పోలవరం ప్రాజెక్టులో మ‌రో కీలక ఘట్టం

జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు ప్రారంభం

ప‌శ్చిమ గోదావ‌రి: అనుకున్న సమయానికే పోల‌వ‌రం ప్రాజెక్ట్  పూర్తి చేసేలా.. పక్కాప్రణాళికతో  పోలవరం ప్రాజెక్టు ఫలితాలను రాష్ట్ర ప్రజలకు అందించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం వడివడిగా అడుగులేస్తోంది. పోలవరం బహుళార్దక సాధక ప్రాజెక్టులో అత్యంతకీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను ఏపీ జెన్‌కో వేగవంతం చేసింది. ప్రతి ఏడాది గోదావరి నది నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంది. ఈ నీటిని సద్వినియోగం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వం  పోలవరం ప్రాజెక్ట్ తో పాటు జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని తలపెట్టింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే 194 టీఎంసీల నీటిని నిల్వ చేస్తారు. ఇందులో 120 టీఎంసీల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన 70 టీఎంసీలను  నిల్వ చేస్తారు. ఈ 120 టీఎంసీల నీటిని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా  తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజల సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగించవచ్చు.  

పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ కాల్వ‌ల కింద 10. 5 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది.  దీన్ని స్థిరీకరించేందుకు పోలవరం జల వ్రిద్యుత్ కేంద్రం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు వాడే నీటిని ఉపయోగిస్తారు.  గోదావరి నీటిని నిల్వ చేసే అవకాశాలు ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక పోలవరం ప్రాజెక్ట్ వద్ద తప్ప మరెక్కడా లేవు. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద నిల్వ అవకాశాలు ఉన్నా అది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పోలవరం వద్ద నీటిని నిల్వ చేసి పలు ప్రయోజనాలకు ఈ నీటిని వినియోగించనున్నారు. అందులో ఈ జల విద్యుత్ కేంద్రం ఒకటి.  గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా భారీ జల విద్యుత్ కేంద్రాలు లేవు. ఉన్న ఒకటి, రెండు కూడా చాలా తక్కువ సామర్ధ్యం తో ఉన్నాయి. . పోలవరంలో  ఉత్పత్తి చేసే విద్యుత్ వల్ల రాష్ట్రం  మిగులు సాధించే అవకాశం ఉంది. దీన్ని మన రాష్ట్ర అవసరాలు పోను విక్రయిస్తే ఆదాయం వస్తుంది. అదే సమయంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంది. దీనివల్ల  ప్రజలకు ముఖ్యంగా ఉపాధి  అవకాశాలు పెరగనున్నాయి.  అంతకంటే ప్రధానంగా  వ్యవసాయానికి ఎంతో మేలు జరగనుంది.

జలవిద్యుత్ కేంద్రం ప్రత్యేకతలు..
పోలవరం జలవిద్యుత్ కేంద్రం 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో 12వెర్టికల్ కెప్లాన్ టర్బైన్లు ఉంటాయి. ఒక్కో టర్బైన్ 80 మెగావాట్ల కెపాసిటీ ఉంటుంది. వీటిని భోపాల్ కు చెందిన బీహెచ్ ఈ ఎల్ సంస్థ రూపిందించింది. ఇవి ఆసియాలోనే అతిపెద్దవి. వీటికి సంబంధించి ఇప్పటికే మోడల్ టెస్టింగ్ కూడా పూర్తయింది. వీటికోసం 12 ప్రెజర్ టన్నెల్స్ తవ్వాల్సి ఉంటుంది. ఒక్కో టన్నెల్ 145మీటర్లు పొడవునా.. 9మీటర్లు డయాతో తవ్వుతారు. వీటికి 12 జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్లు  ఉంటాయి. ఒక్కోటి 100 మెగావాట్లు సామర్థ్యంతో ఉంటాయి. పవర్ ప్రాజెక్టు కోసం 206 మీటర్లు పొడవునా అప్రోచ్ ఛానెల్, 294మీట‌ర్ల‌ వెడల్పు తవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి డ్రాయింగ్స్, మోడల్స్ రూపొందించే పనులు సైతం పూర్తి కావొచ్చాయి.

పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. అందులో భాగంగానే ఈ రోజు అత్యంత కీలకమైన ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులకు ఏపీ జెన్‌కో ఎస్ఈ శేషారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కీలకమైన జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ రివర్స్ టెండరింగ్ తరువాత 30.03.2021న పనులు ప్రారంభించింది. ఇప్పటికే 18.98 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తి చేసింది. పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులలో జలవనరుల శాఖ తవ్వకం పనులను పర్యవేక్షిస్తుండగా,కీలకమైన ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు, జలవిద్యుత్ కేంద్రానికి సంబంధించిన మిగిలిన అన్నిపనులను జెన్‌కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు అనుకున్నసమయానికే  పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను రాష్ట్రప్రజలకు అందించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ప్రభుత్వ సహాకారంతో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ మేఘా ప‌నులను వేగవంతం చేసింది. 

Back to Top