విశాఖపట్నం: ప్రభుత్వ ఆస్తుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. రుషికొండ నిర్మాణాలు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి చెందినవిగా చూపించేందుకు టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి. వాటర్ ప్రాజెక్ట్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం, కురపం కాలేజీ, మూలపేటలో పోర్టు నిర్మాణం, పలు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చూపించండి అని సలహా ఇచ్చారు. టీడీపీ అనుకూల మీడియాలో జరుగుతున్న విష ప్రచారంపై సోమవారం విశాఖలో అమర్నాథ్ మాట్లాడారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలపై టీడీపీ రాజకీయం చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. అదేదో జగన్ మోహన్ రెడ్డి గారి సొంత ఇల్లులా లేదా వైయస్సార్ సీపీకి చెందిన భవనాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం తగదని హితవు పలికారు. టీడీపీ తీరును తప్పుపట్టారు. మీకు చేతనైతే గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం నిర్మించిన భవనాలు, అభివృద్ధిని కూడా చూపించాలని సవాల్ చేశారు. విశాఖపట్నంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు, వారి పార్టీకి చెందిన నాయకులు పెద్ద ఎత్తున రుషికొండ మీద జరిగిన ప్రభుత్వ కట్టడాలకు సంబంధించి, ప్రభుత్వంలో భాగస్వాములైన ఒక డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నిర్మాణాలను, గత మా ప్రభుత్వంలో నిర్మించిన భవనాలను అవేదో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెందిన సొంత భవనాల్లాగా, లేదా జగన్ మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత భవనాల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రజలను పక్కదోవపట్టించే ప్రయత్నం జరుగుతోంది. స్థానిక శాసనసభ్యులు, చాలా మంది వారి కార్యకర్తలను, చాలా మంది మీడియా సహచరులను లోపలికి తీసుకెళ్లి చేసిన ప్రచారం, తర్వాత జరిగిన దుష్ప్రచారం.. ఇవన్నీ ఒకసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతున్నాం. రుషికొండ మీద గడచిన మూడు నాలుగు సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో, దాని మీదే ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనే కార్యక్రమాలు చేశారో అనేక సందర్భాల్లో చూశాం. అనేక కోర్టులకు వెళ్లారు, పర్యావరణానికి సంబంధించి కేసులు వేశారు. వీటన్నింటినీ అధిగమించి నిర్మాణాలను పూర్తి చేసి నాలుగైదు నెలలక్రితం ప్రారంభించాం. ఈ శాశ్వత భవనాలను ప్రభుత్వం దాన్ని ఏరకంగా ఉపయోగించుకోవాలని చూడటం మానేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రారంభానికి ముందే త్రీమెన్ కమిటీ వేశాం విశాఖపట్నం అనేది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్డులో నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్లాలనే ఆలోచన చేసినప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులతో త్రీ మెన్ కమిటీ వేయడం జరిగింది. టూరిజం శాఖకు చెందిన ఈ భవనాలు అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తెలియజేశారు. విశాఖపట్నం అంతా వారు పర్యటించారు. విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసిన నేపథ్యంలో ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయని వారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆ కమిటీ నిర్ణయం తర్వాత కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల లోపలికి అనుమతించడం లేదని ఆరోజు నేను మంత్రిగా చెప్పాను. ఇవన్నీ పట్టించుకోకుండా మీకు అధికారం ఇచ్చారు కదా అని ఎక్కడ పడితే అక్కడకు వెళ్లిపోయి చూపించేస్తారా? మీ చేస్తున్న పనులు చూసిన తర్వాత... ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. ఈ సమయంలో మేము మాట్లాడకూడదనుకున్నాం. మీకు 6 నెలలో సంవత్సరమో సమయం ఇవ్వాలి అని అనుకున్నాం. మేము ప్రజలకు చాలా మంచి చేశాం. మాకన్నా మంచి చేస్తారని ఆశించి మీకు ఓట్లు వేశారు. దాన్ని ఏరకంగా నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం చేయాలి తప్ప.. ప్రజలను అనవసరంగా తప్పుదోవ పట్టించి ఇంకా అనవసరంగా మీరు విమర్శలు చేయాలన్న ప్రయత్నం మానుకుంటే మంచిది. చంద్రబాబునాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్నది కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునే క్రమంలో వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వెళ్లి ప్రయివేటు హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రయివేటు హోటల్ కు చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ లేదా వారికున్న ప్రయారిటీస్, ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాల విమర్శలు చేయాల్సి వస్తుంది. ఈ సమయంలో మేము విమర్శలు చేయడానికి సిద్ధంగా లేం. మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి చూసి తట్టుకోలేకపోతున్నారనే దుష్ప్రచారాన్ని మా మీద చేసే ప్రయత్నం చేస్తారు. మేము నిర్మాణాత్మకంగా ప్రజల పక్షాన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లుంటే వాటిని నిర్మాణాత్మకంగా విమర్శించాలనేది మా తాపత్రయం. ఆ ప్రకారం మేము వెళ్తాం తప్ప ఇటువంటివి చేసి మళ్లీ అనవసరంగా లేనిపోనివి ఇప్పటి నుంచి ఈ రకంగా ఒక ప్లాట్ ఫాం వేయొద్దని కోరుతున్నాం. ప్రముఖులు వస్తే విడిదికి ఉపయోగించవచ్చు.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఇప్పటికీ విశాఖపట్నానికి గవర్నర్ వస్తేనో, రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్లి ఓ ప్రయివేటు హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గెస్ట్ హౌసుల్లోనో పెట్టాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. అందులోకూడా సరైన సదుపాయాలు లేవు. ఇప్పుడు నిర్మించిన భవనాలను వినియోగించుకోండి. రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసే బాధ్యత తీసుకుంటామని మొన్ననే ముఖ్యమంత్రి ప్రకటించారు. అనేక మంది ప్రముఖులు వచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ కు మనం హెడ్ క్వార్టర్ గా ఉన్న క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి గారు వచ్చే సందర్భాలు ఉన్నాయి. మొన్ననే మెడికల్ ఏఎంసీకి సంబంధించిన ఫంక్షన్ కు ఉపరాష్ట్రపతి వచ్చారు. అనేక మంది దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తుంటారు. వీటిని వినియోగించండి. ఇక్కడకొచ్చి రేపటి నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు ఉండరు కదా? లేకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరు కదా? ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్ మెంట్ కు సంబంధించిన నిర్మాణాలు అవి. వీటిని ప్రజలకు వినియోగిస్తారా? లేకపోతే టూరిజానికి వినియోగిస్తారా? ప్రభుత్వ అతిథి గృహాలుగా వినియోగిస్తారా? అన్నది నిర్ణయం తీసుకోండి. గతంలో తాత్కాలిక భవనాలకే వేల కోట్లు ఖర్చు మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. నిన్ననే మంత్రి మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. మేము ఆ మాట మొదటి నుంచి చెబుతున్నాం. ఈ 5 సంవత్సరాలు అయ్యేసరికి ఆ లక్ష.. 2 లక్షల కోట్లు అవ్వొచ్చు. ఏదైనా మీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వెళ్తుంది. ఈ చేసే క్రమంలో ఎందుకు అనవసరంగా జగన్ మోహన్ రెడ్డి గారిమీద మా పార్టీ మీద బురదజల్లుతున్నారు. అమరావతిలో దాదాపు గత 5 సంవత్సరాల్లో సుమారు ఐదారు వేల కోట్ల రూపాయలు కేవలం తాత్కాలిక భవనాలకు ఖర్చు మాత్రమే పెట్టారు. కానీ విశాఖలో చేసినవి శాశ్వత నిర్మాణాలు అవి. ప్రభుత్వానికి సంబంధించినవి. ప్రభుత్వం వినియోగించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం మానేసి వెనక ఉన్న కార్యకర్తలందరినీ అందులోకి తీసుకుని వెళ్లారు. రేపు చీఫ్ గెస్టులు, రాష్ట్రపతి, ప్రధాని వస్తారు. మీరు మొత్తం కెమెరాల్లో ప్రతి ఒక్కటీ చూపించేశారు. అంటే వీవీఐపీలు ఉండే భవనాలను, వాటి బ్లూ ప్రింట్‌ను బయటపెట్టినట్టేకదా? అభివృద్ధి కార్యక్రమాలు కూడా చూపించండి గత 5 సంవత్సరాల్లో మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా అలాగే శాసనసభ్యుల్ని తీసుకెళ్లి చూపించమనండి. భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం జరుగుతోంది చూపించమనండి. విజయనగరం మెడికల్ కాలేజీ, ఉద్దానంలో కట్టిన హాస్పిటల్, వాటర్ ప్రాజెక్టు, పాడేరు, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీల నిర్మాణం, సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పార్వతీపురం మెడికల్ కాలేజీ, కురుపాం ఇంజనీరింగ్ కాలేజీ... ఇవన్నీ చూపించమనండి. కొన్ని నిర్మాణాలు పూర్తయిపోయాయి. మూలపేటలో పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు.. ఉత్తరాంధ్రకు సంబంధించి ఇన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టాం. ఇవన్నీ మర్చిపోయి అది తీసుకొచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు సొంత భవనంలా చూపిస్తారా? నిజమైన ఆక్రమణలు చూపిస్తే బాగుండేది ఇదే గంటా శ్రీనివాసరావు.. 2019లో విశాఖపట్నం రాజధాని అని నిర్ణయం ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించారు. మరి ఆయనకు గుర్తుందో లేదో తెలియదు గానీ నాకైతే బాగా గుర్తుంది. గంటా శ్రీనివాసరావు విశాఖపట్నాన్ని రాజధాని చేయడం మంచి నిర్ణయం అని స్వాగతించారు. మరి ఆయన ఆలోచనలు మారి ఉండొచ్చు. అధికారంలో ఉన్నవారు ఈరకమైన దుష్ప్రచారం చేయడం సమంజసం కాదు. అవి ప్రభుత్వ భవనాలు అన్నది ఇప్పటికైనా గ్రహించాలి. మొదటి నుంచి రుషి కొండను ఆక్రమించుకుంటున్నారనే దుష్ప్రచారం చేశారు. ఆక్రమణలు జరిగింది దాని ఎదురుగా ఉన్న గీతం కాలేజీలోనే. దాదాపు 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించున్నారు. దాన్ని బయటపెట్టే కార్యక్రమం చేశాం. అందులో 13 ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేశారు. వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే స్థానిక శాసనసభ్యుడు ఆయనకు కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎదురుగా ఉన్న గీతం కాలేజీని కూడా చూపించి ఉంటే బాగుండేది. 1986-87లోనే ఇక్కడ టూరిజం ప్రాజెక్టు రుషికొండలో మొదటి నుంచి టూరిజం డిపార్ట్ మెంట్ పేరిట ఉన్న ప్రాజెక్టు అది. నాకు తెలిసి 1986లోనో 1987లోనో ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్టు నిర్మించే కార్యక్రమం చేశారు. అప్పుడు కూడా కొండలు కొట్టే కట్టారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ చెట్లు కొట్టకుండా కొత్త టెక్నాలజీ వాడి నిర్మాణాలు చేశారా? చెట్లు కొట్టే అక్కడ హరిత టూరిజం ప్రాజెక్టు కట్టారు. విశాఖపట్నానికి ఒక మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏముంది చెప్పండి? గతంలో చంద్రబాబు వచ్చినా ప్రయివేటు హోటల్స్ లోనో ఎక్కడో ఉండే పరిస్థితులు ఉండేవి. ఏది ఉన్నా అది ప్రభుత్వానికి సంబంధించినది. ఇప్పటికీ ఆ భవనాలన్నీ టూరిజం డిపార్ట్ మెంట్ పేరిటే ఉన్నాయి. ఏ రకంగా వినియోగించుకోవాలన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. దీన్ని ఎవరి మీదో రుద్ది ఫలానా వాళ్లది అంటే అర్థం లేదు. అనవసరంగా తప్పుడు ప్రచారం చేయొద్దని మా మనవి. మీరే రేట్లు ఫిక్స్ చేస్తారా? ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో రకమైన రేటు ఉంటుంది. ఇప్పుడు కెమెరాలను, అనుచరులను తీసుకెళ్లి అన్నీ చూపించారు. వాళ్లే రేట్లు ఫిక్స్ చేస్తున్నారు. మీకు తెలుసా? అధికారికంగా రికార్డు ఏమైనా ఉందా? మైకుల ముందు ఏది పడితే అది చెప్పేయడం కరెక్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో తాత్కాలిక భవనాలు కట్టారు. ఎంత ఖర్చయ్యింది? చదరపు అడుగుకు రూ.10 వేలు. దాదాపు రూ.7 వేల కోట్లు కేవలం సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఖర్చు పెట్టారు. కానీ.. రుషికొండలో ఉన్నవి శాశ్వత భవనాలు. 30-40 సంవత్సరాలు శాశ్వతంగా ఉండాలి. ప్రజలకు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ అది. అది ఎవరూ తీసుకెళ్లిపోయేది కాదు కదా. మళ్లీ గెలుపొందితే విశాఖ నుంచే పాలన చేసేవాళ్లం.. ఆరోజు మా ప్రభుత్వ విధానం ప్రకారం మళ్లి గెలుపొందితే విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలన్నదే. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పాం. అయితే, ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలో ఆలోచించాలి. చంద్రబాబు గారు విశాఖను రాజధాని చేయాలన్నది మా కోరిక. కానీ వారి నిర్ణయం వారి విధానం వారికి అమరావతి. మేము అధికారంలోకి వచ్చి ఉంటే ముఖ్యమంత్రిగారు అక్కడి నుంచి పరిపాలన చేసే వారు. దాన్ని మాకోసం కట్టుకున్నామన్నట్లుగా చిత్రీకరించడం కరెక్టు కాదు.’’ అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.