విశాఖ: అధికారంలోకి వచ్చిన నాలుగు మాసాల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం దాన్నుంచి ప్రజలదృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాలు ప్రజల్లో చర్చకు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి డైవర్షన్ కు పాల్పడ్డం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్టు అని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం విశాఖలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా సూపర్ సిక్స్ హామీల గురించి ప్రజల్లో చర్చకు వచ్చినప్పుడు తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వం... డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన అంశాన్ని గుర్తు చేశారు. అదే విధంగా విజయవాడ వరదల్లో ప్రజలను అప్రమత్తం చేయడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం... దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి బోట్లు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని మండిపడ్డారు. ఇక మద్యం పాలసీని ప్రకటించి... మద్యాన్ని ఏరులా పారించే కార్యక్రమానికి తెరలేపిన ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టిందన్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హత్యలకు, అత్యాచారాలకు అడ్డాగా మారిపోయినా ప్రభుత్వంలో స్పందన లేదని ఆక్షేపించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గంలో గ్యాంగ్ రేప్ జరిగితే కనీసం పరామర్శించడానికి తీరికలేని ఆయన... అన్‌స్టాపబుల్ షో లో బిజీగా ఉన్నారని వ్యాక్యానించారు. విజయనగరం జిల్లాలో డయేరియా చనిపోయిన 10 మందివి ప్రభుత్వ హత్యలేనని ఆయన స్పష్టం చేశారు. విపక్ష నేతలు డయేరియా బాధిత ప్రాంతాల్లోకి వెళ్లేంత వరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధ్యతారాహిత్య పాలనకు నిదర్శనమన్నారు. సుమారు ఏడాదిన్నర క్రితం జరిగిన హత్య కేసులో మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ని ముద్దాయిగా చేర్చితే తమ వైఫల్యాలను మర్చిపోయి... ప్రజలు దాని గురించి చర్చించుకుంటారన్న దురుద్దేశంతోనే అరెస్టు చేశారని తప్పుపట్టారు. ఈ అరెస్టు వెనుక రాజకీయకోణం ఉందని ఆయన తేల్చి చెప్పారు.