వ్యవస్ధకు మేలు జరిగేలా ఫ్యాక్ట్ చెక్‌ పనిచేయాలి

ఏపీ ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్, ట్విట్టర్‌ అకౌంట్‌ను ప్రారంభించిన సీఎం  వైయస్ ‌జగన్

తాడేప‌ల్లి:  వ్య‌వ‌స్థ‌కు మేలు జ‌రిగేలా ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ప‌ని చేయాల‌ని  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు.  మీడియాలో, సోషల్‌మీడియాలో దురుద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం తరఫున ‘ఏపీ ఫ్యాక్ట్‌చెక్‌’  వేదిక కావాల‌ని చెప్పారు.  తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్, ట్విట్టర్‌ అకౌంట్‌ను శుక్ర‌వారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ..మీడియాలో , సోషల్‌మీడియాలో దురుద్దేశ పూర్వక ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికగా ప్రభుత్వం ఖండిస్తుంద‌ని చెప్పారు. జరుగుతున్న ప్రచారం ఎలా తప్పో సాక్ష్యాధారాలతో చూపిస్తారని పేర్కొన్నారు.

నిజమేంటో, అబద్ధం ఏంటో ఇందులో బ‌హిర్గ‌తం చేస్తార‌ని వెల్ల‌డించారు. దురుద్దేశపూర్వక ప్రచారం మీద అధికారులు కూడా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. దురుద్దేశ పూర్వకంగా ఈ ప్రచారం మొదట ఎక్కడ నుంచి మొదలయ్యిందో దాన్ని గుర్తించి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాల‌న్నారు.  ఒక వ్యక్తి ప్రతిష్టను, ఒక వ్యవస్థ ప్రతిష్టను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే హక్కు ఏ ఒక్కరికీ లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత ఉద్దేశాలతో వ్యవస్థలను భ్రష్టుపట్టించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. వ్యవస్థలను తప్పుదోవపట్టించే పనులు ఎవరూ చేయకూడదన్నారు. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా చేపడుతున్న కార్యక్రమాలపైన వ్యవస్థలను, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. వేరే కారణాలతో ఇలాంటి దురుద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నార‌ని అనుమానం వ్య‌క్తం చేశారు.

ఆలయాల్లో ఘటనలకు సంబంధించిన కేసుల్లో టీడీపీ వాళ్ళ ప్రమేయాన్ని విచారణలో నిర్ధారించారని తెలిపారు. ఇలాంటి వాటికి ఎక్కడో ఒకచోట ముగింపు పలకాలన్నారు. వాస్తవం ఏంటి, వాస్తవం కానిది ఏంటో ప్రజల్లోకి తీసుకెళ్ళాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు.  కార్య‌క్ర‌మంలో చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాద్‌ దాస్, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్) జి.వి.డి కృష్ణమోహన్, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌ రెడ్డి, డీఐజీ (టెక్నికల్‌ సర్వీసెస్‌) జి. పాలరాజు, ఏపి డిజిటల్‌ కార్పొరేషన్‌ విసి అండ్‌ ఎండీ చిన్న వాసుదేవరెడ్డి, చీఫ్ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ బ్ర‌హ్మానంద పాత్ర‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Back to Top