వైయ‌స్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వ అసత్య ప్రచారం

ఆయనకు ఏదైనా జరిగితే, ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

వైయ‌స్ జగన్ సెక్యూరిటీలో ల్యాండ్‌ క్రూజర్లు ఎక్కడున్నాయ్‌?

నారా లోకేష్‌ను సూటిగా ప్రశ్నించిన అంబటి రాంబాబు

బులెట్‌ ప్రూఫ్‌ కార్లు అన్నారు. కానీ ఇచ్చింది ఒక్కటే

అది కూడా షెడ్‌లో ఉన్న కారు. పూర్తిగా లోపభూయిష్టం

ఆయన 986 మందితో సెక్యూరిటీ కావాలని కోరుతున్నారా?

నాడు సీఎంగా ఉన్నప్పుడు జగన్‌గారి సెక్యూరిటీ 139 మందే

ఆ స్థాయిలోనే ఇప్పుడూ భద్రత కొనసాగించాలంటున్నారు

అంతే తప్ప, మీరు ప్రచారం చేస్తున్నట్లు 986 మందితో కాదు

బాధ్యత కలిగిన మంత్రి పదవుల్లో ఉండి ఇంత పచ్చి అబద్ధాలా?

లోకేష్, అనిత, అచ్చెన్నాయుడుకు చురకలంటించిన అంబటి 

వైయ‌స్ జగన్‌గారికి ఎక్కువ భద్రత ఉన్నట్లు గోబెల్స్‌ ప్రచారం

ఎస్‌ఆర్‌సీ మీటింగ్‌ జరగక ముందే సిబ్బంది తగ్గింపు

బులెట్‌ ప్రూఫ్‌ వాహనాలు ఇచ్చినట్లు ఎంతో ఆర్భాటం

ఉద్దేశపూర్వకంగానే టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు

ప్రెస్‌మీట్‌లో అంబటి రాంబాబు స్పష్టీకరణ

తాడేపల్లి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌గారి వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ఆయనపై చేస్తున్న ప్రచారం గర్హనీయమని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జగన్‌గారికి ఏదైనా అనుకోనిది జరిగితే, అందుకు కూటమి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు.
    మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ వ్యక్తిగత భద్రతపై టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమే కాకుండా, మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు ఆక్షేపించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసే నాటికి ఉన్న భద్రతను కొనసాగించాలంటూ, జగన్‌గారు హైకోర్టును ఆశ్రయిస్తే.. దానిపైనా  మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ట్వీట్‌ చేస్తున్నారని గుర్తు చేశారు.  
    జగన్‌గారికి జడ్‌ప్లస్‌ భద్రత కల్పించామని, అయితే గతంలో తనకు ఉన్న 986 మంది భద్రతా సిబ్బంది కావాలని ఆయన కోరుతున్నారని సీఎం చంద్రబాబుతో పాటు, హోం మంత్రి కూడా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. గతంలో జగన్‌గారికి 986 మందితో భద్రత ఉందని, టీడీపీ కరపత్రంగా ఉన్న ఎల్లో మీడియాలో చెప్పడం.. దాన్నే చంద్రబాబు మొదలు మంత్రులంతా ప్రస్తావిస్తూ.. పచ్చి అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.
    నిజానికి జగన్‌గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు సెక్యూరిటీగా ఉన్నది కేవలం 139 మంది మాత్రమే అన్న అంబటి రాంబాబు.. ఆ వివరాలు వెల్లడించారు. అయినా అప్పుడు జగన్‌గారు మొత్తం 986 మందిని సెక్యూరిటీగా పెట్టుకున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా ప్రచారం చేస్తోందని చెప్పారు. ఒక అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు అదే నిజమని అనుకోవాలనేది వారి ఉద్దేశంగా ఉందని అన్నారు.
    జగన్‌ గారు ఇప్పుడు సీఎం కాకపోయినా, ఆయన అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని.. తాను నెల్లూరు, పులివెందుల, వినుకొండ, విజయవాడ.. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఆయన్ను చూడటానికి, కలవడానికి కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ముందుకు తోసుకొస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు. ఇలాంటి పరిస్ధితుల్లో జగన్‌గారికి ఏ స్థాయిలో సెక్యూరిటీ ఉండాలనేది ఆలోచించాలని కోరారు.
    జగన్‌ గారు రాజీనామా చేయగానే ఎస్‌ఆర్‌సీ రిపోర్ట్‌ రాకుండానే సెక్యూరిటీని విత్‌డ్రా చేశారని, ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీని తీసేశారని, ఆ ఇంటికి వెళ్లే రూట్లలో ఉన్న చెక్‌పోస్టులు, పోలీస్‌ ఔట్‌పోస్టులను కూడా ఎత్తేశారని గుర్తు చేశారు. అంతే కాకుండా, జగన్‌గారి ఇల్లు, క్యాంప్‌ ఆఫీస్‌ ఉన్న రోడ్‌ను మొత్తం ఓపెన్‌ చేసి, అందరినీ అనుమతించారని చెప్పారు.
    ఈ పరిస్థితుల్లో కూటమి పార్టీల కార్యకర్తలు కొందరిని జగన్‌గారి ఇంటి గేటు వద్దకు పంపించి, గొడవలు చేయించారని, వాటన్నింటినీ తమ అనుకూల మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి, ఆయనను అప్రతిష్టపాల్జేసే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు.
    ఇంకా ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న నాయకుడు, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మాట్లాడుతూ.. ‘జగన్‌ చనిపోలేదు. ఓడిపోయాడు అంతే. ఆయన చనిపోతే తప్ప ఆ పార్టీ నాశనం కాదు’.. అని వ్యాఖ్యానించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఇవన్నీ చూసిన తర్వాతే తాము జగన్‌గారి భద్రత కోపం హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు.
    మంత్రి నారా లోకేష్‌ ట్వీట్‌ను ప్రస్తావించిన అంబటి రాంబాబు.. ‘చంద్రబాబు కుమారుడివి నువ్వు. మంత్రివర్గ సభ్యుడివి. ఇంకా అబద్దాలు ఎందుకు చెబుతున్నారు?. లోకేష్‌ గారు మీకు బుర్ర ఇంకా వికసించలేదనిపిస్తుంది. జగన్‌గారి కాన్వాయ్‌లో ల్యాండ్‌ క్రూజర్లు ఉన్నాయా?. మాకు ఎక్కడా కనిపించడం లేదే!. బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్లు అంటున్నావు!. కానీ ఇచ్చింది ఒకటి. అది లోపభూయిష్టమైంది. అది షెడ్‌లో ఉన్న కారు. నేను కూడా జగన్‌ గారితో కలిసి అందులో ప్రయాణించాను. వినుకొండ వెళ్ళేటప్పడు తాడేపల్లి దాటగానే ఏసీ పని చేయలేదు. వర్షం పడుతోంది. అద్దాలు మంచుతో ఉంటే దారి కనిపించక దిగి ప్రేవేట్‌ వాహనంలో వెళ్ళారు. ఈరోజు కోర్టులో మీ న్యాయవాదే ఆ కారు బాగాలేదని ఒప్పుకున్నది వాస్తవం కాదా?. అలాంటప్పుడు ఎందుకు అంత పచ్చి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు?’.
    ‘పది మంది సాయుధ గార్డులతో భద్రత అంటున్నారు. ఆయన వెంట ఉంటున్నది ఇద్దరే. పది మంది కాదు. గార్డులు ఇంటి చుట్టూ ఉంటారు. కానీ ఆయన వెంట వెళ్ళేది ఇద్దరే గార్డులు. మీకు మాత్రం చాలా మంది కావాలి. మరి జగన్‌గారికి వద్దా?. చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన బ్లాస్ట్‌లో సేవ్‌ అయ్యారు. అప్పుడు సెక్యూరిటీ తెచ్చుకున్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదే?’.
    ‘2004లో చంద్రబాబు ఓటమి పాలైన తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగా, రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యారు. అయినా ఎవరూ చంద్రబాబు సెక్యూరిటీ తగ్గించమని కోరలేదు. అది అప్పటి నుంచి అలాగే కొనసాగుతోంది. అదే ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీని అడ్డు పెట్టుకుని, అంగళ్లలో చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా పోలీసులపైనే దాడి చేయించారు. దాంతో ఒక కానిస్టేబుల్‌ కన్ను కూడా పోయింది’.
    ‘అసలు మీ భద్రత ఎప్పుడైనా తగ్గించారా?. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కరకట్టపై ఎంత సెక్యురిటీ ఉంది. ఎన్ని సెక్యూరిటీ పోస్ట్‌లు ఉన్నాయి. గుర్తు చేసుకొండి. కానీ ఇప్పుడు మాత్రం జగన్‌ గారి సెక్యూరిటీ తొలగించి ఏదో ఒకటి చేయాలని ఇష్టమొచ్చినప్పుడు మాట్లాడుతున్నారు’ అని అంబటి రాంబాబు ఆక్షేపించారు.
    ఇంకా ప్రజా సంకల్పయాత్ర జరుగుతున్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టు విఐపీ లాంజ్‌లో జగన్‌గారిపై హత్యాయత్నం జరిగితే, దాన్ని కోడికత్తి అని వ్యంగ్యంగా మాట్లాడారని, తర్వాత సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ ఎన్నికల ప్రచారంలో రాయి విసిరి దాడి చేస్తే, దాన్ని కూడా గులకరాయి అంటూ గోబెల్‌ ప్రచారం చేశారని అంబటి రాంబాబు గుర్తు చేశారు.
    జగన్‌ గారికి ఉన్న సెక్యూరిటీని ఎస్‌ఆర్‌సీ నిర్ణయం లేకుండా మార్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన, నారా లోకేష్‌కు ఎంత సెక్యూరిటీ ఉందో చూడాలంటూ.. 
లోకేష్‌ మంత్రిగా, ఎమ్మెల్యేగా కాకుండా చంద్రబాబు కుమారుడిగా ఉన్న సమయంలో పెద్ద సంఖ్యతో కూడిన సెక్యూరిటీతో ఉన్న ఫోటో.. ప్రదర్శించారు.
    రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించాలన్న అంబటి రాంబాబు, ఎవరూ, ఎక్కడా శాశ్వతం కాదని.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చని, బండ్లు ఓడలు అవుతాయని, ఓడలు బండ్లు అవుతాయని గుర్తు చేశారు.
    అందుకే తప్పుడు ప్రచారం చేసి జగన్‌గారిని పలుచన చేయాలని ప్రయత్నించవద్దని తేల్చి చెప్పారు. 
    ‘జగన్‌గారి గురించి నేను ఈ మధ్య ఒక మాట విన్నాను. ఒక పత్రిక కోర్‌ కమిటీ సమావేశంలో జగన్‌ గారి సెక్యూరిటీ తగ్గించాలి. ఆయన ఉంటే టీడీపీ బతకదు.. అని అన్నారని మాకు సమాచారం అందింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జామర్స్‌ విషయంలో కూడా కోర్టులో ప్రభుత్వం ఒకలా చెప్పింది’.. అని అంబటి రాంబాబు వెల్లడించారు.
    చంద్రబాబు ఇల్లు ఉన్న హైదరాబాద్‌లో ఆయన వీధిలో ఇప్పటికీ ఎవరినీ అనుమతించరన్న అంబటి, చివరకు చంద్రబాబు మనవడు దేవాన్ష్‌కు కూడా 6 గురు గన్‌మ్యాన్‌లు ఉండచ్చు కానీ.. జగన్‌ గారికి డొక్కు బుల్లెట్‌ప్రూఫ్‌ కారు ఇస్తారా?. అని నిలదీశారు.
    ‘లోకేష్‌ నువ్వు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్నావు. రెండు ల్యాండ్‌ క్రూజర్‌లు ఎక్కడున్నాయో చెప్పండి?. మీకు మాత్రం అంత మంది సెక్యూరిటీ కావాలి, జగన్‌ గారి విషయంలో మాత్రం అబద్దపు ప్రచారం చేస్తున్నారు’.. అని అంబటి చురకలంటించారు.

Back to Top