నెల్లూరు: ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రలోభాలు, కొనుగోళ్లు టీడీపీకి కొత్త కాదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీల అమలులో విఫలమైన చంద్రబాబు, ఇలా పార్టీ ఫిరాయింపులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఆయారాం, గయారాంలను తాము పట్టించుకోమన్న ఆయన, వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక దోపిడి చేస్తున్నారన్న కాకాణి, తమ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు ఇసుక రేటు మూడింతలు ఎక్కువగా ఉందని తెలిపారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం టీడీపీకి అలవాటని, 2014–19 మధ్య తమ పార్టీ నుంచి ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను సంతలో పశువులు కొన్నట్లు కొన్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. ఆ విధంగా తమ పార్టీని దెబ్బ తీయాలని చూస్తే.. 2019 ఎన్నికల్లో టీడీపీకి సరిగ్గా అవే సీట్లు దక్కాయని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ అవే కొనుగోళ్ళు మొదలుపెట్టారన్న ఆయన, ఈసారి ఇన్‌డైరెక్ట్ సేల్ జరుగుతోందని చెప్పారు. నిజానికి ఇప్పుడు టీడీపీకి అసెంబ్లీ, లోక్‌సభలో మంచి మెజారిటీ ఉన్నా, తమ పార్టీకి చెందిన 11 మంది రాజ్యసభ ఎంపీలపై ఎందుకు కన్నేశారో చెప్పాలని కాకాణి నిలదీశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ చేస్తున్న ప్రహసనం వల్ల కొరత ఏర్పడి నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి తెలిపారు. పేరుకే ఉచిత ఇసుక అయినా.. సరఫరా అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతోందని, వారు యథేచ్ఛగా దోపిడి చేస్తున్నారని చెప్పారు. మరోవైపు ఇసుక ధర కూడా దారుణంగా పెరిగిందన్న ఆయన, నెల్లూరులో ప్రస్తుత ఇసుక ధరలు ఉదహరించారు. గతంలో ఇసుక ట్రాక్టర్ రెండు యూనిట్లు రూ.5 వేలు ఉంటే, ఇప్పుడు మూడు రెట్లు పెరిగి రూ.14 వేల నుంచి రూ.15 వేలకు చేరుకుందని వెల్లడించారు. వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని సమీక్షించి, ధరలు తగ్గించకపోతే, ప్రజల పక్షాన పోరాడతామని కాకాణి హెచ్చరించారు.