8న రైతు దినోత్సవం

రైతులకు ప్రభుత్వం దన్నుగా ఉంటుంది

రైతు సంక్షేమానికి పునరంకితమవుతాం

శనగ రైతులకు  ఒక్కో క్వింటాల్‌కు అదనంగా 1500 చెల్లింపు

ఉచిత పంట బీమా పథకాన్ని ప్రారంభించనున్న సీఎం వైయస్‌ జగన్‌

వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు

అమరావతిః దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహించాలని సీఎం వైయస్‌ జగన్‌  నిర్ణయించారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆయన విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 8న‌  వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో జరిగే రైతు దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని తెలిపారు. మొత్తం ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేవిధంగా ఉచిత పంట బీమా పథకాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పునరంకితమవుతుందన్నారు.  దేశానికి రైతు వెన్ను ముక అని, ప్రభుత్వాలు రైతులకు ఆశించిన స్థాయిలో సేవలు అందించడంలేదని తెలిపారు.రైతులకు ప్రభుత్వం దన్నుగా ఉంటుందన్నారు.

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ  రైతు దినోత్సవం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో  రైతులకు అండగా ఉంటామని తెలిపారు.రైతు దినోత్సవ కార్యక్రమంలో రైతులకు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు వివరించనున్నట్లు తెలిపారు. రైతులకు అమలు చేసే పథకాలపై వివరిస్తామన్నారు. హెల్త్‌కార్డులను అందజేస్తామన్నారు. రైతు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి  రైతుల సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తామని తెలిపారు.  పులివెందులలో అరటి పరిశోధన కేంద్ర నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నష్టపోయిన శనగ రైతులకు ఆదుకునేందుకు ఒక్కో క్వింటాల్‌కు అదనంగా 1500 చెల్లిస్తామన్నారు. రైతులకు విత్తనాల సరఫరాపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష చేస్తున్నారు. వేరుశనగ విత్తనాల కొరతపై ప్రభుత్వం  వెంటనే స్పందించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో  జరిగే రైతు దినోత్సవం కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు,అధికారులు హాజరవుతారని తెలిపారు.

 

Back to Top