చంద్రబాబు అండ్ కో.. ఇంకా కట్టుకథలు ఆపండి

మాజీ మంత్రి కురసాల కన్నబాబు

సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు

ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు

ప్రజా సమస్యలపై నిబద్ధతతో వైయ‌స్ఆర్‌సీపీ ముందుకెళ్తోంది

ఏడేళ్ల బాలిక శవమై తేలితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. 

కాకినాడ జిల్లా: చంద్రబాబు అండ్ కో.. ఇంకా కట్టుకథలు ఆపి పాల‌న‌పై, హామీల అమ‌లుపై పెట్టాల‌ని వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు హిత‌వు ప‌లికారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అన్నారు,. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం స్పష్టం చేసింది. డైవర్షన్‌ పాలిటిక్స్‌ కోసం చంద్రబాబు శ్రీవారిని వాడుకున్నారన్నారు.

ప్రభుత్వాన్ని నడిపిస్తున్న చంద్రబాబు.. తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేశారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగింది. గత ప్రభుత్వంపై బురద చల్లి రాద్ధాంతం చేశారు. చంద్రబాబు అండ్‌ కో ఇంకా కట్టుకథలను ప్రచారం చేస్తున్నారు. వైయ‌స్ జగన్‌ను తగ్గిస్తున్నామని అనుకుంటూ.. టీటీడీ విశిష్టతను దెబ్బతీస్తున్నార‌ని కన్నబాబు మండిపడ్డారు.

‘‘ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ఒక వైపు వరదలు, పంట నష్టపోయిన రైతులను పట్టించుకోవడం లేదు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు అవస్థలు పడుతున్నారు. స్టీల్ ప్లాంట్‌లో 4 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నారు. పుంగనూరులో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. యువతులను రకరకాలుగా వేధిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమస్యలను గాలికి వదిలేసి మంచి ప్రభుత్వం అంటూ చెప్పుకుంటున్నారని కన్నబాబు నిలదీశారు.

 ప్రజా సమస్యలపై నిబద్ధతతో వైయ‌స్ఆర్‌సీపీ ముందుకెళ్తోంది. నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతోంది. మా ప్రభుత్వ హయాంలో నిత్యావసర ధరలు పెరిగితే.. మార్కెట్ స్థిరీకరణ నిధులతో తక్కువగా ప్రజలకు అందించాం. కూటమి ప్రభుత్వంలో ధరలను ఎక్కడైనా తగ్గించారా.?. ఇసుక దొరకకపోవడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. గతంలో ట్రక్కు ఇసుక రూ.16 వేలకు దొరికితే.. ఇప్పుడు రూ.30 వేలకు దొరకే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో స్టాక్ యార్డ్‌లలో నిల్వ చేసిన ఇసుక ఏమైపోయింది అంటూ కన్నబాబు ప్రశ్నించారు.

విశాఖ ఉక్కును కాపాడేందుకు ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. మెడికల్ సీట్లను వదులుకునేలా చేశారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. వరదలకు.. అనావృష్టికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది. ఈ క్రాప్ లేదు.. ఈ-కేవైసీ జరగడం లేదు. అసలు సమస్యలను వదిలేశారు. ఏడేళ్ల బాలిక శవమై తేలితే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. టీటీడీ దేవస్థానం చాలా పవిత్రమైన ప్రదేశం. అక్కడ చంద్రబాబు నామ‌స్మరణ జరుగుతోంది. తిరుమల పవిత్రతను కాపాడటం లేదు. జగన్‌ను లక్ష్యంగా చేసుకునే విష ప్రచారం చేస్తున్నార‌ని కురసాల కన్నబాబు మండిపడ్డారు.

Back to Top