తాడేపల్లి: అన్న క్యాంటీన్లపై టీడీపీ కూటమి ప్రభుత్వం కొత్త డ్రామా ఆడుతోందని, ఓ 300 మందికి భోజనాలు పెడుతూ, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారని, అలా అందరినీ మభ్య పెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్‌సిక్స్ హామీలను కాస్తా సూపర్‌చీట్‌గా మార్చేశారన్న ఆయన, పేదలకు అందాల్సిన పథకాలన్నింటినీ పక్కన పెట్టేశారని గుర్తు చేశారు. చాలా చోట్ల జన సంచారం లేని చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్న అంబటి రాంబాబు, ఆ క్యాంటీన్లకు పచ్చ రంగులు ఎలా వేస్తారని ప్రశ్నించారు. అవి పార్టీ ఏర్పాటు చేసినవి కాదు కదా? అని నిలదీశారు. గతంలో అన్న క్యాంటీన్ల నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగిందని, ఈ విషయాన్ని నిపుణుల కమిటీ నిగ్గు తేల్చిందని వెల్లడించారు. విద్య, వైద్యం ముఖ్యం: మెరుగైన విద్య, వైద్యం ద్వారా ఎన్నో మార్పులు వస్తాయని, నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు కూడా మారుతాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అందుకే ఆయా రంగాలకు గత ప్రభుత్వంలో వైయస్ జగన్‌గారు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని, కానీ ఇప్పుడు చంద్రబాబు వాటన్నింటినీ పక్కన పెట్టేశారని ఆక్షేపించారు. ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడంలో చంద్రబాబుగారిని మించిన వారు లేరన్న అంబటి రాంబాబు, అదే గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు వైయస్ జగన్‌గారు అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టి, అమలు చేశారని, ఆ దిశలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, మావన వనరులే సమాజానికి సంపద అని భావించి.. విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు, పోర్టులు, హార్బర్ల కోసం వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. మనకు సువిశాలంగా దాదాపు 1000 కి.మీ సముద్రతీరం ఉందని, అందుకే పెద్ద ఎత్తున పోర్టుల నిర్మాణం చేపట్టారని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన జగన్‌గారు, నాడు–నేడు మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మార్పులు చేశారని గుర్తు చేశారు. అమ్మ ఒడి కాపీ కొట్టిన చంద్రబాబు, దానికి తల్లికి వందనం అని పేరు పెట్టినా, దాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని ఆక్షేపించారు. వైద్య రంగం: మరోవైపు వైద్య రంగంలో కూడా నాడు జగన్‌గారు, ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్న అంబటి రాంబాబు, విలేజ్ క్లినిక్‌లు మొదలు, అర్బన్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు.. చివరకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు ఎన్నో మార్పులు చేశారని, ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, గత ఏడాది 5 కాలేజీలు ప్రారంభించారని గుర్తు చేశారు. దీని వల్ల 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి రాగా, ఈ ఏడాది రావాల్సిన 5 కాలేజీలు చంద్రబాబు నిర్వాకం వల్ల రాకుండా పోయాయని చెప్పారు. అన్న క్యాంటీన్లతో హంగామా: విద్యలో ఇంగ్లిష్ మీడియమ్‌తో పాటు, టోఫెల్ శిక్షణ కూడా మొదలుపెట్టగా, చంద్రబాబు, అధికారంలోకి రాగానే, వాటన్నింటినీ నిలిపేస్తున్నారని, ఇలా అన్ని పథకాలు వదిలేసి మళ్లీ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారని ప్రస్తావించారు. తాము ఆ క్యాంటీన్లను వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసిన అంబటి రాంబాబు, పేదలను ఆదుకునే అన్ని పనులు, కార్యక్రమాలు వదిలిపెట్టి, అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారని, రూ.5 కే భోజనం అంటూ, ఒక 300 మందికి అన్నం పెట్టి, దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. 2014–19 మధ్య రెండు దశల్లో 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయగా, వాటిలో 114 క్యాంటీన్లు ఊరికి దూరంగా, ఎక్కడ స్థలం దొరికితే అక్కడ కట్టారని గుర్తు చేశారు. ఎప్పుడూ రద్దీగా ఉండే బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులు, మార్కెట్ల వద్ద కాకుండా, దూరంగా ఏర్పాటు చేశారని తెలిపారు. అన్న క్యాంటీన్లు అవినీతిమయం: ‘అన్న క్యాంటీన్ల కోసం రూ.76.22 కోట్లు ఖర్చు చేశారు. నిజానికి అంత ఖర్చు కాదు. ముందు ఒక్కో క్యాంటీన్‌ను రూ.17.30 లక్షలతో నిర్మిస్తామని చెప్పి, టెండర్లు పిల్చారు. ఆ తర్వాత అనూహ్యంగా వ్యయం పెంచారు. చదరపు అడుగుకు రూ.2100 చొప్పున ఖర్చు అని మొదలుపెట్టి, దాన్ని ఏకంగా రూ.4585కు పెంచి, ఒక్కో క్యాంటీన్ నిర్మాణానికి రూ.37.55 లక్షలు ఖర్చు చేశారు. అలా అందులో కాంట్రాక్టర్లకు అదనంగా రూ.35.11 కోట్లు చెల్లించారు. అదే విధంగా వాటిలో హంగుల పేరిట రూ.18.22 కోట్లు కాజేసినట్లు నిపుణుల కమిటీ గుర్తించింది. అలా మొత్తం రూ.53.33 కోట్లు పక్కదారి పట్టించారు’. ఇంకా అన్న క్యాంటీన్లలో ఆహారం కూడా నాణ్యత లేకుండా సరఫరా చేశారు. మంచి ఆహారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని అంబటి రాంబాబు వివరించారు. పచ్చ రంగు ఎందుకు?: అన్న క్యాంటీన్లు పార్టీ ఏర్పాటు చేసినట్లు, అన్నింటికీ పచ్చ రంగు పులిమారని, నిజానికి ఆ ఖర్చు ప్రభుత్వం పెట్టుకుందని ఆయన గుర్తు చేశారు. తాము గతంలో కొన్ని పంచాయతీలకు తమ పార్టీ పతాకానికి దగ్గరగా ఉండే రంగులు వేస్తే.. టీడీపీ నాయకులు, చంద్రబాబుగారు అందరూ విమర్శించారని, చివరకు కోర్టులనూ ఆశ్రయించారని తెలిపారు. అదే ఈరోజు వాళ్లు అంతకు మించి పంచాయతీలకు పచ్చ రంగు వేస్తున్నారని, అన్న క్యాంటీన్లన్నింటికీ పచ్చ రంగు వేస్తున్నారని, ఇది ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలల్లోనే ప్రజలు.. ముఖ్యంగా పేదలు నానా ఇబ్బంది పడుతున్నారని, అన్ని పథకాలు ఆపేసి, ప్రజలకు మేలు చేయకుండా, ఏదో ఇంత అన్నం పెట్టి, వారిని మభ్య పెట్టాలనుకోవడం ఏ మాత్రం సరి కాదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. బొత్స గెలుపు తథ్యం: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మా పార్టీకి చెందిన బొత్స సత్యనారాయణ నిలబడగా, ఈ ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని చంద్రబాబుగారు ప్రకటించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రంగంలో ఉండగా, ఆయన విత్‌డ్రా చేసుకుంటే, బొత్సగారి ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని, ఒకవేళ ఎన్నిక జరిగినా, బొత్స గారి ఎన్నిక ఖాయమని చెప్పారు. చంద్రబాబుకు నైతికత ఉందా?: చంద్రబాబుగారు నైతిక విలువలకు కట్టుబడి, ఈ ఎన్నికలో అభ్యర్థిని నిలపకపోవడం వల్లనే, వైయస్సార్‌సీపీ గెలుస్తోందని.. ఒకవేళ పోటీ చేస్తే తామే గెలిచేవాళ్లమని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, హోం మంత్రి ప్రచారం చేస్తున్నారన్న ఆయన, చంద్రబాబు రాజకీయ జీవితమంతా అనైతికమే అని, ఆయన ఎక్కడా విలువలు పాటించలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి రావడం, ఆ పార్టీ అధినేత, మామ వెన్నుపోటు పొడిచి పదవి పొందడం, పార్టీని లాక్కోవడం.. అందరికీ తెలుసన్న ఆయన, ప్రతి ఎన్నికలో, ఏ మాత్రం నైతికత లేకుండా ఎవరో ఒకరితో పొత్తు.. తప్ప, ఆయన ఏనాడూ ఒంటరిగా పోటీ చేయలేదని గుర్తు చేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు..: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ.. చంద్రబాబు అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసన్న అంబటి, అలాంటి చంద్రబాబు నైతిక విలువలకు ఏనాడైనా కట్టుబడ్డాడా? అని నిలదీశారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఎన్ని చేసినా, గెల్చే అవకాశం లేనందువల్లనే చంద్రబాబు పోటీ నుంచి తప్పుకున్నారని చెప్పారు. నిజంగా చంద్రబాబు నైతిక విలువలకు కట్టుబడి ఉంటే.. మొన్న జీవీఎంసీలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఏం చేశారు? ఎంత దారుణంగా వ్యవహరించారో.. ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్న అంబటి రాంబాబు, ఆయన నైతిక విలువల గురించి మాట్లాడితే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని అభివర్ణించారు.