నిమ్మగడ్డ లేఖపై నిజాలు నిగ్గు తేల్చాలి

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి 
 

 విజయవాడ :  ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కేంద్రానికి రాసిన లేఖపై సీఐడీ అధికారులు నిజాలు నిగ్గు తేల్చాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి డిమాండు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మొదట తాను కేంద్రానికి లేఖ రాయలేదని ఓ జాతీయ చానల్‌తో చెప్పారని గుర్తు చేశారు. ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి ఆ లేఖపై దర్యాప్తు చేయాలని పోలీసులను కోరితే..అప్పుడు తానే రాశానని చెప్పారన్నారు. ఇలా రెండు మాటలు చెప్పాల్సిన అవసరం ఏముందన్నారు. ఆ లేఖ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిందేనని అనుమానం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌ సారధ్యంలో ఇదంతా జరిగిందని ఆరోపించారు. 

ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది
రమేష్‌కుమార్‌ తన కార్యాలయం నుంచి లేఖ రాస్తే..ఆ వివరాలు ల్యాప్‌ టాప్‌ నుంచి ఎందుకు డిలీట్‌ చేశారని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు.  ఆధారాలు ధ్వంసం చేసినట్టు నిమ్మగడ్డ అడిషనల్ పీఎస్‌ సాంబ మూర్తి సీఐడీ అధికారుల ఎదుట అంగీకరించారని తెలిపారు. ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్‌ ద్వారా లేఖను డెస్క్ టాప్‌లో వేసినట్టు సాంబ మూర్తి చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ లేఖను తర్వాత వాట్సాప్ వెబ్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపారని,  ఆ లేఖను మొబైల్ నుంచి  రమేష్ కుమార్ కేంద్రానికి పంపించారన్నారు. ల్యాప్ టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు, పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. అనంతరం డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు. లేఖకు సంబంధించి అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో సమాధానం చెప్పాలని లక్ష్మీ పార్వతి డిమాండు చేశారు.   

Back to Top