పుడు పనులు చేయాల్సిన అవసరం తనకు లేదన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను 7సార్లు ఎమ్మెల్యేగా గెల్చానని, తన కుమారుడు మూడుసార్లు ఎంపీ కాగా, తన తమ్ముడు కూడా 3సార్లు ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. ప్రజాదరణ ఉంది కాబట్టే, ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నామని తెలిపారు. 
    గతంలో చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల్లో చాలా మంది చనిపోయారని, ఈ ఎన్నికల తర్వాత చాలా మందిని హత్య చేశారని, ఇంకా అనేకచోట్ల చాలా మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయని గుర్తు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరి ఆ కేసులన్నింటిలో కూడా ప్రభుత్వం ఇంత వేగంగా ఎందుకు స్పందించలేదని సూటిగా ప్రశ్నించారు.
    మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరగ్గానే, ఏదో పెద్ద విపత్తు సంభవించినట్లు.. ఏకంగా డీజీపీని హెలికాప్టర్‌లో అక్కడికి పంపారన్న ఆయన, రాష్ట్రంలో గతంలో ఏనాడూ ఇలా జరగలేదని, ఇదంతా చంద్రబాబుగారు చేస్తున్న కుట్ర అని అభివర్ణించారు.
    ‘నేను 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు ఎలాంటి కళంక చరిత్ర లేదు. నాపై జరుగుతున్న కుట్రను ఎదుర్కొంటాను. నేను 
ఎవ్వరికీ భయపడను. ఎందుకంటే, ఏ తప్పూ చేయలేదు’.. అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
    గత 15 రోజులుగా ఒక వర్గం మీడియాలో తనపై విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన, టీవీ డిబేట్లలో దారుణంగా కామెంట్స్‌ చేస్తున్నారని.. వారందరిపై కేసులు వేయబోతున్నానని చెప్పారు.
    ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని సీఎం చంద్రబాబు, ఇలా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆక్షేపించారు. ఏమన్నా అంటే, ఖజానా ఖాళీ అంటున్నారని, అందుకే సూపర్‌సిక్స్‌ గురించి కూడా మాట్లాడడం లేదని తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉండగా, ఇప్పుడు చంద్రబాబు సీఎం అయినప్పుడు ఖజానాలో దాదాపు రూ.10 వేల కోట్లు ఉన్నాయని.. అయినా ఖజానా ఖాళీ అంటూ పదే పదే చంద్రబాబు చెబుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Back to Top