అన్నంపెట్టే రైతు ఆకలితో మాడుతున్నాడు

సాగుకు విరామం ప్రకటించాల్సిన దుస్థితి

రేపల్లె మున్సిపాలిటీలో రెండ్రోజులకోసారి 20 నిమిషాల తాగునీటి సరఫరా

రైతు పరిస్థితి, మత్స్యకారుల పరిస్థితి మార్చుతా

రేపల్లె: సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. హార్బర్‌ ఉన్న సంతోషమే కానీ, ఆ హార్బర్‌కు వెళ్లడానికి సరైన రోడ్డు కూడా లేదు. సబ్సిడీపై డీజిల్‌ లేదు, వైట్‌ కిరోసిన్‌ అందడం లేదు. అంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సమస్యలపై ప్రస్తావిస్తూ రేపల్లె ప్రజలకు భరోసానిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపల్లెకు చేరుకున్న వైయస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రస్తావించారు. తాగునీటికి కటకట, సాగునీరు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

రేపల్లె మున్సిపాలిటీ, రేపల్లె రూరల్‌ మండలాల్లో గానీ ఒక్కసారి అడుగుతున్నా.. రెండ్రోజులకు ఒకసారి తాగునీరంట. అది కూడా 20 నిమిషాలంట. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ పాలన సాగుతుంది. నిజాంపట్నం నగరం మండలాల్లో గతంలో రెండు పంటలు పండే ఈ ప్రాంతంలో ఇవాళ పంటలకు విరామం ప్రకటించిన దుస్థితి నెలకొంది. 15 వేల ఎకరాలకు సాగునీటికి కటకట అనే పరిస్థితి. నాన్నగారి హయాంలో 6 లిఫ్టులు పెట్టి 15 వేల ఎకరాలకు మేలు చేస్తే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరో 2 లిఫ్టులు పెట్టండి అని ప్రజలు గట్టిగా అడుగుతున్నా.. గట్టిగా కోరుకుంటున్నా.. కనీసం పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. నిజాంపట్నం రేవులో హార్బర్‌ ఉంది. పడవలు నిలుపుకోవడానికి అక్కడ స్థలం లేదు. సరైన రోడ్డు కూడా లేదు హార్బర్‌కు పోవడానికి, మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్, వైట్‌ కిరోసిన్‌ అందడం లేదు. వేట నిషేదం సమయంలో ఇవ్వాల్సిన రూ. 4 వేలు కూడా అందడం లేదు. ఇలాంటి పాలనను మనం చూస్తున్నాం. 

ఇదే రేపల్లెల్లో దాదాపు 18 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా.. ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఆక్వా రైతులు ఇవాళ నష్టంలో ఉన్నారా.. లాభాల్లో ఉన్నారా.. ఆలోచన చేయాలి. పంట చేతికి వచ్చే సమయానికి దళారులు ఏకమవుతున్నారు. రేట్లు  పడేస్తున్నారు. పంట చేతికి వచ్చే సరికి వ్యవసాయం, ఆక్వా రంగంలో ఇదే పరిస్థితి. కౌంట్‌ రొయ్యల ధర రూ. 270 ఉంటే కాని గిట్టుబాటు కాదు.. ఇప్పటికే రూ. 200లకు పడిపోయింది. ఏప్రిల్‌ వచ్చే సరికి ఏ స్థాయికి పడిపోతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారు. 

3648 కిలోమీటర్ల పాదయాత్ర సాగింది. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో పాదయాత్ర పూర్తి చేశాను. పాదయాత్రలో రైతన్న కష్టాన్ని చూశాను. బాధలు విన్నాను. రైతు పరిస్థితి చూస్తే ‘తాను కరిగిపోతూ మనకు వెలుగునిచ్చే కొవ్వత్తిలా అయిపోయింది’ రైతుకు మిగిలేది కష్టం. రైతుకు మిగిలేది నష్టం అన్నట్లుగా తయారైంది ఈ ఐదేళ్ల పాలన. నా సుదీర్ఘ పాదయాత్రలో మూడు ప్రాంతాల్లోని రైతుల కష్టాలు దగ్గర నుంచి చూశా.. అన్నం పెట్టే రైతు ఆకలితో మాడుతుంటే ప్రభుత్వం కాకపోతే ఆదుకునేవారు ఇంకెవరు ఉంటారనే ఆలోచన నా మనస్సులో సాగాయి. అంటూ ప్రస్తావించారు. 

 

తాజా వీడియోలు

Back to Top