పేదల సొంతింటి కల నెరవేర్చడం మా ప్రభుత్వ లక్ష్యం

పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం

ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు విషప్రచారం

గత ఐదేళ్లలో టీడీపీ నిర్మించిన ఇళ్లు కేవలం 7,49,467 మాత్రమే

గృహం లేకుండా గృహ ప్రవేశం చేయించిన ఘనుడు చంద్రబాబు

ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలన్నది సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

రాజమండ్రిలో రూ.7 లక్షలకు ఎకరా భూమి చంద్రబాబు ఇప్పించగలరా..?

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్రంలో సొంతిల్లు లేనివారు ఎవరూ ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమని, ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని, తరువాత ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. లక్షల ఇళ్లు ఎలా నిర్మిస్తారని చంద్రబాబు బాధపడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా గ్రాఫిక్స్‌తోనే నడిచిందన్నారు. ఇళ్ల నిర్మాణం అంశంపై చంద్రబాబు తప్పుడు లెక్కలు చెబుతున్నాడన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఆయన ఏం మాట్లాడారంటే..

 • టీడీపీ ఐదేళ్ల పాలనలో 29.51 లక్షల మంజూరు చేశామని, దాంట్లో 9.1 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, మూడు దశల్లో 8 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు పూర్తయ్యాయని, మిగిలిన 20.41 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు. 
 • వాస్తవానికి 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు 6.85 లక్షల ఇళ్లు కట్టారు. 
 • 2004 నుంచి 2009 వైయస్‌ఆర్‌ పాలనలో 24.18 లక్షల ఇళ్లు కట్టించారు. 
 • 2010 నుంచి 2014 వరకు ఉన్న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం 11.13 లక్షల ఇళ్లు కట్టించింది. 
 • 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు కేవలం 7.50 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. 
 • ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానంలో భాగంగా మొదటి సంవత్సరం నుంచే మొదలుపెట్టి ఐదు సంవత్సరాల్లో 30 లక్షల ఇళ్లు కట్టాలని ఉద్దేశించి.. దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు కూడా వైయస్‌ఆర్‌ జయంతి రోజున ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 • 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నారనే బాధ టీడీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. అనుభవం ఉన్న చంద్రబాబు తీసుకున్న అంశం, చెప్పిన అంకెలు రెండూ తప్పుగా ఉన్నాయి. 
 • ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు 7.50 లక్షల ఇళ్లు కడితే.. ఈ ప్రభుత్వం 30 లక్షల ఇళ్లకు గానూ మొదటి సంవత్సరం దాటిన రెండు, మూడు నెలల్లోనే ప్లాట్లు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. 
 • 2014 నుంచి 2019 వరకు లెక్క వేస్తే.. గ్రామీణ హౌసింగ్‌ కింద 4 లక్షల 60 వేల చిల్లర, ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన గ్రామీణ్‌ కింద 47 వేల చిల్లర, ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన అర్బన్‌ బీఎల్‌సీ కింద 92 వేల చిల్లర, హుద్‌హుద్‌ హౌసింగ్‌ కింద 8 వేల చిల్లర, ఇందిరా ఆవాజ్‌ యోజన హౌసింగ్‌ కింద 1 లక్షా 40 వేల చిల్లర... మొత్తం కలిపితే 7,49,467 ఇళ్లు మాత్రమే కట్టించింది.   
 • 2014 నుంచి 2016 çవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హౌసింగ్‌ ప్రోగ్రామ్‌ లేదు. 2014–15లో 76,330, 2015–16లో 73,330 ఇందిరా ఆవాజ్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్‌ కింద కట్టడమే తప్ప.. ఒక్క ఇళ్లు కూడా గత ప్రభుత్వం కట్టలేదు. 
 • అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ఇళ్లను సర్వే చేయాలి.. తప్పిదాలు ఉన్నాయని చెప్పి.. జియోట్యాగింగ్‌ పేరుతో చంద్రబాబు ఐదేళ్లకాలం వెల్లదీశారు. జియోట్యాగింగ్‌ వల్ల ఏమైనా తేలిందా..? 
 • టీడీపీ హయాంలో గత ఐదేళ్లలో 7.50 లక్షలకు తక్కువగానే ఇళ్ల నిర్మాణం పూర్తయితే.. చంద్రబాబు మాత్రం 9.10 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని గొప్పలు చెప్పుకుంటున్నాడు. 16 లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చి 29.50 లక్షలు అని చెబుతున్నాడు. ఈ రకంగా తన పాలనలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల అంకెలు కూడా చంద్రబాబు తప్పుగా చెబుతున్నాడు. 
 • హౌసింగ్‌ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, స్థలాలు అమ్ముకుంటున్నారని చంద్రబాబు వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఒడిగట్టాడు. అడిగిన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నప్పుడు.. స్థలాలు అమ్మే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
 • ఇళ్ల స్థలాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.. లేదా వలంటీర్లు ఇంటికి వచ్చి అప్లికేషన్స్‌ తీసుకుంటారు. ఇళ్ల స్థలాల కోసం మూడు విడతల్లో అప్లికేషన్స్‌ తీసుకున్నారు. 
 • 2019 అక్టోబర్‌లో ఒకసారి, నవంబర్‌–డిసెంబర్‌లో, ఇంకోసారి 2020 జనవరిలో మూడు సార్లు సోషల్‌ ఆడిట్‌ జరిగింది. గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులు జాబితా చూపించాం. అర్హత ఉండి ఇళ్ల స్థలాల పంపిణీ జాబితాలో పేరు లేకపోతే తహసీల్దార్‌ దగ్గరకు వెళ్లండి.. అక్కడా న్యాయం జరగకపోతే ఆర్‌డీఓ దగ్గరకు.. స్పందనలో ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించాం. 
 • మూడుసార్లు సోషల్‌ ఆడిట్‌ జరిగితే 22 లక్షల మంది లబ్ధిదారులు తేలారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉండొచ్చు అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మే నెలలో దరఖాస్తుల స్వీకరణ చేపడితే 6 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు. పారదర్శకంగా.. ఇంత ప్రక్రియతో ఇళ్ల స్థలాలు పంపిణీకి సిద్ధం అవుతుంటే స్థలాలు అమ్ముకుంటున్నారని టీడీపీ ఆరోపణలు చేయడం దుర్మార్గం. వైయస్‌ఆర్‌ హయాంలో గృహ నిర్మాణాలపై కూడా చంద్రబాబు ఇలాంటి ఆరోపణలే చేశారు. 
 • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరేషన్‌కు చంద్రబాబు రూ.13 వందల కోట్లు పెండింగ్‌ బిల్లులు పెట్టారు. ఆర్బన్‌ హౌసింగ్‌లో రూ.3 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారు. మొత్తం రూ.4300 కోట్ల బకాయిలను తీర్చేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 
 • 2014 నుంచి 2016 వరకు హౌసింగ్‌ ప్రోగ్రామ్‌ ఏమీ చేయకుండా 2017–18లో మొదలుపెట్టి.. 2018–19లో ఎన్నికల ముందు టెంకాయలు కొట్టి ఇళ్లు ఇచ్చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నాడు. గృహమే లేకుండా గృహప్రవేశం చేయించి గ్రాఫిక్స్‌లతో ప్రచారం చేయించుకున్న ఘనుడు చంద్రబాబు. 
 • గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్‌ బిల్లులు కట్టి.. ఇళ్ల నిర్మాణాలను మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. మరి చంద్రబాబు ఇచ్చిన ఇళ్లా.. లేక సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన ఇళ్లా అనేది లబ్ధిదారులు ఆలోచన చేయాలి. 
 • రాజమండ్రి నగరం చుట్టూ 15 కిలోమీటర్ల మేర హౌసింగ్‌ కాలనీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. రాజమండ్రి ఎయిర్‌పోర్టు దగ్గర ఉండే బూరుగుపూడి, కాపవరం ప్రాంతాల్లో 587 ఎకరాలను ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సేకరించాం. రిజిస్ట్రేషన్‌ వాల్యూ రూ.7 లక్షల పైచిలుకు ఉండగా.. భూసేకరణ చట్టం ప్రకారం రూ.43 లక్షలు అవుతుంది. ఒకేచోట ఇంతపెద్ద ల్యాండ్‌ దొరకడం కష్టం కాబట్టి స్వల్పంగా 3 శాతం పెంచి రూ.45 లక్షలకు తీసుకోవడం జరిగింది. 
 • ఆ తరువాత 15–05–2020న కలెక్టరేట్, న్యూస్‌ పేపర్‌ ద్వారా ప్రకటన చేయడం జరిగింది. రాజమండ్రి సమీపంలో 17 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో గల ప్రాంతంలో ఎకరా భూమి రూ. 30 నుంచి 40 లక్షల వరకు ఇచ్చేవారు ఉంటే దయచేసి తెలియపరచండి అని ప్రకటన ఇస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఇంత పారదర్శకంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంటే.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని చూసి ఓర్వలేక చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారు. రాజమండ్రిలో ఎకరా  భూమి రూ.7 లక్షలకు, అంతకు పైగా ఉంటే.. చంద్రబాబు చూపించిన భూమి కొనుగోలు చేస్తాం’ అని ఆర్థిక మంత్రి బుగ్గన అన్నారు. 
   
Back to Top